Beer production : ఫ్రీగా వచ్చే దొడ్డుబియ్యంతో రూ.200 కూల్ బీర్ రెడీ...
వేసవికాలం వచ్చిందంటే రూ.200-250 ఖర్చుచేసి అయినా చల్లచల్లని బీర్ తాగేందుకు చాలామంది ఇష్టపడతారు. మరి ఈ బీర్ ను ఫ్రీగా వచ్చే బియ్యంతో తయారుచేస్తున్నారని మీకు తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Beer production
Ration Rice : వేసవికాలం మొదలయ్యింది... ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ మండుటెండల నుండి ఉపశమనం కోసం చల్లచల్లని బీరు తాగడాన్ని చాలామంది ఇష్టపడతారు. కేవలం యువత మాత్రమే కాదు రమ్, విస్కీ తాగే పెద్దవాళ్ళు కూడా సమ్మర్ లో బీర్లు తాగేందుకే ఇష్టపడతారు. అందువల్లే ఎండాకాలంలో బీర్ల విక్రయాలు బాగా పెరిగి ఒక్కోసారి డిమాండ్ కు తగ్గ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది.
బీర్ల తయారీ సంస్థలు (బేవరేజస్) కూడా సమ్మర్ లో ఉత్పత్తిని పెంచుతుంటాయి. ఈ క్రమంలో బీర్ల తయారీకి కావాల్సిన ముడిసరుకును సేకరించడమే బేవరేజేస్ పెద్ద సవాల్. ఇందుకోసం కొన్ని బీర్ల ఉత్పత్తి సంస్థలు అడ్డదారులు తొక్కుతున్నట్లు సమాచారం. పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అందించే రేషన్ బియ్యంను అక్రమంగా సేకరిస్తున్న బేవరేజెస్ బీర్ల తయారీకీ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా రేషన్ షాప్ నుండి బేవరేజెస్ కు బియ్యం చేరవేయడానికే కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ముఠాలో కొందరు రేషన్ డీలర్లే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రౌడీ షీటర్లు, లోకల్ లీడర్లు దళారులుగా వ్యవహరించి రేషన్ బియ్యంను పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో పేదల ఇంటికి చేరాల్సిన రేషన్ బియ్యం బేవరేజెస్ కు చేరుతున్నాయి... ఇలా అన్నంగా మారి అభాగ్యుల ఆకలి తీర్చాల్సిన బియ్యం కాస్త బీర్లుగా మారి తాగుబోతుల దాహం తీరుస్తున్నాయి.
ఈ రేషన్ బియ్యం అక్రమాలు చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి. ఈ రేషన్ బియ్యం అమ్ముకుని పేదలు లాభపడుతున్నారా అంటే అదీలేదు... వారికి చిల్లర పడేసి దళారులు, బేవరేజెస్ కంపనీలే భారీగా లాభాలు పొందుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రేషన్ బియ్యం అక్రమాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం.
ration rice
రేషన్ షాప్ నుండి బీర్ల తయారీ వరకు రేషన్ బియ్యం ఎలా చేరుతోంది :
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలకు రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఈ రేషన్ బియ్యంను కనీసం కిలో ఒకటి రెండు రూపాయలు ఇచ్చేవారు... కానీ కరోనా కాలంలో ఉచితంగా పంపిణీ ప్రారంభించారు... అప్పటినుండి ఇలాగే పంచుతున్నారు.
ఇలా పేదలు ఆకలిబాధతో అలమటించకుండా ఉండాలన్న సదుద్దేశంలో ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీచేస్తుంటే చాలామంది దీన్ని చులకనగా చూస్తున్నారు. చాలామంది రేషన్ బియ్యం తీసుకోవడం, తినడం చులకనగా భావిస్తున్నారు... అందుకే మంచి పోషకాలు కలిగిన ఈ బియ్యాన్ని అతి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. ఇలా ప్రజల నుండి రేషన్ బియ్యం సేకరించడమే కొందరు వ్యాపారంగా మార్చుకున్నారు.
