న్యూయార్క్: డైటింగ్ పుణ్యమా అంటూ ఈ మధ్య కొబ్బరి నూనెకు విపరీతమైన గిరాకీ వచ్చింది. కొలెస్టరాల్ కాస్త ఉంటే చాలు ఇక కొబ్బరినూనె తాగడం మెుదలుపెడుతున్నారు. కొబ్బరినూనె తాగడం వల్ల అధిక బరువు తగ్గుతుందని...మధుమేహం తగ్గుతుందని, థైరాయిడ్ సమస్య పోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అది నిజమని ప్రజలు తాగడం మెుదలెట్టేశారు. 

అధిక బరువు తగ్గడం మాట దేవుడెరుగు కొబ్బరినూనె తాగితే కొవ్వు తగ్గక పోగా పెరుగుతుందని ఓ పరిశోధనా సంస్థ స్పష్టం చేసింది. కొబ్బరినూనె శుద్ధవిషమని హార్వార్డ్ ప్రొఫెసర్, ఎపిడమాలజిస్ట్‌ కారిన్ మిషెల్స్ హెచ్చరిస్తున్నారు. అతి చెత్త ఆహారాలలో కొబ్బరి నూనె ఒకటి అని తన పరిశోధనలో వెల్లడించారు. 
యూనివర్సిటీ ఆఫ్ ఫ్రీబుర్గ్‌లో మిషెల్స్ కోకోనట్ ఆయిల్ ఇతర పోషక లోపాలు అనే అంశంపై ప్రసంగించారు. కొబ్బరినూనెలో ఉండే గాఢమైన కొవ్వు ప్రమాదకరమైన ఎల్‌డీఎల్ పరిణామాన్నిపెంచుతుందని హెచ్చరించారు.

అయితే సమతుల ఆహారంలో కొబ్బరినూనెను కొద్ది మోతాదులో తీసుకుంటే పరవాలేదన్నారు. శృతిమించేతే గుండె జబ్బులు వస్తాయని బ్రిటీష్ న్యూట్రిషన్ ఫౌండేసన్ వెల్లడించింది. కొబ్బరినూనె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మేలు ఏమిటో ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదని  తెలిపింది.  వెన్నతో పోలిస్తే కొబ్బరినూనెలో మూడురెట్లు , 86శాతం ఎక్కువ కొవ్వు ఉంటుందని బ్రిటీష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ సీనియర్‌ డైటీషన్‌ విక్టోరియా టేలర్‌ చెప్పారు.