Farmers Protest: మళ్లీ రైతులు ఎందుకు ధర్నాకు దిగారు? వారి డిమాండ్లు ఏమిటీ?
దేశ రాజధానిలో అన్నదాతలు మరోమారు ఆందోళనకు కదం తొక్కారు. ఈ పోరుబాట దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. ఈ రైతుల డిమాండ్లపై కొంత అస్పష్టత ఉన్నది. వారి డిమాండ్లను తెలుసుకుందాం.
Farmers Protest
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి రైతులు మరోసారి ధర్నాకు బయల్దేరారు. కేంద్రమంత్రితో సోమవారం చర్చలు విఫలం కావడంతో వారు బలవంతంగానైనా దేశ రాజధాని వైపు వడిగా ప్రయాణం సాగిస్తున్నారు. ఢిల్లీ చలో అంటూ నినదిస్తూ ముందుకు సాగుతున్నారు. రైతుల ఆందోళన 2.0కు శ్రీకారం చుడుతున్నారు. కొందరైతే ఏకంగా ఆరేళ్ల గాసం కూడా వెంట పట్టుకువచ్చుకుంటున్నారు. సుదీర్ఘ పోరాటానికి సిద్ధమయ్యే వారు ఉద్యమ బాట పట్టారు.
Farmers Protest
గతంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో వారు కొన్ని నెలలపాటు దేశ రాజధాని సరిహద్దుల్లో రోడ్డుపైనే ఆందోళనలు చేపట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాటిని వెనక్కి తీసుకుంటామని ప్రకటించి ఆ తర్వాత పార్లమెంటులో ఉపసంహరించారు. అప్పుడు కొన్ని రైతు సంఘాలు ఒక కూటమిగా ఏర్పడి సంయుక్త కిసాన్ మోర్చా పేరు కింద ఆందోళనలు చేపట్టారు.
Farmers Protest
ఇప్పుడు మరోమారు పోరు బాట అందుకున్నారు. అయితే.. రైతు సంఘాల రూపంలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు సంయుక్త కిసాన్ మోర్చా(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చాలు ఈ సారి రైతు ఆందోళనకు నాయకత్వాన్ని అందిస్తున్నాయి. అందులోనూ ఎస్‌కేఎం నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్, కేఎంఎం జనరల్ సెక్రెటరీలు సర్వాన్ సింగ్ పంధేర్ ముందుండి రైతులను నడిపిస్తున్నారు.
Farmers Protest
వారి డిమాండ్లు ఇవీ:
- కనీస మద్దతు ధరకు న్యాయబద్ధమైన హామీ: 2005లో ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా పంటకు కనీస మద్దతు ధరపై చట్టాన్ని తేవాలి
- రుణ మాఫీ: దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాఫీ చేయాలి
- పోలీసు కేసుల ఉపసంహరణ: 2020- 21 కాలంలో రైతులు మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నప్పుడు రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలి.
Farmers Protest
- లఖింపూర్ ఖేరి బాధితులకు న్యాయం: యూపీలోని లఖింపూర్ ఖేరిలో 2021 అక్టోబర్ 3న రైతులపై నుంచి కారు ఎక్కించిన ఘటనలో నలుగురు అన్నదాతలు మరణించారు. ఈ కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ప్రధాన నిందితుడిగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిశ్ మిశ్రా ఉన్నాడు.
- పింఛన్, రైతుల స్మారకం: ప్రతి రైతుకు నెలకు రూ. 10 వేల పింఛన్ ఇవ్వాలి. అలాగే.. 2020-21 రైతు ఆందోళనలో మరణించిన రైతుల స్మారకం నిర్మించడానికి ఢిల్లీలో స్థలం కేటాయించాలి.