Saveera Parkash : పాకిస్థాన్ ఎన్నికల బరిలో తొలి సారిగా హిందూ మహిళ.. ఆమె నేపథ్యం ఏంటంటే ?
పాకిస్థాన్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా మొట్ట మొదటి సారిగా ఓ హిందూ మహిళ ఎన్నికల (pakistan national assembly elections 2024) బరిలో నిలిచింది. డాక్టర్ గా సేవలందిస్తున్న సవీరా ప్రకాశ్ (Doctor Saveera Parkash) ఈ సారి నేషనల్ అసెంబ్లీకి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు.
Doctor Saveera Parkash : పాకిస్థాన్ ఎన్నికల బరిలో హిందూ మహిళ నిలిచారు. ఆ దేశ ఎన్నికల చరిత్రలోనే ఇలా హిందూ మహిళ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. రాబోయే పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందకు హిందూ మతానికి చెందిన డాక్టర్ సవీరా ప్రకాశ్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ నుంచి నేషనల్ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు.
బునేర్ జిల్లాలో ఉన్న ఈ పీకే-25 జనరల్ స్థానానికి ప్రకాశ్ డిసెంబర్ 23న నామినేషన్ దాఖలు చేసినట్లు ‘డాన్’ పత్రిక వెల్లడించింది. ఆమె తొలిసారిగా పోటీ చేయనున్న హిందూ మహిళా అని పేర్కొంది. ప్రస్తుతం ఆ జిల్లాలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆదే పార్టీ టికెట్ పై ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.
పాకిస్థాన్లోని అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి 2022లో ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తన వైద్య వృత్తి నేపథ్యం కారణంగా మానవాళికి సేవ చేయడం తన రక్తంలోనే ఉందని ఆమె ‘డాన్’తో తెలిపారు. ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేలవమైన నిర్వహణ, నిస్సహాయతను చూస్తున్నానని, అందుకే తాను ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నాని అన్నారు.
ఈ ప్రాంతంలోని పేదల కోసం పనిచేయడంలో తన తండ్రి అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నానని సవీరా ప్రకాశ్ చెప్పారు. ఆమె తండ్రి ఓమ్ ప్రకాశ్ డాక్టర్ గా సేవలు అందించి, ఇటీవలే రిటైర్డ్ అయ్యారు. ఆయన గత 35 ఏళ్లుగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ యాక్టివ్ గా ఉన్నారు.
ప్రకాశ్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమ్రాన్ నోషాద్ ఖాన్ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘డాక్టర్ సవీరా ప్రకాశ్ బునెర్ నుండి మొదటి మహిళా అభ్యర్థి. ఈ ప్రాంతంలో మహిళలు ఇంతకు ముందు ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనలేదు. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మక క్షణం. మూసధోరణిని విచ్ఛిన్నం చేయడంలో ఆమెకు మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
కాగా.. జనరల్ స్థానాల్లో కనీసం 5 శాతం మహిళా అభ్యర్థులకు ప్రాతినిధ్యం ఉండాలని పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమె డాక్టర్ సవీరా ప్రకాశ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ లో 16వ జాతీయ అసెంబ్లీకి సభ్యులను ఎన్నుకునేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.