Bangladesh fire accident: బంగ్లాదేశ్‌లోని ప్రధాన సముద్ర ఓడరేవు చిట్టగాంగ్‌కు సమీపంలోని సీతాకుండలోని ప్రైవేట్ కంటైనర్ స్టోరేజీ డిపోలో పేలుడు సంభవించడంతో కనీసం 40 మంది మరణించారు. మరో 450 మందికి పైగా గాయపడ్డారు.
Bangladesh Container Depot fire : బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 450 మందికి పైగా తీవ్రంగా గాయాపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని బంగ్లాదేశ్ స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకెళ్తే.. దేశంలోని ప్రధాన సముద్ర ఓడరేవు చిట్టగాంగ్‌కు సమీపంలోని బంగ్లాదేశ్‌లోని సీతాకుండలోని ప్రైవేట్ ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ICD)లో పేలుడు సంభవించడంతో కనీసం 40 మంది మరణించారు. వందల మంది గాయపడ్డరనీ, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ మీడియా రిపోర్టుల ప్రకారం.. సీతకుంట ఉపజిల్లాలోని కడమ్‌రాసుల్ ప్రాంతంలోని బీఎం కంటైనర్ డిపోలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగిందని ఔట్‌పోస్ట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) నూరుల్ ఆలం తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది దానిని ఆర్పేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి.
"ఇప్పటి వరకు 40 మృతదేహాలను ఇక్కడ మార్చురీకి తీసుకువచ్చారు" అని ప్రభుత్వ నిర్వహణలోని చిట్టగాంగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (CMCH) వద్ద ఉన్న ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. బంగ్లాదేశ్‌లోని సీతకుండాలోని కంటైనర్ సదుపాయంలో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. రెడ్ క్రెసెంట్ యూత్ చిట్టగాంగ్‌లోని హెల్త్ & సర్వీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇస్తాకుల్ ఇస్లాం మాట్లాడుతూ, "ఈ ఘటనలో 450 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కనీసం 350 మంది CMCHలో ఉన్నారు. ఇతర ఆసుపత్రులలో మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చు" అని అన్నారు. రాత్రి 9 గంటల సమయంలో BM కంటైనర్ డిపో లోడింగ్ పాయింట్‌లో మంటలు చెలరేగాయని పోలీసులు, అగ్నిమాపక సేవ మరియు స్థానిక వర్గాలు తెలిపాయి. రసాయనాల కారణంగా కంటైనర్ డిపోలో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని ఎస్‌ఐ నూరుల్ తెలిపారు.
రాత్రి 11:45 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి, ఒక కంటైనర్‌లో రసాయనాలు ఉండటంతో మంటలు ఒక కంటైనర్ నుండి మరొక కంటైనర్‌కు వ్యాపించాయి. పేలుడు చాలా శక్తివంతమైనదని, ఇది పరిసరాలను కదిలించిందని మరియు సమీపంలోని ఇళ్లలోని కిటికీలు పగిలిపోయాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. చిట్టగాంగ్ ఫైర్ సర్వీస్ మరియు సివిల్ డిఫెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ Md ఫరూక్ హొస్సేన్ సిక్దర్ మాట్లాడుతూ, "సుమారు 19 అగ్నిమాపక యూనిట్లు మంటలను ఆర్పడానికి పని చేస్తున్నాయి మరియు ఆరు అంబులెన్స్‌లు కూడా స్పాట్‌లో అందుబాటులో ఉన్నాయి" అని తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణమేమిటో స్పష్టంగా తెలియరాలేదని బిఎమ్ కంటైనర్ డిపో డైరెక్టర్ ముజిబుర్ రెహ్మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. కానీ కంటైనర్ నుండి మంటలు ప్రారంభమైనట్లు తాను భావిస్తున్నట్టు చెప్పారు. "గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. ప్రమాదంలో గాయపడిన వారికి గరిష్టంగా పరిహారం అందజేస్తాం" అని రెహమాన్ చెప్పినట్లు 'ది డైలీ స్టార్' పేర్కొంది.
