ఐక్యరాజ్యసమితి ప్రపంచదేశాలను ఒకే చోటికి చేర్చే వేదిక. అటువంటి చోట దేశాధినేతలను ‘హౌ డేర్ యూ’’ అని నిలదీసిందో 16 ఏళ్ల. వివరాల్లోకి వెళితే.. స్వీడన్‌కు చెందిన గ్రేటా థన్‌బెర్గ్ ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులపై పోరాటం చేస్తోంది.

కొద్దిరోజుల క్రితం అమెరికా వైట్‌హౌస్‌ ముందు ఫ్లకార్డులు పట్టుకుని నిరసన చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సు‌లో ప్రపంచాధినేతలు మాట్లాడటానికి ముందు గ్రెటా మాట్లాడింది.

తాను ఈ రోజు ఇక్కడ ఉండాల్సిన దానిని కాదని స్కూల్లో చదువుకోవాల్సిందని, కానీ పరిస్ధితులు తనను ఇక్కడి వరకు తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘ మీరు మా కలలను కల్లలు చేశారని.. బాల్యాన్ని చిదిమేశారని, భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేశారంటూ థన్‌బర్గ్ మండిపడింది. మీ చర్యల కారణంగా పర్యావరణం నాశనమైపోతోందని ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

కానీ ఇవేమీ మీకు పట్టదని.. డబ్బు, వృద్ధి అంటూ కథలు చెబుతున్నారని హౌ.. డేర్ యూ అంటూ ఘాటుగా ప్రశ్నించింది. మా తరాన్ని మీరు మోసం చేస్తున్నారని, మిమ్మల్ని ఎంతమాత్రం క్షమించబోమని గ్రెటా మండిపడ్డారు.

గడిచిన 30 ఏళ్లలో ఈ సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని... మా సమస్యలను వింటున్నామని మీరు చెబుతున్నారు. ఒకవేళ నిజంగా పరిస్ధితిని అర్ధం చేసుకుని ఉంటే సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యేవారు కాదని గ్రేటా తెలిపారు.

ప్రకృతికి హానీ కలిగించే వాయువులను నివారించడంలో విఫలమై, నూతన తరానికి ఆరోగ్యకర వాతావరణాన్ని అందించడం లేదని.. త్వరలోనే మా వేదన ఎంత తీవ్రమైనదో తెలుస్తుందని గ్రేటా పేర్కొన్నారు.

దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఓ అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తోన్న సంతోషమైన యువతిలా ఆమె కనిపిస్తోందని, ఆమెను చూడటం ఆనందంగా ఉందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.