తెలంగాణలో వచ్చే ఏడాది సెలవులే.. సెలవులు: 2025 హాలిడే లిస్ట్ ఇదిగో
తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సెలవులను ప్రకటించింది. ఈ ఏడాది ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారు. పబ్లిక్ హాలిడేస్ ఎన్ని, ఆప్షనల్ హాలిడేస్ ఎన్ని తదితర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది అంటే 2025లో ఇచ్చే సెలవులను 2024 పూర్తి కాకుండానే ప్రకటించేసింది. ఇది కూడా ఒకరకంగా మంచిదే. ఎందుకంటే రానున్న వేసవి సెలవుల్లో తల్లదండ్రులు తమ పిల్లలతో కలిసి విహార యాత్రలకు వెళ్లాలనుకుంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగానే పబ్లిక్ హాలిడేస్ ప్రకటించడం వల్ల వచ్చే ఏడాదిలో చేయాల్సిన పనులన్నీ ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన హాలిడేస్ లిస్ట్ ను వివరంగా తెలుసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, విద్యార్థులకు 2025 సంవత్సరంలో ఏకంగా 50 సెలవులను ప్రకటించింది. వీటిలో 27 సాధారణ సెలవులు కాగా, 23 ఆప్షనల్ హాలిడేస్. ఈ ఆప్షనల్ హాలిడేస్ కావాలనుకున్న వారు తీసుకుంటారు. లేదా వచ్చి డ్యూటీ చేస్తారు.
ఈ సెలవులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో రిలీజ్ చేశారు. ఈ సెలవులను గమనిస్తే జనవరి 14న సంక్రాంతి (మంగళవారం), మార్చి 30న ఉగాది (ఆదివారం), ఏప్రిల్ 4న శ్రీరామ నవమి (ఆదివారం), ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే (శుక్రవారం), జులై 7న బోనాలు (సోమవారం), ఆగస్టు 27న వినాయక చవితి (బుధవారం), అక్టోబర్ 2న దసరా, గాంధీ జయంతి (గురువారం), అక్టోబర్ 20న దీపావళి (సోమవారం) మరికొన్నింటిని సాధారణ సెలవులుగా ప్రకటించారు.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఈ సెలవుల్లో శ్రీరామనవమి, భోగి, సంక్రాంతి, బోనాలు, దీపావళి, క్రిస్మస్, ఈద్ మిలాదున్ నబి, హోలీ, ఉగాది వంటి పండుగలకు పబ్లిక్ హాలిడేస్ గా ప్రకటించారు.
శ్రీ పంచమి, మహావీర్ జయంతి, బుద్ధ పూర్ణిమ, దుర్గాష్టమి, క్రిస్మస్ ఈవ్ వంటి రకరకాల పండుగలను ఆప్షనల్ హాలిడేస్ గా ఇచ్చారు. ఆయా సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, విద్యా సంస్థలు సెలవు ఇవ్వాలో లేదో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాయి.
ప్రభుత్వ సెలవుల లిస్ట్ రిలీజ్ చెయ్యడంపై గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడితో ఉండే తమకు ముందుగానే సెలవులు చెప్పడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి టూర్లు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.