హుజూరాబాద్ బైపోల్స్: పోటీకి పొన్నం నై, రేవంత్ కి పరీక్షే
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎవరనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ చర్చించనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయనని పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనే విసయమై చర్చ సాగుతోంది.
2018 ఎన్నికల్లో ఈ స్థానంనుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించారు. దీంతో కొత్త అభ్యర్ధి కోసం ఆ పార్టీ అన్వేషణను ప్రారంభించింది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ జూన్ మాసంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ గంటల వ్యవధిలోనే ఆమోదించారు.
ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిపై కాంగ్రెస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మెన్ దామోదర రాజనరసింహ నేతృత్వంలో కమిటీ అభ్యర్ధి ఎంపికపై కసరత్తు చేయనుంది.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ స్థానం నుండి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి తాము సిద్దంగా లేనని పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు.
దీంతో ఈ స్థానం నుండి పోటీకి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ ముందుకు వస్తారనే విషయమై పార్టీ నాయకత్వం చర్చిస్తోంది. ఈ నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ సామాజిక వర్గా ఓట్లు గణనీయంగా ఉంటాయి. పొన్నం ప్రభాకర్ పోటీకి ఆసక్తి చూపడం లేదు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ లతో కూడిన కమిటీ చర్చించనుంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఉప ఎన్నికలు. దీంతో ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు రేవంత్ రెడ్డిపై ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితం దక్కితే రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వద్ద మంచి మార్కులు పడే అవకాశం ఉంది.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ కూడ అభ్యర్ధిని ఇంకా ప్రకటించలేదు. టీఆర్ఎస్ లో కూడ పలువురి పేర్లు కూడ విన్పిస్తున్నాయి. టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి ఎల్. రమణ పేరు కూడ విన్పిస్తోంది.
బీజేపీ నుండి మరోసారి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగనున్నారు. ఆఖరి నిమిషంలో ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకొంటే ఈటల రాజేందర్ భార్య జమున బరిలోకి దిగే అవకాశం ఉంది.