వరంగల్ గొర్రెకుంటలో 9 హత్యలు: నేడు కోర్టు తీర్పు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట హత్య కేసులో వంరగల్ కోర్టు బుధవారం నాడు తీర్పును వెల్లడించనుంది. ఈ కేసు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో తొమ్మిది మంది హత్య కేసులో వరంగల్ కోర్టు బుధవారం నాడు తీర్పు వెలువర్చనుంది.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ ఏడాది మే 21వ తేదీ రాత్రి మసూద్ ఆలం కుటుంబంతో పాటు బీహార్ కు చెందిన ఇద్దరిని సంజయ్ కుమార్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. స్పృహా కోల్పోయిన 9 మందిని గోనెసంచుల్లో పెట్టి బావిలో వేశాడు. 72 గంటల్లో ఈ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ నిందితుడుగా పోలీసులు తేల్చారు. ఈ కేసుపై వరంగల్ కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మసూద్ ఆలం తన కుటుంబంతో ఉపాధి కోసం వరంగల్ కు వలస వచ్చాడు. ఆయన తొలుత కరీమాబాద్ లో నివాసం ఉండేవాడు. నగరంలోని ఫ్యాక్టరీలో మసూద్ పనిచేసేవాడు. అదే ఫ్యాక్టరీలో బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ కూడ పనిచేసేవాడు.
మసూద్ ఆలం భార్య సోదరి కూతురు రఫికాకు పెళ్లై ముగ్గురు పిల్లలు. అయితే కొన్ని కారణాలతో ఆమె భర్తతో విడిపోయింది. దీంతో జీవనోపాధి కోసం రఫికా తన పిన్ని కుటుంబం నివాసం ఉంటున్న వరంగల్ కు వచ్చింది.
ఒంటరిగా ఉంటున్న సంజయ్ కుమార్ కు ఆమె భోజనం వండిపెట్టేది.ఈ క్రమంలోనే రఫికాతో సంజయ్ కుమార్ కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో అదే ప్రాంతంలో వీరిద్దరూ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉన్నారు. ఈ క్రమంలోనే రఫికా కూతురు యుక్త వయస్సుకు వచ్చింది. అయితే రఫికా కూతురితో కూడ సంజయ్ కుమార్ వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని రఫికా గుర్తించి ఆయనను నిలదీసింది.
అయినా కూడ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించింది. దీంతో రఫికా అడ్డు తొలగించాలని సంజయ్ కుమార్ ప్లాన్ చేశాడు. పెళ్లి చేసుకొంటానని రఫికాను నమ్మించాడు. ఇదే క్రమంలో రఫికా తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కోల్ కత్తాకు వెళ్తామని ఆలం కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లి మార్చి 7వ తేదీన వరంగల్ నుండి వెళ్లిపోయారు.
గరీబ్ రైలులో రఫికా సంజయ్ బయలుదేరారు. అయితే రఫికాను హత్య చేయాలని ప్లాన్ చేసుకొన్న సంజయ్ నిద్రమాత్రలు కలిపిన మజ్జిగను ఆమెతో తాగించాడు. ఈ మజ్జిగ తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. మత్తులోకి జారుకొన్న తర్వాత ఆమె గొంతుకు చున్నీ బిగించి చంపేశాడు. ఆ తర్వాత రైలు నుండి ఆమెను కిందకు తోసేశాడు.
రఫికా కోల్‌కత్తా రాలేదని ఆలం కు రఫికా తల్లి పదే పదే ఫోన్లు చేసి అడిగింది. అయితే ఈ విషయమై సంజయ్ కుమార్ ను ఆలం కుటుంబసభ్యులు నిలదీశారు. అయితే సంజయ్ కుమార్ నుండి సరైన సమాధానం రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆలం కుటుంబాన్ని కూడ మట్టుబెట్టాలని సంజయ్ కుమార్ ప్లాన్ చేశాడు.ఆలం ఇంట్లో పుట్టిన రోజు వేడుకను ముహుర్తంగా పెట్టుకొన్నాడు.
గొర్రెకుంటలోని సాయిదత్త గన్నీ బ్యాగ్ కంపెనీ ఆవరణలో మసూద్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.ఇదే భవనంలో బీహార్ రాష్ట్రానికి చెందిన శ్రీరాం, శ్యామ్ లు కూడ నివాసం ఉంటున్నారు.మే 20వ తేదీన మసూద్ ఆలం ఇంట్లో పుట్టినరోజు వేడుక ఉన్న విషయాన్ని సంజయ్ తెలుసుకొన్నాడు. అయితే మే 16 నుండి నాలుగు రోజుల పాటు సంజయ్ కుమార్ ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. మే 18వ తేదీన హన్మకొండలోని మెడికల్ షాపులో నిద్రమాత్రలను కొనుగోలు చేశాడు.
మే 20వ తేదీన సాయంత్రం సైకిల్ పై సంజయ్ కుమార్ ఆలం ఇంటికి వచ్చాడు. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఆలం కుటుంబం వండుకొన్న భోజనంలో నిద్రమాత్రల పౌడర్ కలిపాడు. ఇదే భవనంలో ఉంటున్న బీహార్ కు చెందిన శ్రీరాం, శ్యామ్ లు వండుకొన్న భోజనంలో కూడ నిద్రమాత్రల పౌడర్ ను కలిపాడు.
అందరూ నిద్రమత్తులోకి జారుకొన్నారని నిర్ధారించుకొన్న తర్వాత సంజయ్ కుమార్ ఒక్కొక్కరిని గోనెసంచిలో మూటగా కట్టి గోదాం పక్కనే ఉన్న గొర్రెకుంట బావిలో వేశాడు. సాక్ష్యం లేకుండా ఉండేందుకు గాను బీహార్ కు చెందిన ఇద్దరిని కూడ నిందితుడు మట్టుబెట్టాడు. మే 21వ తేదీ ఉదయం ఐదు గంటల సమయంలో సైకిల్ పై సంజయ్ తన ఇంటికి వెళ్లిపోయాడు.
సీసీటీవీ పుటేజీ ఆధారంగా సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్క హత్య కేసు నుండి తప్పించుకొనేందుకు 9 మందిని హత్య చేసిన సంజయ్ కేసులో ఇవాళ వరంగల్ కోర్టు తీర్పు చెప్పనుంది.