Weather : తెలంగాణలో మండుటెండలు ... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
వేసవి ఆరంభంలోనే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసారు. ఏయే జిల్లాలకు అలర్ట్ జారీ చేసారంటే..

Telangana Weather
Weather : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. అయితే ఈ ఎండలతీవ్రత ఈ రెండ్రోజులు (శని, ఆదివారం) మరింత ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
వీకెండ్ కాబట్టి చాలామంది కుటుంబంతో కలిసి బయటకు వెళ్లేందుకు ఇష్టపడతారు. అలాంటివారు ఎండలనుండి రక్షించుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్దుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తెలంగాణలోని కొన్నిజిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ నెలలో రోజులు గడుస్తున్నకొద్దీ ఎండలు పెరుగుతాయని... నెలాఖరుకు వచ్చేసరికి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ముఖ్యంగా దక్షిణ,ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందువల్లే ఎండలు మండిపోయే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు. కాబట్టి హెచ్చరికలు జారీచేసిన జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీచేసిన జిల్లాలివే :
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్,ఖమ్మం, గద్వాల, నారాయణపేట్, భద్రాద్రి కొత్తగూడెం,ములుగు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో కూడా ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ పేర్కోంది.
తెలంగాణలో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం ఉంది. మధ్యాహ్నం ఎండలు మండిపోతూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఇక రాత్రులు, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే రాత్రులు చలికాలంలో మాదిరిగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.