Mutton : కిలో మటన్ కేవలం రూ.400 లకే ... అదీ హైదరాబాద్ లోనే, ఎక్కడో తెలుసా?
సండే వచ్చిందంటే చాలు తెలంగాణ ఇళ్లలో ముక్కల కూర ఉండాల్సిందే... కానీ ఇప్పుడు చికెన్ తిందామంటే బర్డ్ ప్లూ, మటన్ తిందామంటే ధర బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటిది కిలో మటన్ రూ.400 కే దొరికితే... ఇలా హైదరాబాద్ లో అతి తక్కువధరకే మటన్ దొరికే ప్రాంతమేదోో తెలుసా?

motton
Mutton Price : తెలంగాణలో ఏ పండగున్నా పబ్బమైనా 'యాట'తెగాల్సిందే. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో మాంసం,మందు లేకుంటే నడవదు. ఇంకా చెప్పాలంటే 'ముక్క లేనిదే ముద్ద దిగదు' అనే పదం తెలంగాణోళ్లను చూసే పుట్టిందా అనిపిస్తుంటుంది. అంతలా మటన్ తింటారు. ఇక ప్రతి ఆదివారం తెలంగాణ ఇళ్లలో చల్లని కల్లు, వేడివేడి మటన్ ఉంటుంది... కుటుంబసభ్యులంతా కలిసి కల్లు తాగుతూ మటన్ తో భోజనం చేస్తారు. ఇలా తెలంగాణ సంస్కృతిలో యాట (మటన్) అనేది ఓ భాగమైపోయింది.
అయితే ఇటీవల కాలంలో మేకల పెంపకం తక్కువయిపోయింది... గతంలో గొల్లకుర్మలు వీటిని పెంచేవారు. అయితే ప్రస్తుతం అడవులు అంతరించడంతో మేకలు, గొర్రెల పెంపకం కష్టంగా మారింది. దీంతో చాలామంది గొల్లకుర్మలు కులవృత్తులను విడిచిపెట్టారు. ఇలా మేకలు, గొర్రెల పెంపకం తగ్గడంతో మటన్ కు బాగా డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు చికెన్ తో సమానంగా ఉన్న మటన్ ధర ఇప్పుడు ఆకాశాన్నంటింది.
పల్లెటూళ్లలోనే కిలో మేక మాంసం ధర కనీసం రూ.700కు పైనే ఉంది. ఇక హైదరాబాద్ వంటి పట్టణాల్లో అయితే కిలో మటన్ రూ.800 నుండి రూ.1000 ఉంటోంది... కొన్ని ప్రాంతాల్లో వెయ్యికి పైనే ధర ఉంటోంది. దీంతో సామాన్యులు మటన్ తినలేని పరిస్థితి. అలాగని చికెన్ తిందామంటే బర్డ్ ఫ్లూ వంటి వ్యాధుల భయం పట్టుకుంది.
ఇలా పేద,మద్యతరగతి తెలంగాణ ప్రజలకు దూరమైన మటన్ హైదరాబాద్ శివారులోని ఓ మార్కెట్ లో అతి తక్కువ ధరకు లభిస్తోంది. నగరంలో కంటే సగం ధరకే అక్కడే మేక మాంసం లభిస్తుంది. ధర తక్కువ కాబట్టి పాడయిపోయింది, ఇతర జంతువుల మాంసం కలిపి అమ్ముతున్నారనే అనుమానం వద్దు... మనం కావాలంటే కళ్లముందే మేకను కోసి కూడా ఇస్తారు. ఇలా తక్కువ ధరకే మటన్ లభించే మార్కెట్ గురించి తెలుసుకుందాం.

Hyderabad Mutton Price
చెంగిచెర్ల మండి (మార్కెట్) :
హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలోని గ్రామం చెంగిచెర్ల. ఇక్కడ మేకల మండి అంటే మార్కెట్ ఉంది... నిత్యం వందలాది మేకలను వధించి మాంసం విక్రయిస్తారు. ఈ మార్కెట్ లో మటన్ హోల్ సేల్ ధరకు విక్రయిస్తుంటారు. అందువల్లే నగరంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా దొరకనంత తక్కువధరకు మటన్ లభిస్తుంది.
చెంగిచెర్ల మండిలో కిలో మేకమాంసం కేవలం రూ.400 నుండి 500 లోపే లభిస్తుంది. అంటే నగరంలో అరకిలో మటన్ ధరకే ఇక్కడ కిలో మటన్ వస్తుందన్నమాట. ఇక్కడ మేకలు కూడా తక్కువ ధరకు లభిస్తాయి... ఏదయినా పంక్షన్ కోసం మటన్ కావాలంటే ఇలా మేకను కొని అక్కడే కటింగ్ చేయించుకోవచ్చు. ఇలాగయితే కిలో మటన్ ఇంకా తక్కువ ధర పడుతుంది.
మటన్ తో పాటు మేక లివర్, బోటి కూడా తక్కువ ధరకే లభిస్తుంది. ఓ మేక లివర్ మొత్తం రూ.150 నుండి రూ.250 వరకు, బాగా క్లీన్ చేసిన బోటీ కేవలం రూ.150 కిలో లభిస్తుంది. ఇలా అతి తక్కువ ధరకే లైవ్ మేకలతో పాటు నాణ్యమైన మటన్ లభిస్తుంది. అందువల్లే నగరవాసులు మరీ ముఖ్యంగా సికింద్రాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లోని ప్రజలు ఆదివారం వచ్చిందంటే చాలు చంగిచర్లకు వెళుతుంటారు... తక్కువ ధరకే మంచి మటన్ తీసుకుంటారు.
Mutton Price
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా పెరిగిన మటన్ ధర :
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బర్డ్ ప్లూ వ్యాప్తి చెందుతోంది. ఈ బర్డ్ ప్లూ వ్యాపించి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాదిగా కోళ్లు మృతిచెందాయి. ఈ కోళ్ల నుండి ఇది మనుషులకు కూడా వ్యాపిస్తోంది. దీంతో తెలుగు ప్రజలు చికెన్ తినడం మానేసారు. అందరూ మటన్ లేదంటే చేపలు తినడం ప్రారంభించారు.
ఇలా ఒక్కసారిగా మేకమాంసంకు డిమాండ్ పెరిగింది. దీంతో మటన్ ధర అంతకంతకు పెరుగుతూ ఇప్పుడు రూ.1000 దాటింది. హైదరాబాద్ వంటి నగరాల్లో కొన్నిచోట్ల కిలో మటన్ రూ.1500 కూడా పలుకుతోంది. సాధారణంగారూ.700-800 ధర ఉండే కిలో మటన్ ఒక్కసారిగా రూ.200 కు పైగా పెరగడంతో సామాన్యులు దీనివైపు చూడలేని పరిస్థితి ఉంది.