అమెరికా ఒకసారి గురి చూసిందంటే.. దాన్ని సాధించేవరకు విడిచిపెట్టదు. గతంలో ఎన్నో దేశాల అధ్యక్షులను టార్గెట్ చేసి వారిని నేలకూల్చింది. ఇప్పుడు వెనెజులా దేశ అధ్యక్షుడుపై కత్తులు నూరుతోంది.
అమెరికా వేరొక దేశ అధ్యక్షుడిపై విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. కానీ ఏకంగా ఒక దేశ అధ్యక్షుడిపై ప్రైజ్ మనీనే ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడిని పట్టిస్తే ఏకంగా 430 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అతడు వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో. ఇతని వల్లే అమెరికాలో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని, డ్రగ్స్, స్మగ్లింగ్, హింస ఎక్కువ అవుతుందని అమెరికా ఆరోపిస్తోంది.
నిజానికి అమెరికా వెనిజులా దేశ సంబంధాలు బాగానే ఉన్నాయి. అంతెందుకు వెనెజులా దేశం ఆర్థికంగా ఎదిగేందుకు కూడా అమెరికా సాయం చేస్తూనే వస్తోంది. కానీ అధ్యక్షుడు విషయంలో మాత్రం ఇష్టపడడం లేదు. ఆ అధ్యక్షుడిని దించి కొత్త అధ్యక్షుడు వచ్చేవరకు అమెరికా ఊపిరి తీసేలా కనిపించట్లేదు. వెనెజులా దేశంతో సమస్య లేకపోయినా... వెనెజుల అధ్యక్షుడితో మాత్రం ఎంతో పెద్ద సమస్యలు తాము ఎదుర్కొంటున్నామని అమెరికా వాదిస్తోంది.
చేసిన తప్పు ఇదే
అమెరికా చెబుతున్న ప్రకారం నికోలస్, ఆయన స్నేహితులకు సంబంధించిన కోకైన్ ను అమెరికా డ్రగ్స్ ఎన్ ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ పట్టుకున్నట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఆ కొకైన్ 30 టన్నులు ఉంటుందని అంటున్నారు. అందులో 7 టన్నుల కొకైన్ నికోలస్ మదురోకు చెందినదని వారు వాదిస్తున్నారు. వెనెజులాలో డ్రగ్స్, స్మగ్లింగ్ చేయడం ద్వారా ఆయన భారీగా ఆర్జిస్తున్నారని అమెరికా చెబుతోంది. కొకైన్ మాత్రమే కాదు ఇంకెన్నో మత్తుపదార్థాలు స్మగ్లింగ్ చేస్తున్నాడని మండి పడిపోతుంది. గతంలో బైడెన్ ప్రభుత్వం కూడా మదురో పై ఇవే ఆరోపణలు చేసింది. కానీ ఇప్పుడు ట్రంప్ కు ఉన్నంత దూకుడు... బైడెన్ కు లేదు. ట్రంప్ యూఎస్ అధ్యక్షుడు అయిన తర్వాత మదురో సంగతి తేల్చేటట్టే కనిపిస్తున్నాడు. ట్రంప్ నుంచి నికోలస్ తప్పించుకోలేడని అమెరికా అధికారులు కూడా చెబుతున్నారు.
గతంలోనూ ప్రైజ్ మనీ
నికోలస్ మదురో పై ఇలా ప్రైజ్ మనీ ప్రకటించడం తొలిసారి కాదు. గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మారిన తర్వాత నికోలస్ ను పట్టిస్తే 15 మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత బైడెన్ ప్రభుత్వం కూడా ఆ మొత్తాన్ని 25 మిలియన్లకు పెంచింది. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక దాన్ని 50 మిలియన్ డాలర్లుగా చేశాడు. అంటే మన భారతదేశ రూపాయల్లో 430 కోట్లతో సమానం. అంతేకాదు గతంలో నికోలస్ మదురోకి ఉన్న భవనాలు, ప్రైవేటు జెట్లు, వాహనాలను అమెరికా సీజ్ చేసింది. అమెరికాలో కూడా నికోలస్ మదురోకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు అమెరికా ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. వీటి ధర 700 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
గతంలో అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన బిన్ లాడెన్ ను పట్టుకొని చంపేశారు. అలాగే సద్దాం హుస్సేన్ సంగతి కూడా అమెరికా చివరకు ఏం చేసిందో అందరికీ తెలుసు. ఇప్పుడు నికోలాస్ మదురోకు కూడా భవిష్యత్తులో అలాంటి గతే పడుతుందేమోనని ఎంతోమంది భావిస్తున్నారు.
నికోలస్ ఎక్కడ?
నికోలాస్ మదురో 2013 నుండి వెనిజులా అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. మొదట బస్సు డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తర్వాత ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగాడు. గతంలో అయినా విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశాడు.
వెనిజులాలో కూడా ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు ఎన్నోసార్లు నిరసనలు చేశారు. ఆయన ధన దాహానికి, లంచగొండితనానికి కేరాఫ్ అడ్రస్ గా మారారు. 2016లో తన అధికారంతో వెనెజులాలో అత్యవసర పరిస్థితిని కూడా విధించాడు.వెనెజులా దాటి అమెరికాకు ప్రాబల్యం ఉన్న ఏ దేశంలోకి నికోలస్ వచ్చినా కూడా అమెరికా వదిలిపెట్టేలా కనిపించడం లేదు.
