కలం పట్టాల్సిన చేతులతో కలుపుతీత : కూలీగా మారిన తెలుగింటి చదువులతల్లి దీన గాధ
ఓ తెలుగింటి ఆడపడుచు దీనగాధ ఇది. చదువుల తల్లి కరుణించి ప్రతిష్టాత్మక కాలేజీలో సీటు సాధించినా ఆ అమ్మాయి కూలీగా మారాల్సి వచ్చింది. ఇంతకీ ఏమయ్యిందంటే...
Miryalaguda
Miryalaguda : చిన్నప్పటి నుండి అన్నీ కష్టాలే... వీటినుండి తమను గట్టెక్కించేది చదువేనని ఆమె బలంగా నమ్మింది. అందుకే ఎన్ని అవాంతరాలు ఎదురైనా చదువును మాత్రం వదిలిపెట్టలేదు. ఉన్నత చదువుల తర్వాత తన జీవితం మారిపోతుందని... కష్టాల కడలినుండి బయటపడి హాయిగా జీవించవచ్చని భావించింది. కానీ ఆ చదువుల తల్లి కలలపై ఆర్థిక కష్టాలు నీళ్లు చల్లాయి. కలం పట్టాల్సిన ఆ ఆడబిడ్డ చేతులు ఇప్పుడు కలుపు తీస్తున్నాయి... క్లాస్ రూంలో నీడపట్టున పుస్తకం పట్టాల్సిన ఆమె ఎండలో కొడవలి పట్టాల్సి వచ్చింది. ఇలా ఓ చదువుల తల్లి వ్యవసాయ కూలీగా మారిన దీన గాధ తెలంగాణలో వెలుగుచూసింది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని మారుమూల గిరిజన తండాకు చెందిన నునావత్ మౌనిక చిన్నప్పటినుండి చదువులో చాలా చురుకు. తల్లిదండ్రులకు దూరమైన ఈమె ఆ బాధను దిగమింగుకుని అనాధాశ్రమంలో వుంటూ చదువును కొనసాగించింది. చదివిందంతా ప్రభుత్వ పాఠశాల, కాలేజీలోనే కాబట్టి ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా సాఫీగా సాగింది. కానీ ఇప్పుడు ఉన్నత విద్యాభ్యాసానికి ఫీజులు కట్టాల్సి వుండటంతో ఆమె చదువు ముందుకు సాగడంలేదు. ఇలా ఆర్థిక కష్టాలు హాయిగా చదువుకోవాల్సిన మౌనికను వ్యవసాయ కూలీగా మార్చాయి.
Miryalguda
అనాధాశ్రమం నుండి హయ్యర్ స్టడీస్ వరకు :
ఒక్కప్పుడు చదువుకునే స్థాయినుండి ఇప్పుడు చదువు'కొనే' స్థాయికి మన విద్యావ్యవస్థ చేరుకుంది. కొందరికి చదువులతల్లి అనుగ్రహించినా... లక్ష్మీకటాక్షం మాత్రం వుండటంలేదు. దీంతో బంగారు భవిష్యత్ కలిగిన ఆ నిరుపేద బిడ్డల జీవితం ఇదే పేదరికంలో మగ్గిపోవాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితే మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండాకు చెందిన మౌనికది.
మారుమూల గిరిజన తండాకు చెందిన నూనావత్ లింగా, శాంతి దంపతుల కూతురు మౌనిక. ఈమె మూడేళ్ళ వయసులో వుండగా మరో ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతిచెందింది. ఇలా తల్లి ప్రేమను దూరమైన మౌనిక, ఆమె చెల్లి కల్యాణిని తండ్రి కూడా దూరం పెట్టాడు. ఇద్దరు ఆడపిల్లల ఆలనా పాలన వదిలేసి మరో పెళ్లిచేసుకుని వెళ్లిపోయాడు ఆ కసాయి తండ్రి.
తల్లిదండ్రులు లేని ఆ ఇద్దరు అమ్మాయిలను అన్నీ తానై పెంచింది అమ్మమ్మ బాణావత్ లచ్చి. చిన్నప్పటినుండి చదువులో మంచి ప్రతిభ కనబర్చిన మౌనికను బాగా చదివించారు అమ్మమ్మ లచ్చి, మేనమామ శ్రీను. కష్టాలను చూస్తూ పెరిగిన బాలిక చదువే తమ జీవితాన్ని మారుస్తుందని నమ్మింది. మంచి చదువు కోసం మౌనిక చాలాకాలం నల్గొండలోని ఓ అనాధాశ్రమంలో వుంది. ఇలా అష్టకష్టాలు పడి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.
ఇంటర్ బైపిసి చేసిన మౌనిక 9.9 గ్రేడ్ మార్కులు సాధించింది. ఆమె ప్రతిభను గుర్తించిన నాగసేనారెడ్డి అనే వ్యక్తి ఎంతగానో ప్రోత్సహించి ఈఏపీ సెట్, నీట్ పరీక్షలకు సన్నద్దం అయ్యేందుకు సాయం చేసారు. ఇలా బాగా చదివి మహబూబ్ నగర్ జిల్లా మాల్యాలలోని హార్టికల్చర్ కాలేజీలో సీటు సాధించింది. అయితే ఇది కన్వినర్ కోటా సీటు కావడంతో కొంత ఫీజు చెల్లించాల్సి వుంటుంది... అంత డబ్బులు కట్టి చదివించే స్థోమత తన నిరుపేద అమ్మమ్మ, మావయ్యకు లేకపోవడంతో మౌనిక వ్యవసాయ కూలీగా మారిపోయింది.
Miryalguda
సహాయం కోసం ఎదురుచూస్తున్న చదువుల తల్లి :
మాల్యాల హార్టికల్చర్ కాలేజీలో సీటు వచ్చినా మౌనిక చదువుకోలేకపోతోంది. దీంతో చేసేదేమీ లేక దాతల సాయాన్ని కోరుతోంది. ఎవరైనా ముందుకు వచ్చి అవసరమైన ఫీజులు చెల్లించి చదివు కొనసాగేలా చూడాలని మౌనిక కోరుతోంది. బాగా చదువుకుని మంచి స్థాయికి చేరుకున్నాక తనలాగా ఇబ్బందిపడేవారికి సాయం చేస్తానని మౌనిక అంటోంది.
దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న మౌనిక అప్పటివరకు ఇంట్లోనే వుంటూ కుటుంబానికి బారం కాకూడదని వ్యవసాయ కూలీగా మారింది. చదువుకోవాల్సిన ఆ ఆడబిడ్డ ఇలా పొలంలొ కలుపుతీయడం అందరినీ కలచివేస్తోంది. మౌనికకు సాయం చేయాలని తండా వాసులు కూడా దాతలను కోరుతున్నాయి.
మరో ఆడబిడ్డ దీన గాధ ఇది మేకల కాపరిగా ఐఐటి అమ్మాయి ...: తెలుగింటి చదువులతల్లి దీనగాధ ఇది