జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో భారత్-పాకిస్తాన్‌లో మధ్య ఉద్రిక్తతలు తారా స్ధాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారుల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి పరిస్ధితిల్లో భారత్‌ అమ్మాయి.. పాక్ అమ్మాయి వివాహం చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.

ఇండియాకు చెందిన బియాంక మైలీ... పాకిస్తాన్‌కు చెందిన సైమా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొలంబియన్-ఇండియన్ అయిన బియాంక మైలీ అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో సైమాను కలిసింది. వీరి పరిచయం.. స్నేహంగా మారి ప్రేమగా మారింది.

ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్న వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బియాంక క్రిస్టియన్ కాగా.. సైమా ముస్లిం కావడంతో పాటు ఇద్దరు శత్రు దేశాలకు చెందిన వారు అయినప్పటికీ సంప్రదాయం, ఆచారాల ప్రకారం ఇరువురి కుటుంసభ్యులు, స్నేహితులు, బంధువుల మధ్యీ వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

బంగారు రంగు చీర ఎంబ్రాయిడరీ చీర.. నెక్లేస్, నుదుట బొట్టు, చేతి నిండా గాజులతో బిమాంక పెళ్లి కూతురిలా కనిపిస్తే.. నల్లటి షెర్వానీలో సైమా వరుడిగా వేదిక మీదకు వచ్చింది. ‘‘ నీ ప్రేమతో జీవితం మరింత సంతోషంగా మారింది’’ అంటూ బియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం భారత్, పాకిస్తాన్‌లలో వైరల్ అయ్యాయి.

కొందరు వీరి పెళ్లిని తప్పుబడుతుండగా.. ఇంకొందరు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇదే నెలలో మరో ఇండో-పాక్ యువతులు అంజలి చక్ర, సుందాస్ మాలిక్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే.