ఆసియా దేశాల మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ కోసం ఇండోనేషియా సిద్దమైంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ వేడుకల ఆరంభోత్సవానికి జకార్తాలోని జీబీకే ప్రధాన స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ఈ దేశ సంస్కృతిని చాటిచెప్పేలా పెద్ద ఎత్తున సాస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.   'ఎనర్జీ ఆఫ్ ఆసియా' అనే స్లోగన్ తో ఆతిథ్య దేశం ఈ క్రీడలను నిర్వహిస్తోంది.  ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు, క్రీడాకారులు, అధికారులు, అభిమానుల మధ్యలో ఆరంభ వేడుకలు జరుగుతున్నాయి.

మొదట జీబికే స్టేడియంలో వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు తమ దేశానికి చెందిన జెండాలను చేతపట్టుకుని పరేడ్ నిర్వహించారు. ఇందులో భారత తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న 572 మంది క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత క్రీడాకారుల పరేడ్ కు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రాతినిధ్యం వహించారు. త్రివర్ణ పతకాన్ని పట్టుకుని అతడు అందరు క్రీడాకారుల కంటే ముందు నడిచాడు. అన్ని దేశాల క్రీడాకారుల కంటే భారత క్రీడాకారుల బృందమే పెద్దదిగా కనిపించింది. ఈ జంబో జట్టు  భారీ అంచనాలతో రేపటి నుండి బరిలోకి దిగుతోంది.  

ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా 120 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు, 26 మీటర్ల ఎత్తయిన స్టేజీని ఏర్పాటు చేశారు. ఈ స్టేజిపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు  జరుగుతున్నాయి. 

ఈ వేడుకల కోసం జకార్తా, పాలెంబాగ్ పట్టణాల్లోని స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇప్పటికే ఇక్కడ అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ క్రీడల కోసం ఇండోనేషియా
ప్రభుత్వం దాదాపు రూ. 32 వేల కోట్లను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.  45 దేశాలకు చెందిన దాదాపు 11,000 మంది క్రీడాకారులు, 5,000 మంది అధికారులు ఈ క్రీడల్లో పాల్గొనడానికి ఇప్పటికే ఇండోనేషయాకు చేరుకున్నారు.