ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ లో పడిపోయిన ఇండియా ర్యాంకింగ్.. ఆవరేజ్ స్పీడ్ ఎంతంటే ?
మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో భారత్ మళ్లీ ఒక ర్యాంకింగ్ కోల్పోయింది. ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ సంస్థ ఓక్లా డిసెంబర్ 2020 గ్లోబల్ ఇంటర్నెట్ స్పీడ్‌టెస్ట్ ఇండెక్స్‌లో భారత్ 129 వ స్థానంలో నిలిచింది. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ విషయంలో భారత్ 65 వ స్థానంలో ఉంది. ఈ కొత్త ఇండెక్స్‌లో ఖతార్ టాప్ ప్లేస్ పొందింది. ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ఖతార్ దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను అధిగమించింది. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో థాయ్‌లాండ్ హాంకాంగ్, సింగపూర్‌లను కూడా అధిగమించింది.
భారతదేశంలో ఆవరేజ్ మొబైల్ స్పీడ్
స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో లభించే 2020 డిసెంబర్ డేటా ప్రకారం భారతదేశంలో సగటు మొబైల్ డౌన్‌లోడ్ వేగం నవంబర్‌లో 13.51 ఎమ్‌బిపిఎస్ నుండి 4.4 శాతం తగ్గి 12.91 ఎమ్‌బిపిఎస్‌కు చేరుకుంది. అయితే, దేశంలో సగటు మొబైల్ అప్‌లోడ్ వేగం 4.90Mbps నుండి 1.4 శాతం పెరిగి 4.97Mbpsకి చేరుకుంది. దేశంలో లాటెన్సీ రేటు 51 మిల్లీసెకన్లను తాకింది.
ఖతార్‌లో మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్ 178.01 ఎమ్‌బిపిఎస్
గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం ఖతార్‌లో ఆవరేజ్ మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్ 178.01 ఎమ్‌బిపిఎస్, యుఎఇలో ఆవరేజ్ మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్ 177.52Mbps. 169.03Mbps వేగంతో ఆవరేజ్ మొబైల్ వేగం విషయంలో దక్షిణ కొరియా మూడవ స్థానంలో ఉంది. చైనా 155.89Mbps ఆవరేజ్ స్పీడ్ తో నాలుగవ స్థానంలో, ఆస్ట్రేలియా 112.68Mbps ఆవరేజ్ స్పీడ్ తో ఐదవ స్థానంలో ఉన్నాయి.
బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ లో భారత్ 65వ స్థానం
గ్లోబల్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ ర్యాంకింగ్‌లో భారత్ 65వ స్థానంలో ఉంది. భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ఆవరేజ్ స్పీడ్ 53.90Mbpsకాగా, ఆవరేజ్ అప్‌లోడ్ స్పీడ్ 50.75Mbps.భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ నవంబర్‌లో 52.02Mbpsఅని, అప్‌లోడ్ స్పీడ్ 48.57Mbpsఅని వెల్లడించింది.
బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ విషయంలో థాయ్‌లాండ్ ముందు నిలిచింది. 2020 డిసెంబర్‌లో థాయ్‌లాండ్‌లో బ్రాడ్‌బ్యాండ్ ఆవరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ 308.35Mbps, అదే నవంబర్‌లో 260.86Mbpsగా ఉంది. 245.31Mbpsవేగంతో సింగపూర్ రెండవ స్థానంలో ఉంది. ఈసారి హాంకాంగ్ 226.80Mbps ఆవరేజ్ వేగంతో రెండవ నుండి మూడవ స్థానానికి పడిపోయింది.