ఆసక్తికర విషయం ఏమిటంటే కొందరు రేషన్ డీలర్లే ఈ బియ్యం అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నారు. కార్డుదారులను బియ్యం తమకే అమ్మేలా ఒత్తిడితెచ్చి కిలో రూ.8 నుండి రూ.10 ఇస్తున్నారు. ఇలా టన్నులకొద్ది బియ్యం సేకరించి కిలో రూ.15-20 చొప్పున మంచి లాభం చూసుకుని అమ్ముకుంటున్నారు. దళారులు కూడా ఇదే ఇలాగే రేషన్ బియ్యం సేకరిస్తున్నారు.
ఇలా కొందరు రేషన్ డీలర్లు, దళారులు ప్రజల నుండి రేషన్ బియ్యం సేకరించి మిల్లర్లకు అమ్ముతున్నారు. వాళ్లు బియ్యంను నూకలుగా మార్చి అనుమానం రాకుండా బేవరేజెస్ కు తరలిస్తున్నారు. మిల్లర్లు కిలో బియ్యం రూ.25-35 కి బీర్ల తయారీ సంస్థలకు అమ్ముకుంటున్నారు. ఇలా పలువురి చేతులుమారి చివరకు పేదవాడి కంచంలోకి చేరాల్సిన రేషన్ బియ్యం బీరు సీసాల్లోకి చేరేందుకు తరలుతున్నాయి.
beer production
రేషన్ బియ్యంతో బీర్ల తయారీ :
పేదలకోసం రేషన్ షాపుల ద్వారా అందించే దొడ్డుబియ్యంలో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో పోర్టిఫైడ్ బియ్యంను కలిపి పేదలకు మంచి పోషకాలు, విటమిన్లు అందించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. కానీ కొందరు దళారుల కారణంగా అధిక పోషకాలున్న ఈ రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది... ఇందులో అధికశాతం బీర్ల తయారీకోసం బేవరేజెస్ కు తరలుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని బేవరేజేస్ రేషన్ బియ్యాన్ని భారీగా సేకరిస్తున్నట్లు సమాచారం. మిల్లర్ల నుండి టన్నుల కొద్ది బియ్యాన్ని తీసుకుంటున్నారు... రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుగా తరలిస్తున్నారు మిల్లర్లు. ఈ దొడ్డుబియ్యం గంజిశాతం అధికంగా ఉంటుంది... ఇది బీర్ల తయారీకి చాలాబాగా ఉపయోగపడుతుంది. అందువల్లే ఈ రేషన్ బియ్యంపై బేవరేజస్ అంత ఆసక్తి చూపిస్తున్నాయి.
రిస్క్ అని తెలిసినా ఈ రేషన్ బియ్యంనే కొనుగోలు చేస్తున్నాయట బేవరేజస్. తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తిని పొందవచ్చే కాబట్టి రేషన్ బియ్యం వాడటం అక్రమం అని తెలిసినా వీటినే ఉపయోగిస్తున్నారు. ఇలా కొందరు రేషన్ డీలర్లు, దళారులు, మిల్లర్లు, బేవరేజస్ కుమ్మక్కయి పేదల రేషన్ బియ్యాన్ని తాగుబోతుల బీర్లుగా మారుస్తున్నాయి... ఆకలి తీర్చేవాటిని మత్తుకోసం ఉపయోగస్తున్నారు.
ఇటీవల తెలంగాణలో భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠాలు పట్టుబడుతున్నాయి. ఈ బియ్యం ఎక్కడికి తరలిస్తున్నారని పోలీసులు విచారించగా అసలు విషయం బైటపడింది. బీర్ల తయారీకి ఈ రేషన్ బియ్యం తరలిపోతున్నట్లు గుర్తించారు. పోలీసుల నుండి సమాచారం అందుకున్న పౌరసరఫరా శాఖ అధికారులు రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు.