#Karthikeya-2:‘కార్తికేయ 2’ ని దిల్ రాజు టార్గెట్ చేసారా? తెర వెనక ఏం జరిగింది
బింబిసార, మాచర్ల నియోజక వర్గం చిత్రాలని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయగా, ఆయన ఈ రెండు చిత్రాలకు చాలా స్క్రీన్స్ కేటాయించాడు. ఇక సీతారామం కూడా ఓ మోస్తరు స్క్రీన్స్‌లో ప్రదర్శితం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో కార్తికేయ 2 ఎన్ని స్క్రీన్స్‌లో విడుదల అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది.
నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు తెలుగు పరిశ్రమలో ఎదురు లేదనే విషయం తెలిసిందే. ఆయనతో సినిమా చేయటానికి స్టార్స్ ఉత్సాహపడతారు. అలాగే ఆయన సినిమా రిలీజ్ చేస్తే చాలు చాలా మంది ఆశగా చూస్తూంటారు. ఇక దిల్ రాజు జడ్జిమెంట్ కూడా విపరీతమైన నమ్మకం. ఆయన ఓ సినిమా తీసున్నారంటే మిగతా ఏరియాలు పోటీపడి మరి కొనుక్కుంటారు. ఇంత గుడ్ విల్ ఉన్న దిల్ రాజు ఇప్పుడు రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఒకటి విజయ్ తో మరొకటి తమిళ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ లతో. మరో ప్రక్క స్టార్స్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. బింబిసారని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తే మంచి లాభాలు వచ్చి, టీమ్ కు పార్టీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన చుట్టూ ఓ కాంట్రవర్శీ ప్రదిక్షణం చేస్తోంది. అదేమిటంటే...
వైవిధ్యమైన సినిమాల ద్వారా ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న నిఖిల్ తన తాజా చిత్రం కార్తికేయ 2ని విడుదల చేయడానికి నానా కష్టాలు పడ్డాడు. సుమారు 17 సినిమాలు చేసిన నిఖిల్‌కి థియేటర్ల సమస్య ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది. నిఖిల్ హీరోగా 2014 సంవత్సరంలో రూపొందిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా స్వాతి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పట్లోనే ఈ సినిమాకి సీక్వెల్ చేస్తామని ప్రకటించారు. అలా ప్రకటించిన దాని మేరకు కార్తికేయ సీక్వెల్ సినిమాని కూడా కరోనా సమయంలోనే మొదలు పెట్టారు..
ఇక ఎట్టకేలకు సినిమా అన్ని పనులు పూర్తిచేసుకుని జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధం అయింది. అయితే సినిమా ధియేటర్లు దొరకని నేపథ్యంలో సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.. అదే సమయానికి నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా కూడా విడుదలవుతున్న నేపథ్యంలో నిఖిల్ సినిమాను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘కార్తికేయ 2’ నిర్మాతలు రిలీజ్ కోసం చాలా తిప్పలు పడ్డారు. దిల్ రాజు బలం ముందు వీరి బలగం సరిపోలేదని కామెంట్స్ వచ్చాయి. దిల్ రాజే కావాలని ‘కార్తికేయ 2’ను పక్కకు తప్పించారని ఇండస్ట్రీలో విమర్శలు వినిపించాయి. అలాగని థాంక్స్ సినిమా ఆడలేదు. డిజాస్టర్ అయ్యింది.
‘కార్తికేయ 2’ సినిమాకి థియేటర్స్ లేకపోవడ వల్ల.. ఆగస్టు 12 కు రిలీజ్ డేట్ ను పోస్ట్ ఫోన్ చేసుకుని రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా ఫిల్మ్ గా వచ్చింది. దాంతో దిల్ రాజు కారణంగా మిగిలిన భాషల్లో కూడా సినిమాని పోస్ట్ ఫోన్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఆల్ రెడీ సినిమా ప్రమోషన్స్ కోసం బాగా ఖర్చు పెట్టారు. ఇప్పుడు అదంతా వృధా అయిపోయింది. కాకపోతే సినిమా హిట్ టాక్ రావటంతో టీమ్ రిలీఫ్ అయ్యింది.
అయితే శుక్రవారం రిలీజైన నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల వుంది. నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. మరో ప్రక్క ఆగస్ట్ 5న కళ్యాణ్ రామ్ బింబిసార వుంది. ఆ సినిమా కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాంతో ఖచ్చితంగా థియేటర్స్ విషయంలో ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే బింబిసార సూపర్ హిట్ కావటంతో ఆ థియేటర్స్ తీయటానికి లేదు. నితిన్ మాచర్ల కు ఎక్కువ థియేటర్స్ కేటాయించాలి. కాబట్టి చాలా భాగంగా థియేటర్స్ దిల్ రాజు రిలీజ్ ల వైపై ఉండిపోతాయి. ప్రైమ్ థియేటర్స్ నిఖిల్ సినిమాకు దొరకటం కష్టమైపోయాయని వినికిడి. ఇలా దిల్ రాజు ...ఈ సినిమాని ఇబ్బంది పెట్టినట్లే అయ్యింది. కాకపోతే ఇవన్ని బిజినెస్ లోకామన్ అంటున్నారు.
ఏదైమైనా నిఖిల్ గత కొన్నేళ్లుగా కథలో సెలక్షన్స్ లో మార్పు చేసుకుని విభిన్నమైన కాన్సెప్టు లతో ముందుకు వెళ్తున్నారు. రెగ్యులర్ హీరోయిజం కన్నా కంటెంట్ బలంగా ఉన్న కథలకే ఓటేస్తున్నాడు. దాంతో మెల్లిగా నిలదొక్కుకుంటూ తన కంటూ కొంతమంది ఆడియన్స్ ని తయారు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో వచ్చిన మరో చిత్రం ‘కార్తికేయ 2’. థ్రిల్లర్ అభిమానులు తప్పకుండా చూడదగినదిగా పేరు తెచ్చుకోవటం కలసి వస్తోంది.