అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. Pennsylvania ఫిలడెల్ఫియాలో శనివారం అర్థరాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, కనీసం 11 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. Pennsylvania ఫిలడెల్ఫియాలో శనివారం అర్థరాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, కనీసం 11 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఇన్‌స్పెక్టర్ డీఎఫ్ పేస్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాల్పలు చోటుచేసుకున్నప్పుడు ప్రతి వీకెండ్‌ లాగానే వందలాది మంది ప్రజలు సౌత్ స్ట్రీట్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే షూటర్లు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో వీధిలో కాల్పులు జరిపారు. అయితే కాల్పులు జరిపిన షూటర్లలో ఒకరిపై ఒక అధికారి ఎదురుకాల్పులు జరిపాడని.. అయితే కాల్పుల్లో అతడు గాయపడ్డాడా లేదా అనేది అస్పష్టంగా ఉంది’’ అని తెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అయితే ఘటన స్థలంలో రెండు హ్యాండ్ గన్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా పేస్ చెప్పారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోని వ్యాపార సముదాయాల్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్‌ను సమీక్షించాల్సి ఉందని.. ఇందుకోసం ఉదయం వేచిచూడాల్సి ఉందని తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో గాయపడినవారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై సమాచారం లేకుండా పోయింది. 

ఇక, గత కొంతకాలంగా అమెరికాలో వరుసగా ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నారు. జూన్ 1న USలోని ఓక్లహోమా రాష్ట్రం తుల్సాలోని హాస్పిటల్ క్యాంపస్‌లోని మెడికల్ భవనంపై దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు మరణించారు. ఘటన సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో షూటర్ కూడా కాల్చి చంపబడ్డాడు. ‘‘సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్ క్యాంపస్‌లోని నటాలీ బిల్డింగ్‌లో జరిగిన ఈ ఘటనలో షూటర్‌తో సహా ఐదుగురు మరణించారు’’ అని తుల్సా పోలీసులు తెలిపారు. తుల్సా డిప్యూటీ పోలీసు చీఫ్ జోనాథన్ బ్రూక్స్ సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్ క్యాంపస్ వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ.. పోలీసుల ఎదురు కాల్పుల్లో.. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మరణించాడని తెలిపారు.

అంతకుముందు.. మే 24న అమెరికాలోని టెక్సాస్లోని ఒక ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 19మంది విద్యార్థులతో సహా 21 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయసు నాలుగు నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన సంఘటన అని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ వెల్లడించారు. మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో దుండగుడు చనిపోయాడు.