Today Weather : ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, ఉక్కపోత పెరుగుతుంది
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే నమోదు కానున్నాయి. కానీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఫీలింగ్ ఉంటుంది. ఇలా ఎందుకు అనిపిస్తుందో తెలుసా?

Telugu States Weather
Telugu States Weather : ఇంకా ఫిబ్రవరి కూడా ముగియలేదు అప్పుడే ఎండలు మండిపోతున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో అత్యధికంగా 35 నుండి 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు... ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఉక్కపోత కూడా పెరిగిపోతోంది.
ఈవారం తెలంగాణతో పాటు ఏపీలో వేడిగాలలు వీస్తాయి...దీంతో ఉక్కపోత పెరిగిపోతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర, ఆగ్నేయ, ఈశాన్య దిక్కులనుండి గాలులు వీస్తున్నాయని... వీటితో పాటు తేమ కూడా వస్తోందని తెలిపారు. అందువల్లే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదైనా ఉక్కపోత మాత్రం విపరీతంగా ఉంటుందని ప్రకటించారు.
ముఖ్యంగా తెలంగాణలో ఈ ఉక్కపోత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుండి 37 డిగ్రీలు, కనిష్టంగా 18 నుండి 22 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపారు.
తెలంగాణలో ఫిబ్రవరి 25 మంగళవారం ఉష్ణోగ్రతలు :
ఫిబ్రవరి 25 అంటే ఇవాళ మంగళవారం తెలంగాణలో వాతావరణం కాస్త చల్లగానే ఉండనుంది. నిన్నటి(సోమవారం) మాదిరిగానే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. కనిష్టంగా 20 డిగ్రీలు, గరిష్టంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
ఆకాశం మబ్బులు కమ్మేసి కాస్త చల్లగా ఉంటుంది. ఇదే సమయంలో ఉక్కపోత పెరుగుతుంది. గాలితో తేమ శాతం పెరగడమే ఉక్కపోతకు కారణంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో మంగళవారం ఉష్ణోగ్రతలు :
ఫిబ్రవరి 25న ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండలు కాస్త తక్కువగానే కాస్తాయి. కనిష్టంగా 23 డిగ్రీలు, గరిష్టంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్నిప్రాంతాల్లో మబ్బులు కమ్మేసి వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని తెలిపారు.