ఇస్తామాబాద్: పాకిస్తాన్ ప్రధానిగా పీటీఐ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఘన విజయం సాధించారు. శుక్రవారం పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో ఆయన ప్రత్యర్థి షాబాజ్ షరీఫ్ ను చిత్తు చేశారు. 

ఇమ్రాన్‌కు అనుకూలంగా 176 ఓట్లు రాగా, ముస్లీం లీగ్-నవాజ్ పార్టీ అధినేత షాబాజ్ షరీఫ్‌కు 96 ఓట్లు మాత్రమే పడ్డాయి. మెజారిటీకి 172 ఓట్ల అవసరం కాగా, పీపీపీ సహా కొన్ని విపక్ష పార్టీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. దీంతో ఇమ్రాన్ సునాయసంగా విజయం సాధించారు
 
గత నెలలో జరిగిన పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ విజయం సాధించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీటీఐ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. చిన్న పార్టీలతో కొద్ది రోజులుగా సాగుతున్న మంతనాలు ఫలించడంతో పాక్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టేందుకు ఇమ్రాన్ ఖాన్ కు మార్గం ఏర్పడింది.
 
65 ఏళ్ల వయసున్న తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ శనివారం నాడు పాకిస్తాన్ 22వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1992లో ప్రపంచ క్రికెట్ కప్‌ నెగ్గిన పాక్ జట్టుకు ఇమ్రాన్ కెప్టెన్‌గా వ్యవహరించారు. 

ఇదిలావుంటే, ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇస్లామాబాద్ చేరుకున్నారు.