లేదు లేదంటూనే కేసీఆర్ లాక్ డౌన్ ఎందుకు పెట్టారంటే....
మిగిలిన రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడం వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదని, అందుకని తెలంగాణాలో లాక్ డౌన్ విధించబోవడంలేదు అని ప్రకటించిన రెండు రోజులకే లాక్ డౌన్ ప్రకటన వచ్చింది. ఉన్నపళంగా ప్రభుత్వం ఎందుకు లాక్ డౌన్ కి పూనుకుందనే విషయం ఇప్పుడు అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న.
తెలంగాణలో అనూహ్యంగా కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్ విధించింది. రెండు రోజుల క్రితం వరకు తెలంగాణలో లాక్ డౌన్ అవసరం లేదు అని అని ప్రకటించిన సర్కార్ మొన్న రాత్రి నుండే తెలంగాణలో లాక్ డౌన్ గురించిన హింట్స్ ని ఇవ్వసాగింది. నిన్న మధ్యాహ్నం కేబినెట్ భేటీలో దీనిపై చర్చిస్తారని స్వయంగా సీఎంఓ ట్వీట్ చేయడంతో అంతా తెలంగాణలో ఇక లాక్ డౌన్ పక్కా అని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టుగానే నేటి నుండి లాక్ డౌన్ ని విధించింది సర్కార్.
దేశం మొత్తంలో చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినప్పటికీ... తెలంగాణలో మాత్రం మొన్నటివరకు లాక్ డౌన్ ఊసే లేదు. హైకోర్టు అక్షింతలు వేయడంతో నైట్ కర్ఫ్యూ ని కొన్ని రోజులకింద ప్రభుత్వం విధించిన విషయం విదితమే. మిగిలిన రాష్ట్రాల్లో కేసులు అమాంతం పెరిగిపోవడంతో లాక్ డౌన్ ని విధించారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో కేసులు 5వేల లోపుకు చేరుకున్నాయి. అంతేకాకుండా మిగిలిన రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడం వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదని, అందుకని తెలంగాణాలో లాక్ డౌన్ విధించబోవడంలేదు అని ప్రకటించిన రెండు రోజులకే లాక్ డౌన్ ప్రకటన వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఉన్నపళంగా ప్రభుత్వం ఎందుకు లాక్ డౌన్ కి పూనుకుందనే విషయం ఇప్పుడు అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న.
మనకు ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం మొదటగా ఫోకస్ చేయాల్సింది తెలంగాణలోని కేసుల సంఖ్య గురించి. తెలంగాణాలో కేసుల సంఖ్య 5000 లోపే గత కొన్ని రోజులుగా నమోదవుతున్నాయి. నిన్నటి బులెటిన్ ప్రకారం చూసుకుంటే ఏ జిల్లాలోనూ 350 కి మించిన కేసులు నమోదవ లేదు. 350 కేసుల లోపు ఒక జిల్లాలో నమోదవుతున్నాయంటే ఆ జిల్లాలో కరోనా ఒకింత వ్యాప్తి ఉందని అనుకోవచ్చు, అదే 100 కేసులు కూడా దాటని చోట కరోనా అదుపులో ఉన్నట్టే (దేశంలో విలయతాండవం చేస్తున్న వేళ ఇన్ని తక్కువ కేసులు ఒక జిల్లాలో నమోదవడంతో పోల్చి చూసినప్పుడు పూర్తి అదుపులో పరిస్థితి ఉన్నట్టు)
మరి నిజంగానే తెలంగాణలో ఇన్ని తక్కువ కేసులు నమోదవుతున్నాయా..? అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణాలో కేసులు తక్కువగానే ఉండొచ్చు. కానీ అనధికారికంగా వ్యాప్తి తీవ్రంగా ఉంది. తెలంగాణాలో టెస్టుల సంఖ్యను గణనీయంగా తగ్గించివేసారు. టెస్టులు తక్కువగా చేస్తున్నప్పుడు కేసులు తక్కువగానే వస్తాయి. మన చుట్టూ ఉన్న మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రాదేశ్, ఛత్తీస్ గఢ్ లలో అధికంగా కేసులు నమోదవుతున్న వేళ... తెలంగాణలో మాత్రమే ఇంత తక్కువ కేసులు నమోదవడం ప్రశ్నలను లేవనెత్తుతుంది.
ప్రముఖ ఎపిడమోలజిస్ట్ గిరిధర్ బాబు తెలంగాణ పరిస్థితి కలవరపెడుతుందని చెప్పుకొచ్చారు. హై కోర్టు కూడా టెస్టుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇక కొన్ని రోజులుగా ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో ఫీవర్ సర్వేని నిర్వహించింది. ఈ సర్వే వివరాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయకున్నప్పటికీ... న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో ఈ సర్వేలో లెక్కలు విస్తుపోయేలా ఉన్నట్టుగా పేర్కొంది.
దాదాపుగా 3.25 లక్షల మంది సాంపిల్స్ ని పరిశీలించగా అందులో దాదాపుగా 1.18 లక్షల మంది జ్వరం, ఇతర కరోనా తాలూకు లక్షణాలతో ఉన్నట్టుగా గుర్తించినట్టు సదరు పత్రిక తన కథనంలో పేర్కొంది. వీరిలో దాదాపుగా 15 నుంచి 20 శాతం మంది కరోనా వైరస్ బారినపడి ఉండొచ్చని వారు పేర్కొన్నారు. సర్వేలో ఈ విధమైన విస్తుపోయే విషయాలు తేలడంతో ప్రభుత్వం ఈ చర్యకు పూనుకున్నట్టుగా అర్థమవుతుంది.
లాక్ డౌన్ కరోనా మహమ్మారికి పరిష్కారం కాదు. లాక్ డౌన్ వల్ల ప్రజల సంచారం తగ్గి కేసులు తక్కువగా నమోదవుతాయి. లాక్ డౌన్ విధించిన రాష్ట్రాల్లో మనం ఈ పరిస్థితిని గమనిస్తున్నాం. దీనివల్ల తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఒకింత ఊపిరి పీల్చుకునే సమయం దొరుకుతుంది. ఇప్పటికైనా సర్కార్ టెస్టింగ్ సంఖ్యను పెంచి వీలయినంతమంది వైరస్ సోకిన వారిని గుర్తించి ఐసొలేట్ చేస్తే మరింత త్వరగా మనం ఈ సెకండ్ వేవ్ నుండి బయటపడే ఆస్కారం ఉంటుంది.