Weather : తెలంగాణకు చల్లని కబురు : ఈ రెండ్రోజులు హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లొ కూల్ కూల్ వెదర్
తెలంగాణ ప్రజలకు వేడి వాతావరణం నుండి ఉపశమనం లభిస్తోంది. కొన్ని జిల్లాల్లో చలికాలంలో మాదిరిగా అత్యల్పంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏఏ జిల్లాలు చల్లబడుతున్నాయో తెలుసా?

Hyderabad Weather
Telangana Weather : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలం ప్రారంభం కాకముందు ఫిబ్రవరిలోనే ముదిరిన ఎండలు మార్చిలో మండిపోతున్నాయి. పగలు మండుటెండలు, వేడిగాలులు... రాత్రి ఉక్కపోతతో ప్రజలు సతమతం అవుతున్నారు.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వేడి, ఉక్కపోతతో సతమతం అవుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు. ఇవాళ, రేపు (గురు, శుక్రవారం) తెలంగాణలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి,కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో రాత్రి చల్లచల్లని వాతావరణం ఉంటుందని తెలిపారు.
తెలంగాణలో వాతావరణ సమాచారాన్ని అందించే 'తెలంగాణ వెదర్ మ్యాన్' ఎక్స్ ఖాతాలో తెలిపిన వివరాల ప్రకారం... గత రాత్రి హైదరాబాద్ యూనివర్సిటీలో 12, రాజేంద్రనగర్ లో 12.2, మౌలాలిలో 14.6, గచ్చిబౌలిలో 14.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అయితే రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయినట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యానిలో అత్యల్పంగా 8.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆదిలాబాద్ జిల్లా జైనాద్ లో 9.2, ఆదిలాబాద్ అర్బన్ 9.4, బెలా 9.5, బజరత్ పూర్ 9.5, సంగారెడ్డి జిల్లా అందోల్ 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయ్యాయి.
ఈ చల్లటి వాతావరణ మరో రెండ్రోజులు కొనసాగుతుందని తెలిపారు. మార్చి 7 శుక్రవారం రాత్రి వరకు రాత్రులు చల్లగా ఆహ్లాదకరమైన వాతావరణంఉంటుందని తెలిపారు. ఉత్తర భారతదేశంలో వీస్తున్న చల్లని గాలుల ప్రభావంతో తెలంగాణ వాతావరణ చల్లబడుతోందని తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ వేదికన తెలిపారు.