న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు పాకిస్తాన్ మరోసారి ప్రయత్నించింది. పాక్ ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టింది.ఐక్యరాజ్యసమితిలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్లో కాశ్మీర్ సమస్య కూడ ఒకటని పాకిస్తాన్ ప్రకటించింది.

ఈ వాదనను భారత్ తిప్పికొట్టింది.కుయుక్తులను మాని ఉగ్రవాదాన్ని రూపుమాపడంపై కేంద్రీకరించాలని భారత్ పాకిస్తాన్ కు హితవు పలికింది.ఐక్యరాజ్యసమితి 75 వ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఖురేషీ వీడియో సందేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, నిర్ణయాలు తప్పుబట్టేవిగా  ఉన్నాయన్నారు. కాశ్మీర్ విషయంలో పాక్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని భారత్ తిప్పికొట్టింది.

తప్పుడు ఆరోపణలు చేయడం పాకిస్తాన్ కు మారిందని పాకిస్తాన్ పై ఐక్యరాజ్యసమితిలో భారత కార్యదర్శి విదిష మైత్ర విమర్శించారు.తమ అంతర్గత విషయాల్లో పాకిస్తాన్ జోక్యం  చేసుకొంటుందని ఆమె మండిపడ్డారు.  పాకిస్తాన్ వాదనను ఆమె తీవ్రంగా ఖండించారు.ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పాకిస్తాన్ దృష్టి పెట్టాలని ఆమె హితవు పలికారు.

పాకిస్తాన్ పలుమార్లు కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికల్లో ప్రస్తావించేందుకు ప్రయత్నించింది. చాలా వేదికల్లో పాక్ కు కాశ్మీర్ విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. అయినా కూడ పాక్ బుద్దిలో మార్పు రాలేదు. పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తోంది.