Telangana Jobs : తెలంగాణలో కొలువుల జాతర ... శాఖలవారిగా భర్తీ చేసే పోస్టుల సంఖ్య, వివరాలు
తెలంగాణలో భారీ ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కాార్ సిద్దమయ్యింది. తాజాగా వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసారు. ఈ క్రమంలో త్వరలో భర్తిచేసేలా కనిపిస్తున్న మొత్తం ఉద్యోగాలివే..
Telangana Jobs
Telangana Jobs : డిగ్రీలు చేతికొచ్చి ఏళ్లు గడుస్తున్నా చాలామంది తెలంగాణ యువతీ యువకులు ఇంకా ఉద్యోగాలు రాలేవు. అసలు తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్ళు, నిధులు, నియామకాలు... ఇందులో నీళ్లు, నిధుల సంగతి అటుంచితే స్వరాష్ట్ర ఏర్పాటుతర్వాత ఆశించిన స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాక, ప్రైవేట్ జాబ్స్ చేయడానికి మనసొప్పక చాలామంది ఉన్నత చదువులు చదివికూడా నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దం అవుతున్న నిరుద్యోగ యువతకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది.
అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. అంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలను కూడా భర్తీ చేసింది. ఇలా అధికారంలోకి వచ్చినతర్వాత ఈ ఏడాది పాలనలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసామని రేవంత్ సర్కార్ చెబుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా ఇవ్వనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రకటిస్తున్నారు. దీంతో ఇకపై కొలువుల జాతర జరిగే అవకాశం వుందికాబట్టి నిరుద్యోగులు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు.
Telangana Jobs
వైద్యారోగ్య శాఖలో 14 వేల ఉద్యోగాలు :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. 2023 డిసెంబర్ లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఆయన బాధ్యతలు చేపట్టి తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ పాలనను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాదికాలంలో చేసిన అభివృద్ది, అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన ఉద్యోగాల భర్తీని గుర్తుచేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం.
నిన్న(సోమవారం) హైదరాబాద్ ఎన్టిఆర్ మార్గ్ లోని హెచ్ఎండిఏ గ్రౌండ్ లో ప్రజాపాలన సభను ఏర్పాటుచేసింది ప్రభుత్వం... ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటనలు చేసారు. తమ ప్రభుత్వం విద్య,వైద్య శాఖలపై దృష్టి పెట్టిందని...అందులో భాగంగానే ఇప్పటికే ఈ రెండు శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు తెలిపారు. మరోసారి వైద్యారోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సీఎం కీలక ప్రకటన చేసారు.
వైద్యశాఖలో ఇప్పటికే 7,750 నర్సింగ్ పోస్టులను భర్తీ చేసినట్లు సీఎం గుర్తుచేసారు. ఇక మరో ఏడాదిలోపు వైద్యారోగ్య శాఖలో ఏకంగా 14వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడతాయని తెలిపారు. ఇలా ఒకేసారి వైద్యారోగ్య శాఖలో వేలాది పోస్టుల భర్తీ చేపట్టడం దేశంలోనే మొదటిసారని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతోనే ఈ నియామకాలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలోనే ఇటీవల నియామక ప్రక్రియ పూర్తిచేసుకుని ఉద్యోగాలు సాధించిన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 23 మంది ఫుడ్ సేప్టీ అధికారులకు నియామక పత్రాలు అందించారు సీఎం రేవంత్. ఇక ఇటీవలే గ్రూప్ 4 ఉద్యోగాల తుది ఫలితాలు వెలువడగా ఎంపికైన అభ్యర్థులకు రేపు(డిసెంబర్ 4) న నియామక పత్రాలు అందించనున్నారు సీఎం.
Telangana Jobs
విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీ :
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సిని నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు 11,062 ఉద్యోగాలతో డిఎస్సి నిర్వహించారు... అందులో ప్రతిభ కనబర్చి ఉద్యోగాలు పొందినవారికి నియామక పత్రాలను కూడా అందించారు. ఇలా ఉద్యోగాలను పొందినవారు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో బోధన అందిస్తున్నారు.
అయితే ఈ ఉద్యోగాల భర్తీ సమయంలోనే మరో డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం హామీ ఇచ్చింది...స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వంటి ప్రభుత్వ పెద్దలే ఈ మేరకు హామీ ఇచ్చారు. మరో 6 వేల టీచర్ పోస్టులను ఈ డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. కాబట్టి విద్యాశాఖలో మరిన్ని పోస్టుల భర్తీ ఖాయంగా కనిపిస్తోంది.
Telangana Jobs
హైడ్రాలో 3 వేల పోస్టులు :
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని చెరువుల కబ్జాలను అరికట్టేందుకు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రత్యేకంగా హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) ని ఏర్పాటుచేసింది. అయితే ఈ విభాగానికి అధికారాలేమో ఎక్కువ ఉద్యోగులేమో తక్కువగా వున్నారు. కాబట్టి హైడ్రాకు పూర్తిస్థాయి ఉద్యోగులను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇందుకోసం 3వేల ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యంది రేవంత్ సర్కార్.
ఇప్పటికే హైడ్రా 3వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రేవంత్ సర్కార్ కూడా హైడ్రాను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు సిద్దమయ్యింది... అందుకోసమే ఈ పోస్టుల భర్తీకి చకచకా చర్యలు తీసుకుంటోంది. అయితే కేవలం నూతన నియామకం ద్వారానే కాకుండి జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ లోని ఉద్యోగులు కొందరిని హైడ్రాకు బదిలీ చేయనున్నట్లు సమాచారం.
Telangana Jobs
మిగతా శాఖల్లోనూ ఉద్యోగాల భర్తీలు :
కేవలం విద్య,వైద్యారోగ్య శాఖల్లోనే కాదు మిగతా అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి రేవంత్ సర్కార్ సిద్దమయ్యింది. త్వరలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటనను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉద్యోగాల జాతర వుంటుందని అర్థమవుతుంది. వరుస ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో నిరుద్యోగులు కూడా తమ గవర్నమెంట్ జాబ్ కలను సాకారం చేసుకునేందుకు గట్టిగా కష్టపడుతున్నారు.
తెలంగాణతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. అలాగే రైల్వే,బ్యాకింగ్ రంగాల్లోనూ ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నాయి. కాబట్టి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.