ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న రోజర్ ఫెదరర్... సెరీనా విలియమ్స్‌కి షాక్...
ఫ్రెంచ్ ఓపెన్ 2021 సీజన్‌లో స్టార్ ఎట్రాక్షన్ తగ్గుతోంది.. ఇప్పటికే నవోమి ఒసాకా, ప్రెస్ కాన్ఫిరెన్స్‌కి హాజరుకావడం ఇష్టం లేదంటూ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోగా తాజాగా మాజీ నెంబర్ వన్, స్విట్జర్లాండ్ స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నాడు.
కొన్నాళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్న రోజర్ ఫెదరర్, శస్త్ర చికిత్స తర్వాత తిరిగి ఫ్రెంచ్ ఓపెన్ బరిలో దిగాడు. 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో చివరిగా టెన్నిస్ కోర్టులో బరిలో దిగిన రోజర్ ఫెదరర్, దాదాపు 405 రోజుల తర్వాత తిరిగి కోర్టులోకి దిగాడు.
ఫ్రెంచ్ ఓపెన్ 2021 సీజన్‌లో మూడో రౌండ్‌లో జర్మనీ ప్లేయర్ డొమినిక్ కెఫర్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు సెట్ల పాటు సాగిన సుదీర్ఘ మ్యాచ్‌లో పోరాడి గెలిచాడు ఫెదరర్.
అయితే మూడు గంటలకు పైగా ఈ మ్యాచ్ కారణంగా తన గాయం తీవ్రత అర్థం అయ్యిందని, విశ్రాంతి కోసం ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఫెదరర్.
‘నా మోకాలికి ఇప్పటికే రెండు సర్జరీలు జరిగాయి. ఆటకు ఏడాదికి పైగా గ్యాప్ వచ్చింది. ఇంత గ్యాప్ తర్వాత 3 గంటల 35 నిమిషాల పాటు నిలబడి మ్యాచ్ ఆడడం చాలా కష్టంగా ఉంది. టోర్నీలో మూడు మ్యాచులు గెలిచాను. అందుకే టీమ్‌తో మాట్లాడిన తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ 2021 సీజన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా, త్వరలోనే మళ్లీ కోర్టులో దిగుతా...’ అంటూ చెప్పుకొచ్చాడు రోజర్ ఫెదరర్.
ఫ్రీ క్వార్టర్స్‌లో బరిలో దిగాల్సిన రోజర్ ఫెదరర్, లీగ్ మధ్యలో నుంచి తప్పుకోవడంతో అతని ప్రత్యర్థి ఇటలీ ప్లేయర్ మాటో బెరిటినో నేరుగా క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంటాడు.
మరోవైపు అమెరికా స్టార్ ప్లేయర్ సెరీనా విలియమ్స్‌కి ప్రీ క్వార్టర్స్‌లో షాక్ తగిలింది. ఉక్రెయిన్‌కి చెందిన 21వ సీడ్ ప్లేయర్ ఎలీనా రిబకినాతో జరిగిన మ్యాచ్‌లో 6-3, 7-5 తేడాతో చిత్తుగా ఓడింది సెరీనా విలియమ్స్. రెండో సెట్‌లో 5-5తో స్కోరు సమం చేసినా రిబకినా దూకుడుతో రెండు సెట్లు గెలిచి, విలియమ్స్‌కి షాక్ ఇచ్చింది.
ప్రీ క్వార్టర్స్ ముందే స్టార్ ప్లేయర్లు నవోమి ఒసాకా, రోజర్ ఫెదరర్, సెరీనా విలియమ్స్... ఇలా ముగ్గురు స్టార్ ప్లేయర్లు తప్పుకోవడంతో 2021 ఫ్రెంచ్ ఓపెన్‌తో మరెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందోనని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.