ఏపీ, తెలంగాణ మధ్య నదీజలాల గొడవేంటి? కృష్ణా నదిలో ఎవరి వాటా ఎంత?
వేసవి సమీపిస్తుండటంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మద్య మరోసారి నదీజలాల వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ నదీజలాలను ఏపీ తరలించుకుపోకుండా జాగ్రత్త పడాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అసలు తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదమేమిటి? ఏ రాష్ట్రం వాటా ఎంత? తెలుసుకుందాం.

Water Dispute Between Andhra Pradesh And Telangana
Water Dispute Between Telangana and Andhra Pradesh : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగి పదేళ్ళు గడిచిపోయింది... కానీ ఇంకా తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నాయి... అయినా నదీజలాల పంపకాల వివాదం ఆగడంలేదు. కృష్ణా, గోదావరి నదుల్లోని నీటికోసం తెలుగు రాష్ట్రాలు తన్నుకుంటూనే ఉన్పాయి.
గతంలో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ సమావేశమైనప్పుడు ఈ నదీజలాల వివాదానికి పరిష్కారం లభిస్తుందని అందరూ అనుకున్నారు... కానీ అలా జరగలేదు. ఇటీవల మళ్లీ తాజా ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా భేటీ అయ్యారు. ఈసారి కూడా నదీజలాల పంపకాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వస్తారని ఆశించారు... కానీ ఈ సమావేశంలోనూ ఎలాంటి క్లారిటీ రాలేదు.
తెలంగాణ, ఏపీ సీఎంలే కాదు కేంద్ర ప్రభుత్వ జోక్యంతో పలుమార్లు ఉన్నతాధికారులు కూడా సమావేశమయ్యారు. అయినా ఇరురాష్ట్రాల జలవివాదం సద్దుమణగడంలేదు. గోదావరి నదీ జలాల విషయంలో చిన్నచిన్న వివాదాలే ఉన్నాయి... కానీ కృష్ణా జలాల విషయంలోనే ఇరురాష్ట్రాలు తన్నుకునే స్థాయిలో వివాదాలున్నాయి. రాష్ట్రం విడిపోయి దశాబ్ద కాలం పూర్తయినా నదీజలాల వాడకంపై ఇంకా క్లారిటీ రావడంలేదు.
Revanth Reddy
రేవంత్ కామెంట్స్ తో మరోసారి నదీజలాల పంచాయితీ తెరపైకి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసారు. తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వ, పంటల సాగుకు నీటివిడుదల వంటి అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుండి కృష్ణా జలాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ నిర్ణీత కోటా కంటే ఎక్కువగా నీటిని తరలించుకుపోతోంది... కాబట్టి తెలంగాణ వినియోగానికి నీరు ఉండటం లేదనేది రేవంత్ వాదన. అందువల్లే ఈసారి ఏపీ నిర్ణీత కోటా కంటే ఎక్కువ నీటిని తరలించుకుపోకుండా ముందుగానే జాగ్రత్త పడాలని సీఎం ఆదేశించారు.
ముఖ్యంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుండే ఏపీ ఎక్కువగా నీటిని తరలించుకుపోతోందని తెలంగాణ ఆరోపిస్తోంది. నాగార్జునసాగర్ విషయంలో అయితే ఏపీ, తెలంగాణ మధ్య చిన్నస్థాయి యుద్దమే జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ తమదంటే తమదంటూ ఇరురాష్ట్రాల పోలీసులు కొట్టుకున్నంత పని చేస్తున్నారు... పలుమార్లు ఇరురాష్ట్రాలు అమీతుమీకి సిద్దమయ్యాయి. అయితే కేంద్ర జోక్యం చేసుకుని ఈ ప్రాజెక్ట్ భద్రత బాధ్యత కేంద్ర బలగాలకు అప్పగించింది.
ఇలా కృష్ణానదీ జలాల విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఇరురాష్ట్రాలు మీరంటే మీరు ఎక్కువ నీటిని వాడుకుంటున్నారంటూ నిందలు వేసుకుంటున్నాయి. నదీజలాల పంచాయితీ ప్రతిసారి ఉద్రిక్తతకు దారితీస్తోంది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ కామెంట్స్ ను బట్టిచూస్తే మరోసారి కృష్ఱా జలాల విషయంతో గొడవలు తప్పేలా లేవు.
Sholayar Dam
కృష్ణా జలాల్లో ఏ రాష్ట్రం వాటా ఎంత? :
దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో గోదావరి, కృష్ణా చాలా ముఖ్యమైనవి. ఈ రెండు నదులు కేవలం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాదు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ప్రవహిస్తాయి. ఈ నదీజలాలను రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు 1969 లో కేంద్ర ప్రభుత్వం బచావత్ కమిటీని ఏర్పాటుచేసింది.
ఈ కమిటీ ఏ రాష్ట్రం ఎంత నదీజలాలను వాడుకోవాలో నిర్ణయించింది. మహారాష్ట్ర 560 టిఎంసి, కర్ణాటక 700 టిఎంసి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు 800 టిఎంసి నీటిని కేటాయించారు. అయితే ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ మధ్య కృష్ణా నదీజలాల విషయంలో ఓ ఒప్పందానికి వచ్చాయి. 512 టీఎంసిలు ఏపీ, 299 టిఎంసిలు తెలంగాణ వాడుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆ తర్వాత ఈ కృష్ణా నదీజలాల పంపకంలో తమకు అన్యాయం జరిగిందని... తమకు అధిక నీటివాటా రావాలని తెలంగాణ అంటోంది. కృష్ణా నది తెలంగాణలోనే ఎక్కువగా ప్రవహిస్తుంది... పరివాహక ప్రాంతం ఇక్కడే ఎక్కువ కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ కంటే తమకే ఎక్కువ నీళ్లు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన 800 టిఎంసిల్లో 70 శాతం అంటే 558 టిఎంసిలు తమకే దక్కాలనేది తెలంగాణ వాదన.
తెలంగాణ వాదనను ఆంధ్ర ప్రదేశ్ వ్యతిరేకిస్తోంది. కృష్ణా జలాల్లో తమకే అధికవాటా కావాలంటోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుండి నీటిని వాడుకుంటోంది. దీంతో తెలంగాణ, ఏపీల మధ్య నీటికోసం గొడవలు జరుగుతున్నాయి. ఈ నదిపై నిర్మించే ప్రాజెక్టులపైనా ఇరు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసుకుంటున్నాయి... తెలంగాణ అక్రమంగా నిర్మిస్తోందని ఏపీ... ఆంధ్ర ప్రదేశ్ లో అక్రమంగా నిర్మిస్తున్నారని తెలంగాణ అంటోంది. ఇలా కృష్ణా నదీజలాల వివాదం కొలిక్కి రావడంలేదు.