డిసెంబర్ లో మరో సెలవు ఎక్స్ట్రా ... వచ్చే సోమవారం స్కూల్స్ బంద్, ఎందుకో తెలుసా?
ఈ నెలలో ఇప్పటికే స్కూల్స్ కి చాలా సెలవులు వున్నాయి. ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రాగా మరో సెలవు వచ్చిచేరింది. వచ్చే సోమవారం స్కూల్స్ బంద్ కానున్నాయి. ఎందుకో తెలుసా?
Telangana Bandh
Telangana Bandh : తెలంగాణలో మరోసారి విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. ఇప్పటికే డిసెంబర్ లో భారీగా సెలవులు వస్తున్నాయి... క్రిస్మస్,బాక్సింగ్ డే (25,26 తేదీల్లో) సందర్భంగా విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. క్రిస్టియన్ మిషనరీ విద్యాసంస్థలకు ఏకంగా ఐదురోజుల సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత న్యూఇయర్, సంక్రాంతి అంటూ ఈ సెలవులు కొనసాగనున్నాయి. ఇలా వరుసగా భారీ సెలవులు వస్తుండటంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేవు.
అయితే డిసెంబర్ సెలవుల జాబితాలో మరో రోజు చేరింది. డిసెంబర్ 9న అంటే వచ్చే సోమవారం తెలంగాణ బంద్ కి మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు... ఇందుకు నిరసనగా మావోయిస్టు పార్టీ బంద్ కు పిలునిచ్చింది. సోమవారం విద్యాసంస్థలు, వ్యాపారులు స్వచ్చందంగా బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖను విడుదల చేసారు.
ఈ తెలంగాణ బంద్ కారణంగా డిసెంబర్ 9న రాష్ట్రంలోని అన్నిస్కూళ్లకు సెలవు వచ్చే అవకాశం లేదు. కేవలం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే బంద్ ప్రభావం ఎక్కువగా వుంటుంది... కాబట్టి అక్కడే విద్యాసంస్థలు బంద్ పాటించే అవకాశం వుంది. అయితే హైదరాబాద్ లో ఈ బంద్ ప్రభావం వుండకపోవచ్చు...కాబట్టి స్కూళ్లు యదావిధిగా నడిచే అవకాశం వుంది.
maoist
ఇంకా మావోయిస్టుల లేఖలో ఏముందంటే :
నవంబర్ 30న అంటే గత శనివారం ఏడుగురు మావోయిస్టులతో కూడిన ఓ దళం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీపంలోని అడువుల్లో వుండగా దారుణం జరిగిందని జగన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆరోజు సాయంత్రం పోల్కమ్మ వాగు దగ్గరున్న ఓ ఆదివాసి గ్రామంలో బాగా నమ్మిన వ్యక్తిని భోజనానికి ఏర్పాటుచేయాలని కోరారని తెలిపారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి పోలీసులకు అప్రూవర్ గా మారిపోయాడు... అందువల్లే భోజనంలో మత్తుపదార్థాలు కలిపి మావోయిస్ట్ లు స్పృహ కోల్పోయేలా చేసాడని జగన్ లేఖలో పేర్కోన్నారు.
ఇలా ఏడుగురు మావోయిస్టులు స్పృహ కోల్పోగానే పోలీసులకు సమాచారం ఇచ్చాడని... వెంటే గ్రేహౌండ్స్ దళాలు అక్కడికి చేరుకున్నాయని తెలిపాడు. స్పృహలేకుండా పడివున్న మావోయిస్టులను బంధించి చిత్రహింసలకు గురిచేసారని... చివరకు అతి సమీపంనుండి వారిని కాల్చి చంపారని తెలిపారు. ఇలా పోలీసుల బూటకపు ఎన్కౌంటర్ కు కామ్రేడ్స్ బలయ్యారని మావోయిస్ట్ పార్టీ నేత జగన్ ఆవేదన వ్యక్తం చేసారు.
ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కురుసం మంగు అలియాస్ పాపన్న, జెఎండబ్ల్యూపి డివిజన్ కమిటీ సభ్యులు ఏగోలపు మల్లయ్య అలయాస్ మధు, ఇల్లెందు-నర్సంపేట ఏరియా కమిటీ సభ్యులు ముచాకీ అందాల్ అలియాస్ కరుణాకర్, ఏరియా కమిటీ సభ్యులు ముచాకీ బూమే అలియాస్ జమున, రీజినల్ 2 మొదటి ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు పూనెం అలియాస్ కిషోర్, రీజినల్ కంపనీ 2 రెండవ ప్లటూన్ సభ్యుడు కర్టం కమాల్, ఏటూరు నాగారం-మహదేవ్ పూర్ ఏరియా దళసభ్యుడు కామ్రేడ్ జైసింగ్ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. వీరి మృతికి సంతాపం తెలిపి జోహార్లు అర్పించారు మావోయిస్టు పార్టీ నాయకుడు జగన్.
Auto Unions Bandh
రేపు తెలంగాణలో ఆటోల బంద్ :
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే అమలుచేసిన మొదటి పథకం మహాలక్ష్మి. మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించారు. ఇది మహిళలకు మంచి వార్తే... కానీ ఆటోవాలాల పరిస్థితి దారుణంగా మార్చింది. మహిళలంతా ఆర్టిసి బస్సుల్లోనే ప్రయాణిస్తుండటంతో తమకు గిరాకీలు లేకుండా పోయాయని... దీంతో కుటుంబపోషణ భారంగా మారిందని వాపోతున్నారు. తాము పడే కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఆటో యూనియన్స్ డిసెంబర్ 7న అంటే రేపు శనివారం ఆటోల బంద్ కు పిలుపునిచ్చాయి.
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజధాని హైదరాబాద్ తో తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసి ఈ బంద్ చేపట్టింది. తమ బంద్ కు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని కోరారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని... కుటుంబ పోషణ భారమై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వుందని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వమే ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని... ఇచ్చిన హామీ మేరకు సంవత్సరానికి రూ.15 వేల ఆర్థికసాయం చేయాలని రేవంత్ సర్కార్ ను కోరుతున్నారు.
అయితే ఈ ఆటోల బంద్ ఎఫెక్ట్ కూడా విద్యాసంస్థలపై పడనుంది. చాలామంది విద్యార్థులు స్కూళ్లకు ఆటోల్లోనే వెళుతుంటారు... రేపటి బంద్ కారణంగా ఆ స్టూడెంట్స్ ఇబ్బందిపడే అవకాశం వుంది. ఆటోల బంద్ కారణంగా పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లే పని తల్లిదండ్రులపై పడుతుంది. ఈ అవకాశం లేని విద్యార్థులకు శనివారం కూడా సెలవే అన్నమాట. ఇక ఉద్యోగులు, సామాన్యులు కూడా ఈ ఆటోల బంద్ తో ఇబ్బంది పడే అవకాశాలున్నాయి.