Asianet News TeluguAsianet News Telugu

కాశ్మీర్ పై పాక్ నోట్లో పచ్చి వెలక్కాయ: వ్యూహం ఏమిటి?

కాశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ కు మింగుడు పడడం లేదు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ తనకు మద్దతు కూడగట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో లోలోన రగిలిపోతోంది.

Abrogation of article 370: Pakistan not able to digest
Author
Islamabad, First Published Sep 14, 2019, 6:41 PM IST

కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంకా కూడా పాకిస్తాన్ కు పూర్తిగా మింగుడుపడలేదు. ఇప్పటికే ఐరాస నుంచి మొదలుకొని అంతర్జాతీయ మానవహక్కుల సంఘం వరకు వారు వెళ్లిన ఏ సంస్థ కూడా వారి బూటకపు మాటలను, కట్టుకథలను వినడానికి సిద్ధంగా లేవని మొఖం మీదనే చెప్పేసాయి. 

అంతర్జాతీయంగా ఎటువంటి సహకారం లభించకపోవడంతో లోలోన రగిలిపోతుంది పాకిస్తాన్ సర్కార్. ఎలాగైనా ఈ విషయాన్ని అంతర్జాతీయం చేయాలని ఒక భారీ కుట్రను పాకిస్తాన్ పన్నుతోందని నిఘావర్గాలు భారత సైన్యానికి ఉప్పందించాయి. 

పాకిస్తాన్ తమ ఆధీనంలోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోని సాధారణ ప్రజలను రెచ్చగొట్టి వారిని సరిహద్దు వైపుగా దూసుకెళ్ళమని పంపుతోంది. వారు భారత్ కు వ్యతిరేకంగా ఇలా నినాదాలు చేసుకుంటూ భారత సైన్యాన్ని రెచ్చగొడుతున్నారు. 

ఒక వారం కింద మొదటిసారిగా ఇలా  పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ఒక 6గురు సామాన్య ప్రజలు సరిహద్దుకు దాదాపుగా 150 మీటర్ల వరకు వచ్చారు. వారు భారత్ కు వ్యతిరేకంగా నినాదాలను అరుస్తూ రావడంతో అప్రమత్తమైన భారత సైన్యం వారిని చెదరగొట్టేందుకు వారికి ఏ విధమైన హాని కలగకుండా పరిసర ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. దానితో వారు వెనక్కి వెళ్లిపోయారు. 

రాజౌరి జిల్లాలోని నౌషేరా   సెక్టరులోని లామ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన నేపథ్యంలో భద్రతా బలగాలు రకరకాల నిఘా వర్గాల నుంచి రిపోర్టులు తెప్పించుకొని చూసారు. ఈ రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఇలాంటి సంఘటనలకు పాకిస్తాన్ దిగనుందని తెలుస్తోంది. ప్రజల గుంపును కూడా భారీ స్థాయిలో పెంచి ఒక 100,200 మందిని ఒక్కో గుంపుగా చేసి పంపాలని కుట్రలు పన్నుతోంది. 

ఈ నెల 17వ తేదీ నుండి ఈ నెలాఖరువరకు ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమయానికి మరిన్ని ఇలాంటి గుంపులను పంపాలని పాకిస్తాన్ పన్నాగాలు రచిస్తోంది. 

అసలు పాకిస్తాన్ ఏం చేయాలనుకుంటుంది?

భారత సైన్యాన్ని ఎలాగైనా రెచ్చగొట్టి ఇలా సాధారణ ప్రజలమీద కాల్పులు జరిపించాలని చూస్తోంది. ఇలా కాల్పుల్లో ఎవరన్నా మరణిస్తే, అదే సమయానికి ఐరాస సమావేశాలు కూడా జరుగుతూంటాయి కాబట్టి ప్రపంచానికి సరిహద్దు వెంబడి యుద్ధ మేఘాలు అలుముకున్నాయని ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని చూస్తోంది. దానికి సాక్ష్యాలుగా ఈ సాధార ప్రజల శవాలను సాక్ష్యంగా చూపెట్టాలని తన కుటిలబుద్ధిని  ప్రదర్శిస్తోంది. 

పాకిస్తాన్ సైన్యం ఇలా అక్కడి ప్రజలను రెచ్చగొట్టి సరిహద్దు వైపుగా పంపుతోందని భారత సైన్యం ఒక మీడియా స్టేట్మెంట్ లో తెలిపింది. భారత సైన్యానికి సంయమనం పాటించాలని, చెదరగొట్టడానికి వారి కాళ్ళ సందుల్లో కాల్చలితప్ప , వారికి గాయాలయ్యే విధంగా కాదని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. 

కాకపోతే ఇక్కడే ఒక సమస్య ఉంది. సరిహద్దు వెంబడి చాలాచోట్ల భారత సైన్యం అవుట్ పోస్టులు ఎల్ ఓ సి కి ఆవల ఉన్నాయి. సాధారణంగా ఈ పోస్టులలో ఆరుగురు సైనికులు బృందం విధులు నిర్వహిస్తుంది. ఒక వేళ భారీ స్థాయిలో జనాల గుంపు గనుక అక్కడకు చేరుకుంటే అది ఒక పెద్ద భద్రతా సమస్యకు కూడా దారి తీయవచ్చు. 

ఇంకో సమస్యేమిటంటే, సరిహద్దు దాటనంతసేపు సమస్య లేదు. కానీ దాటితే భారత సైన్యం ఇలానే సంయమనం పాటించలేదు. సరిహద్దు దాటితే కఠిన చర్యలకు దిగక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ ప్రజలపైకి కాల్పులకు దిగారని పాకిస్తాన్ తీవ్రమైన ఆరోపణలు చేయడానికి కాచుకొని కూచొని ఉంది. 

నిఘా వర్గాల సమాచారం ఏమి తెలుపుతుంది?

ఒక సమాచారం ప్రకారం జామియాత్ - ఆహ్ల్ -ఈ -సున్నత్ అనే  పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కోట్లి జిల్లాకు చెందిన ఈ సంస్థ సెప్టెంబర్ 20వ తేదీన సరిహద్దు వెంబడి ఇలాంటి ప్రదర్శనకు దిగాలని స్కెచ్ గీసినట్టుగా తెలుస్తోంది. జాఫర్ ఇక్బాల్ గాజి అనే ముఖ్య నాయకుడు ఆధ్వర్యంలో ఈ చర్యకు పూనుకోనున్నట్టు సమాచారం. 

ఇదే విధంగా అందిన మరో సమాచారంలో ఇంకో గుంపు సెప్టెంబర్ 21వ తేదీన  పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని గర్హి దుపట్టా ప్రాంతం నుండి సరిహద్దువైపుగా దూసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలియవచ్చింది. మరింత ఆందోళన కలిగించే విషయమేమిటంటే, ఈ గుంపులో పిల్లలు కూడా ఉండబోతున్నారని సమాచారం. 

ఇప్పటికే ప్రతి శుక్రవారం మధ్యాహ్న సమయంలో ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి భారత్ కు వ్యతిరేకంగా నినదించాలని ఆదేశాలను జారీ చేసింది పాక్ సర్కార్. నిన్న ఇమ్రాన్ ఖాన్ ఏకంగా  పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంత రాజధాని ముజాఫరాబాద్ లో రెండోసారి పర్యటించాడు. ఈ సందర్భంగా నిన్న శుక్రవారం కూడా అవడంతో మధ్యాహ్న సమయంలో భారత్ కు వ్యతిరేక నినాదాలను చేస్తూ కాశ్మీరీ ప్రజలంతా తుపాకులు పట్టుకోవాలని రెచ్చగొట్టే ప్రకటన చేస్తున్నాడు. 

శాంతి కాముఖులం అని చెప్పుకునే పాకిస్తాన్ నాయకులు, కాశ్మీరీ ప్రజలను శాంతివైపుగా నడపకుండా ఇలా అహింసను ప్రోత్సహించడం పాకిస్తాన్ దుర్బుద్ధిని, రెండు నాల్కల ధోరణిని బట్టబయలు చేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios