హైదరాబాద్: ఓ బాలికపై దాడి చేసి ఆమెను 17 సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాదికి కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో డిగ్రీ విద్యార్థి బాలికపై దాడి చేశాడు. ఈ సంఘటన 2019 ఫిబ్రవరిలో హైదరాబాదులోని బర్కత్ పురాలో చోటు చేసుకుంది. 

అతనికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. సి భరత్ అనే డిగ్రీ విద్యార్థి 17 ఏళ్ల బాలికపై దాడి చేసిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కాలేజీకి వెళ్తుండగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిపై భరత్ కత్తితో దాడి చేశాడు. 

బాలికను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి ఆమె ప్రాణాలను కాపాడగలిగారు. నిందితుడు భరత్ పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అదనపు మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి సునీత కుంచల 2019 జూన్ లో విచారణ ప్రారంభించారు. 

సంఘటన జరగడానికి నెల రోజుల ముందు బాలిక కుటుంబ సభ్యులు షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశారు. బాలికను వెంటాడుతున్న భరత్ పై వారు ఫిర్యాదు చేశారు. కౌన్సిలింగ్ భరత్ ను వదిలేశారు. అయినా అతను మారలేదు. బాలికపై దాడి చేశాడు. ఈ సంఘటనతో బాలిక కుటుంబం తమ మకాంను మరో ప్రాంతానికి మార్చుకుంది.