కరోనా వైరస్ ఎప్పటికీ అంతం కాకపోవచ్చని శాస్త్ర నిపణులు చెబుతున్నారు. ఆ వైరస్ తరుచూ కొత్త వేరియంట్ల రూపంలో నెలల వ్యవధిలో పంజా విసిరే అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ కరోనా వైరస్ లేని రోజే.. కరోనా మహమ్మారి అంతం అయినట్టు అని వివరించారు. ఒమిక్రాన్ తర్వాత మరో వేరియంట్ రావచ్చని, అది ఇంత కంటే తీవ్రత ఎక్కువ కలిగి ఉండవచ్చునని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తేస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. ఇక ఒమిక్రాన్ పీక్ స్టేజ్ ముగిసినట్టేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ, సైంటిస్టులు మాత్రం ఈ కేసుల తగ్గుదలను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. అసలు కరోనా వైరస్ ఎప్పటికీ పూర్తిగా అంతం కాకపోవచ్చని చెబుతున్నారు. కొత్త వేరియంట్లు రావచ్చని, మరిన్ని మ్యుటేషన్లు రావొచ్చని పేర్కొంటున్నారు. కాబట్టి, ప్రజలు ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలని వివరిస్తున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ గతంలో వచ్చిన స్ట్రెయిన్‌ల కంటే తక్కువ ప్రమాదకారిగా కనిపించవచ్చునని, కానీ, అత్యంత వేగంగా వ్యాపించే సామర్థ్యం కలిగి ఉండి ఆరోగ్య వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని వేయవచ్చునని చెప్పారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్‌పై తొలినాళ్లలో అధ్యయనాలు పేర్కొన్నట్టుగా అంత తేలికపాటు వేరియంట్ కూడా ఏమీ కాకపోవచ్చని హెచ్చరించారు. ఎందుకంటే.. దీని దీర్ఘకాలిక ప్రభావాలు ఇంకా బయటపడాల్సి ఉన్నదని తెలిపారు. అయితే, ఇంతటితో మ్యుటేషన్లు ముగిసినట్టూ కాదని చెప్పారు. ఒమిక్రాన్ తర్వాత కూడా మరో వేరియంట్ రాకుండా ఉండదని చెప్పలేమని వివరించారు. అది ఒమిక్రాన్ కంటే తీవ్రతతో కూడి డెల్టా వేరియంట్ తరహా ప్రభావాన్నీ వేసే గుణం కలిగి ఉండవచ్చని పేర్కొన్నారు. ప్రతి కొన్ని నెలలు ఒక సారి వైరస్ తరచూ ప్రభంజనం సృష్టిస్తున్నదని యేల్ మెడిసిన్ స్కూల్ ప్రొఫెసర్ అకికో ఇవాసకి తెలిపారు. డెల్టా వేరియంట్‌ను ప్రభావవంతంగా బూస్టర్ డోసులు ఎదుర్కొంటున్నాయని కొంత ఊరట పొందే సమయంలో అప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాద ఘంటికలు మోగించడం ప్రారంభించిందని అన్నారు. అందుకే పరిస్థితులు ఇప్పుడే అదుపులోకి వచ్చాయని భావించడాన్ని శాస్త్రజ్ఞుులు తప్పుపడుతున్నారు.
కరోనా వైరస్ పూర్తిగా ఎప్పటికీ పోకపోవచ్చనే అభిప్రాయాన్ని సైంటిస్టులు వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిణామం చెందుతూ కొత్త వేవ్‌లకు కారణభూతులు కాగలవని హెచ్చరించారు. ప్రతి సారీ మ్యుటేషన్లు జరగడం సాధారణం అయిపోవచ్చని, తద్వార కేసులు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. అమెరికా సియాటెల్‌లోని ఫ్రెడ్ హచిన్‌సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన ఎపిడమాలజిస్టు ట్రెవర్ బెడ్‌ఫోర్డ్ మాట్లాడుతూ.. అధికారికంగా రిపోర్ట్ అయ్యే కేసుల సంఖ్య వాస్తవం సోకే వాటికి చాలా తేడా ఉండొచ్చని పేర్కొన్నారు. అమెరికాలో అధికారికంగా వెల్లడించే కేసుల సంఖ్య వాస్తవంలో సోకే కేసుల్లో కేవలం 20 నుంచి 25 శాతం మేరకు ఉండవచ్చని వివరించారు. జనవరి అమెరికాలో ఒక్క రోజులో సగటున సుమారు 80 వేల కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
కాగా, దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టగా.. మరణాలు సైతం తగ్గాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్త నమోదైన కరోనా వైరస్ కేసులు తగ్గగ, మరణాలు తగ్గాయి. కొత్తగా 34,113 కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే.. 24 శాతం కొత్త కేసులు తగ్గిపోయాయి. దీంతో దేశంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య మొత్తం 4,26,65,534కు పెరిగింది. ఇదే సమయంలో91,930 (RECOVERED) మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రికవరీల సంఖ్య 4,16,77,641 కి పెరిగింది. ప్రస్తుతం 4,78,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
