అగ్రెసివ్ కీమోథెరపీని తీసుకునే వారి పిల్లలు భవిష్యత్‌లో సంతానోత్పత్తిని నిలబెట్టేలా కీలక ముందడుగు పడింది. ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు సిలికాన్ చిప్‌లో వీర్యాన్ని తయారు చేశారు. 

అగ్రెసివ్ కీమోథెరపీని తీసుకునే వారి పిల్లలు భవిష్యత్‌లో సంతానోత్పత్తిని కోల్పోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పిల్లల్లో సంతానోత్పత్తిని సంరక్షించడం, సంతానం లేని పురుషులకు చికిత్స చేయడంపై (వృషణాల్లో లోపాల కారణంగా) ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పరిశోధకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగెవ్ నేతృత్వంలోని పరిశోధనా బృందం .. టెక్నియన్- ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పరిశోధనా బృందంతో కలిసి మైక్రోఫ్లూయిడ్ సిస్టమ్ ద్వారా ప్రయోగశాలలో స్పెర్మ్ (వీర్యం)ను సృష్టించే ప్రక్రియను మెరుగుపరిచే ఫ్లాట్‌ఫామ్‌ను రూపొందించడంలో విజయం సాధించింది. ఇందుకోసం సిలికాన్ చిప్‌లను వీరు వినియోగించారు. వీరి పరిశోధనను ఇటీవల పీర్- రివ్యూడ్ జర్నల్‌ బయోఫ్యాబ్రికేషన్‌లో ప్రచురించారు. 

నెగెవ్‌లోని బెన్ - గురియన్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ ఫ్యాకల్టీలోని శ్రగా సెగల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఇమ్యునాలజీ అండ్ జెనెటిక్స్‌కు చెందిన ప్రొఫెసర్ మహమౌద్ హలేహుల్.. లాబోరేటరీ నుంచి స్పెర్మ్ సెల్స్‌ను ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొన్నారు. ఇది రోగి శరీరంలోని క్యాన్సర్ కణాల దాడి వంటి పరిమితులను దాటవేస్తుంది. స్పెర్మ్ కణాలను ఉత్పత్తి చేయని యువ ఎలుకల్లో వీర్య కణాల పెరుగుదలకు సంబంధించి నమూనాను వీరు అధ్యయనం చేశారు. తద్వారా ప్రయోగశాలలో వున్న పరిస్థితులతో సహజ వాతావరణానికి చాలా దగ్గరగా వృషణ కణాలను పెంపొందించే ప్రక్రియను అభివృద్ధి చేయడం సాధ్యపడింది. అధ్యయనం కోసం రూపొందించిన ప్రత్యేక చిప్‌ను ఉపయోగించి పూర్తి 3డీ వ్యవస్థను నిర్మించారు. ఇందులో మైక్రోఫ్లూయిడ్ ఛానెల్స్ వుంటాయి. ఇవి వృద్ధి కారకాలు, వృషణాల నుంచి కణాలు లేదా శరీర కణజాలం నుంచి ఏదైనా ఇతర కణాలను జోడించడానికి అనుమతిస్తాయి. 

కౌమార దశలో వున్న ఎలుకలను ఉపయోగించి వినూత్న వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. 5 నుంచి 7 వారాల తర్వాత స్పెర్మ్ ఏర్పడే ప్రక్రియలో అధునాతన దశ కణాలను కలిగి వున్న సెమిని ఫెరస్ ట్యూబ్ లాంటి నిర్మాణాలను పరిశోధకులు గమనించారు. రాబోయే రోజుల్లో శాస్త్రవేత్తలు మానవులపై వీటిని ప్రయోగించి.. పనితీరుని అంచనా వేయనున్నారు. 

ఈ సందర్భంగా ప్రొఫెసర్ మహమౌద్ మాట్లాడుతూ.. ఈ అధ్యయనం స్పెర్మ్ కణాలను సృష్టించే ప్రక్రియలో కొత్త హోరిజోన్‌ను తెరుస్తుందన్నారు. ఇది భవిష్యత్తులో వంధ్యత్వానికి సంబంధించి చికిత్సా వ్యూహాలలో, పిల్లల సంతానోత్పత్తిని కాపాడటంలో మైక్రోఫ్లూయిడ్ ఆధారిత సాంకేతికతలను అమలు చేయడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. యుక్త వయస్సు వారిలో సంతానోత్పత్తిని దెబ్బతీసే అగ్రెసివ్ కీమోథెరపీ, రేడియో థెరపీ చికిత్సలకు ఇది విరుగుడుగా మారుతుందన్నారు. అంతేకాకుండా ఈ వ్యవస్థ పురుషుల సంతానోత్పత్తిపై మందులు, టాక్సిన్స్ ప్రభావాన్ని పరిశీలించడానికి ఒక వినూత్నమైన వేదికగా కూడా ఉపయోగపడుతుందని మహమౌద్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రొఫెసర్ ఎమెరిటస్ ఈటాన్ లునెన్ ఫెల్డ్ (బెన్ గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగెవ్ అండ్ సోరోకా మెడికల్ సెంటర్‌లోని ఫ్యాకల్టీ ఆఫ్ హెల్త్ సైన్సెస్), ప్రొఫెసర్ గిలాడ్ యోసిఫోన్ (టెల్ అవీవ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ మెంబర్)తో పాటు నెగెవ్‌లోని బెన్ గురియన్ యూనివర్సిటీ, టెక్నియన్ ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ఇంజనీరింగ్ విభాగానికి చెందిన షోలోమ్ షుచాట్, పీహెచ్‌డీ విద్యార్ధులు అలీ అబుమాడిగెమ్‌లు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఈ అధ్యయనానికి (నెం.3425/20) ఇజ్రాయెల్ సైన్స్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్), చైనీస్ ఫౌండేషన్ ఫర్ నేచురల్ సైన్సెస్ (ఎన్ఎస్‌ఎఫ్‌సీ) (ఐఎస్ఎఫ్-ఎన్‌ఎస్ఎఫ్‌సీ) సహకరించాయి.