హాకీ వరల్డ్ కప్ 2023: 48 ఏళ్లుగా టైటిల్ గెలవని టీమిండియా... ఆతిథ్య జట్టుపై భారీ అంచనాలు...
హాకీ... భారత జాతీయ క్రీడగా జనాల్లోకి వెళ్లిన క్రీడ. ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు స్వర్ణ యుగం సాగినన్ని రోజులు, ఈ ఆటకు ఇక్కడ విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే విశ్వక్రీడల్లో భారత హాకీ జట్టు ప్రభావం తగ్గడం, క్రికెట్‌కి క్రేజ్ విపరీతంగా పెరగడంతో హాకీకి ఆదరణ కరువైంది. సుదీర్ఘ విరామం తర్వాత టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత పురుషల జట్టు కాంస్య పతకం సాధించింది...
భారత మహిళా జట్టు తృటిలో పతకాన్ని చేజార్చుకున్నా, అద్భుతమైన పోరాటాన్ని చూపించింది. ఈ విజయాలు హాకీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువస్తాయని భావిస్తున్నారు అభిమానులు. హాకీని ఎంతగానో ప్రోత్సహిస్తూ వస్తున్న ఒడిస్సాలో హాకీ వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి...
భువనేశ్వర్‌లోనే కలింగా స్టేడియంలో, రూకేలాలోని బిర్సా ముందా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో జనవరి 13 నుంచి 29 వరకూ హాకీ వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగనుంది. 1971లో ప్రారంభమైన హాకీ వరల్డ్ కప్‌కి ఇది 15వ ఎడిషన్..
2023 హాకీ వరల్డ్ కప్‌లో 16 దేశాలు పాల్గొంటున్నాయి. పూల్ ఏలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్, సౌతాఫ్రికా ఉండగా పూల్ బీలో బెల్జియం, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ ఉన్నాయి. పూల్ సీలో నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేషియా, చిలీ ఉండగా పూల్ డీలో ఇండియా, ఇంగ్లాండ్, స్పెయిన్, వేల్స్ ఉన్నాయి. భారత జట్టు తన తొలి మ్యాచ్‌ని జనవరి 13న సాయంత్రం 7 గంటలకు స్పెయిన్‌తో ఆడనుంది..
జనవరి 15న ఇంగ్లాండ్‌తో రెండో మ్యాచ్ ఆడే భారత హాకీ జట్టు, జనవరి 19న వేల్స్‌తో మూడో మ్యాచ్ ఆడుతుంది. అత్యధిక పాయింట్ల సాధించిన మొదటి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధిస్తాయి.
1971 నుంచి పురుషల హాకీ వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న భారత జట్టు, 1975లో టైటిల్ సాధించింది. తొలి సీజన్‌లో మూడో స్థానంలో నిలిచిన భారత హాకీ జట్టు, 1973 ఎడిషన్‌లో రెండో స్థానంలో నిలిచింది. 1975లో హాకీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టాప్ 4లోకి కూడా ఎంట్రీ ఇవ్వలేకపోయింది భారత జట్టు...
మరోవైపు 1971లో టైటిల్ గెలిచిన పాకిస్తాన్ హాకీ టీమ్, 1978, 1982, 1994 ఎడిషన్లలోనూ విజేతగా నిలిచింది. క్రికెట్‌లో అంతో కొంతో ఆధిపత్యం చూపిస్తున్న భారత జట్టు, హాకీలో పొరుగుదేశంపై ఆధిపత్యం చూపించాలంటే అది స్వదేశంలో జరిగే 2023 హాకీ వరల్డ్ కప్‌తోనే మొదలవ్వాలి...