కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. తొలుత ఒక్కసారి కరోనా వైరస్ వచ్చి పోతే.. మళ్లీ రాదని.. వారి శరీరంలో యాంటీ బాడీస్ తయారౌతాయని అందరూ భావించారు. అయితే.. అది తప్పని కూడా నిరూపితమైంది. ఒకసారి కరోనా సోకినవారికి మళ్లీ కరోనా వస్తోందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. ఇటీవల కొందరికి అలా సోకింది కూడా. 

అయితే.. ఇప్పుడు మరో భయానక వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. హాంకాంగ్ లో ఇటీవల ఓ వ్యక్తికి రెండు రకాల కరోనా వైరస్ లు ఒకేసారి దాడి చేశాయి. చైనాకు చెందిన సదరు వ్యక్తి ఏప్రిల్‌లో హాంగ్‌కాంగ్‌కు వెళ్లిన సందర్భంగా అధికారులు అతడు కరోనా బారిన పడ్డట్టు గుర్తించారు. ఆ తరువాత అతడు కోలుకున్నాడు. మళ్లీ ఇంత కాలం తరువాత అతడిని మళ్లీ కరోనా కాటేసింది. కానీ అతడిలో కరోనా రోగ లక్షణాలేవీ బయటపడలేదు. అయితే.. బాధితుడిని అధ్యయం చేసిన హాంగ్‌కాంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని గుర్తించారు.

ప్రస్తుతం అతడి‌ శరీరంలో ఉన్న వైరస్.. తొలిసారి కరోనా వ్యాధిని కలుగ చేసిన వైరస్‌ కంటే భిన్నమైనదని వారు గుర్తించారు. అతడు రెండు భిన్నమైన వైరస్ స్ట్రెయిన్ల బారిన పడ్డాడని వారు తేల్చారు. వైరస్‌ల జన్యుక్రమాన్ని పరిశీలించిన మీదట వారు ఈ అంచనాకు వచ్చారు. అయితే.. కరోనానుంచి కోలుకున్న తరువాత బాధితుడిలో రోగనిరోధక శక్తి బలోపేతమవుతుందని, అందుకే ప్రస్తుతం అతడిలో కరోనా లక్షణాలు అంతగాలేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచంలో ఇటువంటి కేసు వెలుగు చూడటం ఇదే తొలిసారని వారు చెబుతున్నారు.