ట్రెంట్‌ బ్రిడ్జ్‌: ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్నమూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 329 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆరంభంలో తడబడింది. తొలిరోజు లంచ్ బ్రేక్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చినప రహానే, కోహ్లీలు భారత్ స్కోర్ ను పెంచారు. రహానే 81 పరుగులు చెయ్యగా కోహ్లీ 97 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. వీరిద్దరి భాగస్వామ్యంతో తొలిరోజు భారత్ 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ను ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ కోలుకోలేని దెబ్బతీశాడు. తన బౌలింగ్ తో రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ లను ఉక్కిరి బిక్కిరి చేశాడు. 

బ్రాడ్, అండర్సన్ అద్భుతమైన స్వింగ్ తో వికెట్లు తీశారు. యువ వికెట్ కీపర్ బ్యాట్సమన్ రిషబ్ పంత్(24) 51 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ తో క్రీజ్ లో నిలదొక్కుకున్నాడు. రిషబ్ అర్థ సెంచరీ చేస్తాడని అంతా ఆశిస్తున్న సమయంలో బ్రాడ్ మళ్లీ తన బౌలింగ్ తో చెలరేగిపోయాడు. 92వ ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బ్రాడ్ వేసిన 94ఓవర్ మూడో బంతికి అశ్విన్ (14)క్లీన్ బౌల్డ్ తో పెవిలియన్ బాట పట్టాడు. 

అండర్సన్ వేసిన ఆ తర్వాత ఓవర్లో షమీ (3),భూమ్రా డకౌట్ అయ్యారు. కేవలం ఆరుపరుగుల తేడాతో టీం ఇండియా చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు స్టువర్ట్‌ బ్రాడ్‌, అండర్సన్‌ టీం ఇండియా భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. వోక్స్, అండర్సన్, బ్రాడ్ చెరో మూడు వికెట్లు తియ్యగా రషీద్ ఒక వికెట్ తీశాడు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇంగ్లాండ్ గడ్డపై చేసిన అత్యధిక తొలి ఇన్నింగ్స్‌ స్కోరు ఇదే (329)కావడం గమనార్హం.