రూ.4,00,000 ఎలక్ట్రిక్ వాహనం కేవలం రూ.1,20,000 ...తెలుగు మహిళలకు బంపరాఫర్
తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఓ విశేషమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉమెన్ కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడమే కాదు 70% సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనం అందిస్తున్నారు. అంటే ఈవి వాహనం ఎంతకు వస్తుందో తెలుసా? .

Telangana Womens
Hyderabad : మహిళా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు అమలుచేస్తోంది. గృహలక్ష్మి పథకం ద్వారా ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ పై రూ.500 సబ్సిడి అందిస్తోంది రేవంత్ సర్కార్. త్వరలోనే నెలకు రూ.2,500 ఆర్థిక సాయం పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు.
ఇలా మహిళా సంక్షేమమే కాదు వారి సాధికారత కోసం కూడా ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే రాష్ట్ర ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ సొసైటీ ద్వారా మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే చర్యలు చేపట్టారు. ఆడబిడ్డలు కూడా తాము అబలలం కాదు సబలలం అని నిరూపించుకుంటున్నారు... ప్రభుత్వ అవకాశాలను అందింపుచ్చుకుని పురుషులతో సమానంగా రాణిస్తున్నారు.
ప్రస్తుతం సాంప్రదాయ వాహనాలు తగ్గి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఈ ఈవి వాహనాల డ్రైవింగ్ లో మహిళలకు శిక్షణ ఇస్తోంది తెలంగాణ ఉమెన్ కార్పోరేషన్. అంతటితో ఆగకుండా వారికి భారీ సబ్సిడితో ఈవి వాహనాలను అందిస్తోంది. ఇలా మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ కుటుంబపోషణలో భాగం పంచుకునే అవకాశం కల్పిస్తున్నారు.
Free Driving Classes for Women
మహిళలకు ఫ్రీగా ఈవి వాహనాల డ్రైవింగ్ శిక్షణ :
ఒకప్పుడు డ్రైవింగ్ అంటే కేవలం పురుషుల పనే అన్న భావన ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్దీ మహిళలు కూడా వాహనాలను నడపడం ప్రారంభించారు. ఇప్పుడు దీన్నే వారికి ఉపాధి అవకాశంగా మార్చే ప్రయత్నంచేస్తోంది తెలంగాణ ఉమెన్ కార్పోరేషన్.
హైదరాబాద్ లో స్వయం ఉపాధి కోరుకునే మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు, టూ వీలర్ డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తోంది మహిళా కార్పోరేషన్. హైదరాబాద్ కూకట్ పల్లిలోని దుర్గాబాయ్ మహిళా శిశు వికాస కేంద్రంలోని డ్రైవింగ్ ట్రాక్ పై ఉదయం, సాయంత్రం ఫ్రీగానే ఈ డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్, డ్రైవింగ్ రూల్స్, ప్రయాణికులతో ఎలా ప్రవర్తించాలి అన్నదానిపై క్లాస్ రూమ్ శిక్షణ ఇస్తున్నారు.
ఇలా భర్త, పిల్లలు వెళ్లిపోయాక మద్యాహ్న సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలకు ఈ డ్రైవింగ్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖాళీ సమయంలో ప్యాసింజర్ వాహనాలు నడుపుకుని కుటుంబానికి ఆర్థికంగా ఉండవచ్చు. ఇలా స్వయం ఉపాధిని పొందాలనుకునే 18 నుండి 45 ఏళ్లలోపు మహిళలకు 45 నుండి 60 రోజుల శిక్షణ ఇప్పిస్తోంది తెలంగాణ మహిళా కార్పోరేషన్.
Telangana Women EV Subsidy
రూ.4 లక్షల EV వాహనం రూ.1,20,000 కే పొందడం ఎలా?
డ్రైవింగ్ శిక్షణ పూర్తయ్యాక ఆర్టిఏ అధికారులతో సమన్వయం చేసుకుంటూ లైసెన్స్ కూడా ఇప్పిస్తోంది మహిళా కార్పోరేషన్. అంతటితో ఆగకుండా భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలను ఇప్పించి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
ఈ మహిళా డ్రైవింగ్ కార్యక్రమంలో కార్పోరేషన్ ఛైర్మన్ శోభారాణి మాట్లాడుతూ... హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఆటోల కొరత కనిపిస్తోందని అన్నారు. అందువల్లే మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోల డ్రైవింగ్ లో శిక్షణ ఇప్పించడమేకాదు వాటిని కొనుగోలుచేసేందుకు సహకరిస్తున్నామని శోభారాణి స్పష్టం చేసారు.
ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రిక్ ఆటో ధర దాదాపు 4 లక్షలవరకు ఉంది... వీటిని 70 శాతం సబ్సిడి మహిళలకు అందిస్తున్నామని శోభారాణి తెలిపారు. మిగతా 30 శాతం కూడా అతి తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామన్నారు. ఇలా ఆర్థిక భారం లేకుండానే మహిళలు మంచి ఉపాధి పొందేలా ఏర్పాట్లు చేసామని కార్పోరేషన్ ఛైర్మన్ శోభారాణి స్పష్టం చేసారు.
రూ.4 లక్షల ఎలక్ట్రిక్ ఆటోపై 70శాతం సబ్సిడి అంటే ఏకంగా 2,80,000 రూపాయలు తగ్గుతుంది. అంటే కేవలం రూ.1,20,000 ఈవి ఆటో మహిళలకు దక్కుతుందన్నమాట. ఈ డబ్బులు కూడా తక్కువ వడ్డీకే రుణం ఇప్పిస్తామని మహిళా కార్పోరేషన్ ఛైర్మన్ చెబుతున్నారు. అంటే మహిళలు చేతిలోంచి రూపాయి చెల్లించకుండానే EV ఆటో వారి సొంతం అవుతుంది.