Spark Life Movie: విక్రాంత్ ‘స్పార్క్ లైఫ్’ మూవీ రివ్యూ..!
విక్రాంత్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’ (Spark Life). విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ సినిమా ఎలా ఉందనే విషయాన్ని రివ్యూలో తెలుసుకుందాం.
కొత్త హీరో విక్రాంత్ రెడ్డి (Vikranth Reddy) ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’ (Spark Life). మెహర్రీన్ పిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లీలా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక చాలా రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్నాయి. ఎట్టకేళలకు సినిమా ఈరోజు (నవంబర్ 17)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోనల్ మెటీరియల్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉంది? కథేంటీ? బెస్ట్ అనిపించే అంశాలేంటీ? అనేది రివ్యూలో చూద్దాం.
కథ :
నగరంలో జై(విక్రాంత్) మెడికోగా వర్క్ చేస్తుంటాడు. ఈ సందర్భంగా కొందరు అమ్మాయిలను వృత్తిరీత్యా ఫాలో అవుతుంటాడు. ఈ క్రమంలో అతను ఫాలో చేసిన కొందరు అమ్మాయిలు ఉన్నట్టుండి సైకోగా బిహేవ్ చేస్తుంటారు. ఆవెంటనే చనిపోతారు. ఇదంతా పరిశీలించిన పోలీసులు అమ్మాయిలను ఫాలో అవుతున్న కారణంగా జైని అరెస్ట్ చేస్తారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని గర్ల్ ఫ్రెండ్ రుక్సర్ థిల్లాన్ కూడా చనిపోతుంది. అప్పటికే జైతో పరిచయం ఉన్న మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) ప్రాణాలకు ప్రమాదాం ఏర్పడుతుంది. దాంతో అతని దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. జై,, ఆర్య అనే మరో వ్యక్తిగానూ కనిపిస్తాడు. అసలు ఇంతకీ అతను రెండుపేర్లు ఎందుకు పెట్టుకున్నాడు? అమ్మాయిలు సైకోలా ప్రవర్తించడానికి రీజన్ ఏంటీ? రుక్సన్ మరణానికి కారణం ఎవరు? మెహ్రీన్ బతికి ఉందా చనిపోయిందా? పోలీసులు ఏం నిర్ధారించారు. నిందితుడు ఎవరు? అనేది మిగితా సినిమా.
విశ్లేషణ :
యాక్షన్ థ్రిల్లర్లకు ఎంతటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. అలాంటి జోనర్లలోని సినిమాలు చూసేందుకు సెపరేట్ ఆడియెన్స్ ఉండటం విశేషం. అయితే ఈ సినిమా చూసినప్పుడు అసలు ఏ జోనర్ కిందికి వస్తుందో అర్థం కావడానికి సమయం పడుతుంది. యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో పాటు రొమాన్స్ టచ్ తో మిళితమై ఉంటుందనే లోపే.. కాస్తా కామెడీనీ కూడా పండించారు. ఇదిలా ఉంటే.. అమెరికాలోనే కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న కథను కొత్తగా, సరికొత్త పాయింట్ తో ప్రజెంట్ చేశారు. వైజాగ్, హైదరాబాద్, ఢిల్లీ, కొన్ని ట్రైబల్ ఏరియాల్లోనూ కథ సాగుతుంది.
మొదటి భాగమంతా చాలా కన్ఫ్యూషన్ గానే ఉంటుంది. మొదట చెప్పినట్టుగా ఏ జోనర్ లో చెబుతున్నారనేదానికి కాస్తా సమయం తీసుకున్నారు. ఇక చిత్రంలోని ట్విస్ట్ లు అర్థం కాకపోయినా కథకు అవసరమనే ఉంటాయి. ప్రథమార్థం హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు, పలు హత్యలను చూపించారు. ఇదంతా ఇంట్రడక్షన్ లో లాగనే అనిపిస్తుంది. సెకండాఫ్ లో మాత్రం అసలు కథను దాచి ఉంచారనేది తెలుస్తుంది. ఎందుకంటే దర్శకుడు చెప్పిన కొత్త పాయింట్ ఇక్కడే చూపించారు. ఆర్మీ డాక్టర్ చేసే ప్రయోగాల వల్లే అందరూ చనిపోతున్నారని తెలిపారు. టెర్రరిస్ట్ లను మన కంట్రోల్ కు తీసుకునేందుకు మెదడుపై కొన్ని ప్రయోగాలను చేస్తుంటారు. ప్రయోగాలను చక్కగా చూపించారు. మొదటి భాగం కంటే.. ద్వితీయార్థంలోనే అసలు సినిమా నడుస్తుంది. కథ పెద్దనే ఫీలింగ్ అనిపిస్తుంది. కొన్ని లాజిక్ లు లేని సీన్లు సినిమా అంతటా కనిపిస్తుంటాయి. మొత్తానికి సినిమాలోని కొత్త పాయింట్ గుర్తుండేలా చేశారు.
నటీనటులు, టెక్నీషియన్లు :
విక్రాంత్ నటన కథకు ప్రధానం కావడంతో ఇంకా బాగా పెర్ఫామ్ చేయాల్సింది. ముఖ్యంగా ‘జై’ పాత్రలో అదరగొట్టారు. హీరోయిన్లు మెహ్రీన్ పిర్జాదా మరియు రుక్సర్ థిల్లాన్ బాగానే అలరించారు. థ్రిల్లర్ అంశాలను ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా పెర్ఫామ్ చేశారు. కొన్ని చోట్ల కాస్తా ఇబ్బందిగానే మారింది. ఇక కథ, స్క్రీన్ ప్లే చాలా కొత్త అనిపిస్తుంది. విక్రాంత్ తన దర్శక ప్రతిభనూ చూపించే ప్రయత్నం చేశారు. కానీ కాస్టింగ్ విషయంలో ఇంకాస్తా ముందడు వేస్తే సినిమా స్థాయి పెరిగేది. కొత్త అంశాలను చెప్పినప్పటికీ ఎఫెక్టివ్ గా చెప్పడంలో విఫలమయ్యారు. చిత్రానికి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదనిపించింది.