ఇక కేటీఆర్ దే బిఆర్ఎస్, గెలిస్తే సీఎం పదవి కూాడా : మరి కేసీఆర్, హరీష్, కవిత సంగతేంటి?
భారత రాష్ట్ర సమితి పగ్గాలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటున్నారు కేటీఆర్. ఇక పార్టీకి అన్నీ తానై వ్యవహరించేందుకు, గెలిచాక సీఎం పదవికి పొందేందుకు ఇప్పుడే ఓ మాస్టర్ ప్లాన్ సిద్దం చేసారు.
KTR
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి ... తెలంగాణ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన పార్టీ. ఉద్యమ పార్టీగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్ధానం స్వరాష్ట్ర ఏర్పాటుతర్వాత ఫక్తు రాజకీయపార్టీగా మారి అధికారంలోకి వచ్చింది. పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ గా మారినతర్వాత ఆ పార్టీ జాతకం మారిపోయింది. అధికారాన్ని కోల్పోయిన ఆ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది.
ఇలా ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ ఇప్పుడు నాయకత్వ మార్పిడికి సిద్దమయ్యింది. ఇంతకాలం బిఆర్ఎస్ ను అన్నీ తానై నడిపించారు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కానీ ఇప్పుడు ఆ పని కేటీఆర్ చేస్తున్నారు. అధికారికంగా తండ్రి పార్టీ పగ్గాలు అప్పగించకున్నా కల్వకుంట్ల తారక రామారావు బిఆర్ఎస్ ను చేతిలోకి తీసుకున్నారు. ఇప్పుడు పాదయాత్రకు కూడా సిద్దమే అంటు ప్రకటించడం ద్వారా పార్టీకి బాస్ ను మాత్రమే కాదు అధికారంలోకి వచ్చాక తానే ముఖ్యమంత్రిని అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు కేటీఆర్.
KTR
కేటీఆర్ పాదయాత్ర ప్రకటన :
మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటారు. తరచూ ఈ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలతో మమేకం అవుతుంటారు. ఇలా తాజాగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు 'యాస్క్ కేటీఆర్' (కేటీఆర్ ను అడగండి) పేరిట ఎక్స్ వేదికన క్యాంపెయిన్ చేపట్టారు.
ఈ క్రమంలోనే యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల ఆకాంక్ష మేరకు తప్పకుండా పాదయాత్ర వుంటుందన్నారు. ఈ ఒక్క సమాధానంలో అటు కాంగ్రెస్,బిజెపిలకు పొలిటికల్ వార్నింగ్ ఇవ్వడమే కాదు పార్టీ లీడర్లు,క్యాడర్ కు కూడా ఇక పార్టీలో అంతా తానేనని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం తెలంగాణలో పాలన గాడి తప్పిందని... రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే... బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని కేటీఆర్ తెలిపారు. ఇకపై బిఆర్ఎస్ మరింత దూకుడుగా ముందుకు వెళుతుందని... ప్రజల పక్షాన పోరాటం చేయనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
కేవలం ఏడాది పాలనలోనే కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేసింది... ఇంకో నాలుగేళ్లు మరెంత ఘోరంగా పాలన వుంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి వుందన్నారు. నాలుగేళ్ల తర్వాత ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవడం ఖాయం... అప్పటికే ఈ ప్రభుత్వం ఎంత నష్టం చేస్తుందో తలచుకుంటూ ఆందోళనగా వుందన్నారు. రాబోయే ప్రభుత్వానికి ఈ నష్టాలను పూడ్చుకుంటూ ముందుకు వెళ్లడం పెద్ద సవాల్ గా వుంటుందున్నారు.
KTR
కేటీఆర్ పాదయాత్ర వెనక అంతరార్థమిదేనా?
పాదయాత్ర... ప్రస్తుత రాజకీయాల్లో ఇదో సెంటిమెంట్ గా మారిపోయింది. ప్రతిపక్షంలో వున్నవారు పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తారు... ఇది చాలాసార్లు నిజమయ్యింది. ఇదే సెంటిమెంట్ ను కేటీఆర్ ఫాలో అవుతున్నట్లు అర్థమవుతోంది. పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకం కావడమే కాదు ప్రజా సమస్యలపై అవగాహన వస్తుంది. తద్వారా బలమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్దం కావచ్చు.
అయితే కేటీఆర్ పాదయాత్ర విషయంలో కేవలం ఇదొక్కటే కాదు చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంతకాలం తండ్రిచాటు బిడ్డలాగా కేసీఆర్ ను ఫాలో అవుతూ వచ్చారు కేటీఆర్. కానీ ఇప్పుడు కేసీఆర్ రాజకీయ మౌనం పాటిస్తుండటంతో ఇక ఆయన రాజకీయాలకు దూరమైనట్లే అనే ప్రచారం జరుగుతోంది. దీంతో తండ్రి స్థానాన్ని కైవలం చేసుకుని పార్టీ పగ్గాలు పూర్తిగా చేతుల్లోకి తీసుకోవాలన్నది కేటీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. కాబట్టి పాదయాత్ర ద్వారా బిఆర్ఎస్ పార్టీకి అన్ని తానే అనే సంకేతాలు పంపిస్తున్నారు.
KTR Harish Rao
బావ హరీష్ కు చెక్ :
కేసీఆర్ తర్వాత బిఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించేది ఎవరు అనే ప్రశ్న చాలాకాలంగా వినిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుండి తనవెంటే వున్న మేనల్లుడు హరీష్ రావు, సొంతకొడుకు కేటీఆర్ లలో ఎవరికి పార్టీ పగ్గాలను కేసీఆర్ అప్పగిస్తారనేది జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. తన రాజకీయ వారసుడు ఎవరో కేసీఆర్ స్పష్టత ఇవ్వకపోయినా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటీఆర్ కు అప్పగించడం ద్వారా కొంత క్లారిటీ ఇచ్చారు.
అయితే హరీష్ రావుతో కేటీఆర్ కు అంత ఈజీ కాదు. బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి బలమైన నాయకుడు హరీష్ రావు. ఓ సమయంలో కేసీఆర్ రాజకీయ వారసుడు హరీష్ అనే ప్రచారం కూడా జరిగింది. పార్టీ కష్టాల్లో వున్నపుడు ఆదుకుంటూ 'ట్రబుల్ షూటర్' గా పేరు తెచ్చుకున్నారు. ఇలా తనకంటే సీనియర్, పార్టీపై మంచి పట్టున్న హరీష్ రావుతో ఎప్పటికయినా కేటీఆర్ కు ప్రమాదమే. అందువల్లే ఈ పాదయాత్ర ద్వారా బావకు చెక్ పెట్టాలన్నది కేటీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది.
ఇప్పటికే తండ్రి సాయంతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా మారి హరీష్ కంటే తానే బలవంతుడినని కేటీఆర్ నిరూపించుకున్నారు. ఇప్పుడు పాదయాత్ర ద్వారా మరోసారి హరీష్ వర్గానికి కేటీఆర్ హెచ్చరిక జారీ చేస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రిని తానే అంటూ సంకేతాలు ఇస్తున్నారు. మరి కేటీఆర్ పాదయాత్ర ప్రకటనపై హరీష్, ఆయన వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.
KTR Kavitha
చెల్లి కవిత పరిస్థితి :
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఒక్క పాదయాత్రతో మేనబావ హరీష్ కు కాదు సొంత చెల్లి కవితకు కేటీఆర్ చెక్ పెడుతున్నారు. ఏపీలో షర్మిల మాదిరిగా ఇక్కడ కవిత కూడా తండ్రి రాజకీయ వారసత్వాన్ని ఆశించకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు కేటీఆర్. జైలుకు వెళ్లివచ్చిన తర్వాత కవిత రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఆమె యాక్టివ్ కాకముందే పాదయాత్ర ద్వారా కేసీఆర్ వారసుడిగా ప్రజల్లోకి వెళ్లేలా కేటీఆర్ ప్లాన్ చేసారు.
ఇప్పటికయితే కేటీఆర్,కవిత మధ్య మంచి సఖ్యత వుంది. భవిష్యత్ లో పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో తెలీదు. కాబట్టి కేటీఆర్ ముందుగానే జాగ్రత్తపడి పాదయాత్ర ద్వారా పార్టీకి హస్తగతం చేసుకుంటున్నారు.