Weather : హైదరాబాద్ లో వాతావరణ మార్పులు... ఆకాశం మేఘావృతం
తెలంగాణలో నేడు(బుధవారం) ఎండలు మండిపోతే హైదరాబాద్ లో మాత్రం కాస్త ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉంటుందంటే...

Hyderabad Weather
Weather : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పుడే 40 డిగ్రీలకు చేరువగా ఉంటున్నాయి. సాధారణంగా అత్యల్పంగా 20 డిగ్రీలు, గరిష్టంగా 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే నేడు(మార్చి 5 బుధవారం) ఎండల తీవ్రత కాస్త తక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం చెబుతోంది.
ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నేడు ఆకాశం మేఘాలు కమ్ముకుని ఉండటంతో వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో కనిష్టంగా 20 డిగ్రీలు, గరిష్టంగా 33 డిగ్రీ సెల్సియస్ ఉండే అవకాశం ఉంది. అంటే సాధారణం కంటే రెండు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తక్కువగా ఉండే అవకాశాలున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇలాగే మిక్సుడ్ వెదర్ ఉండనుంది. అంటే మేఘాలు అడ్డువచ్చినప్పుడు ఎండలనుండి కాస్త ఉపశమనం...తిరిగి మళ్లీ భానుడి భగభగలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం సమయంలో అవసరం ఉంటేతప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిది.
తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందంటే...
తెలంగాణలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. వేసవి ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సీయస్ కు చేరువయ్యాయి. నిన్న (మంగళవారం) అత్యధికంగా ఖమ్మంలో 39.8 డిగ్రీలు,పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. రాబోయే రెండురోజులు కూడా రోజులు కూడా ఎండల తీవ్రత ఇలాగే ఉండనుందని... అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ లో మాత్రం గరిష్టంగా 32, 33 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణం ఎలా ఉంటుందంటే..
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండలు మండిపోతున్నాయి. బుధవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయివుండటంతో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. గరిష్టంగా 35 డిగ్రీ సెల్సియస్, కనిష్టంగా 23 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి.