`ఉరుకు పటేలా` మూవీ రివ్యూ, రేటింగ్
తేజస్ కంచర్ల, ఖుష్బూ చౌదరీ జంటగా నటించిన `ఉరుకుపటేలా` చిత్రం నేడు విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కుర్ర హీరో తేజస్ కంచర్ల హీరోగా నిలబడేందుకు చాలా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఆయన `కేటుగాడు`, `హుషారు`, `ఆర్‌డీఎక్స్ లవ్` చిత్రాలతో ఆకట్టుకున్నాడు. `హుషారు` మూవీ మంచి విజయాన్నే సాధించింది. కానీ తేజస్ కంచర్లకి పేరుని తీసుకురాలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ కామెడీ థ్రిల్లర్ బేస్డ్ గా `ఉరుకు పటేలా`(గెట్ ఉరికిఫైడ్) చిత్రంతో వచ్చాడు.
ఇందులో తేజస్‌కి జోడీగా ఖుష్బూ చౌదరీ హీరోయిన్‌గా నటించింది. దీనికి వివేక్ రెడ్డి దర్శకత్వం వహించారు. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ పతాకంపై కంచర్ల బాల భాను నిర్మించారు. హీరో తండ్రినే ఈ సినిమాని నిర్మించడం విశేషం. ఈ చిత్రం వినాయక చవితి పండగని పురస్కరించుకుని శనివారం(సెప్టెంబర్ 7న) విడుదలైంది. మరి సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అసలు ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
పటేలా (తేజస్ కంచర్ల) ఊరి సర్పంచ్(గోపరాజు రమణ) కొడుకు. చిన్నప్పట్నుంచి ఊర్లో అమ్మాయిల వెంటపడుతుంటాడు. పెళ్లి చేసుకో లైఫ్ ఇస్తా అంటూ అమ్మాయిల వెంటపడుతుంటే వాళ్లు ఛీ కొడుతుంటారు. పెద్దయ్యాక కూడా అదే పరిస్థితి, చివరికి పెళ్లైన వాళ్లని కూడా వదలడు. తాను 7వ తరగతి వరకే చదివినా, తనకు మాత్రం బాగా చదువుకున్న అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటాడు.
ఏజ్ మీద పడుతున్నా పెళ్లి కాకపోవడంతో ఇబ్బంది పడుతుంటాడు. ఊర్లో ఆడపిల్లల పేరెంట్స్ ఈ పటేలాని చూస్తే పక్కనుంచి వెళ్లిపోతుంటారు. ఈ క్రమంలో ఫ్రెండ్ పెళ్లిలో అక్షర(ఖుష్బూ చౌదరీ)ని చూసి పడిపోతాడు. ఆమె డాక్టర్. ఎలాగైనా ఆ అమ్మాయిని పడేయాలని ప్లాన్ చేస్తాడు. ఆ అమ్మాయి కోసం తమ ఊర్లో మెడికల్ క్యాంప్‌ని కూడా పెట్టిస్తాడు.
తాను ప్లాన్ చేసినట్టే ఆ మెడికల్ క్యాంప్ సమయంలోనే ఆమెని పడేస్తాడు పటేలా. తన ప్రేమ విషయాన్ని అక్షరకి చెప్పాలనుకునే సమయంలోనే యాక్సిడెంట్ అవుతుంది. పటేలా ఒక కాలు పనిచేయదని డాక్టర్ చెబుతారు. ఇంట్లోనే అక్షర ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తుంది. దీంతో కొంత క్యూర్ అవుతుంది. ఈ క్రమంలోనే తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతుంది అక్షర. ప్రారంభంలో నో చెప్పినా, ఆ తర్వాత ఆమెకి నచ్చడంతో ఓకే చెబుతారు. సంబంధం కూడా మాట్లాడుకుంటారు.
ఆ తర్వాత అక్షర బర్త్ డే వస్తుంది. ఆ పుట్టిన రోజున కొత్త ఆసుపత్రి ఓపెనింగ్ అని చెప్పి రాత్రి పార్టీకి ఆహ్వానిస్తారు. దూరంగా ఫారెస్ట్ లో ఆసుపత్రి ఉంటుంది. ఆ ఆసుపత్రిలోకి వెళ్లాక అందులో అక్షర ఫ్యామిలీ చేస్తున్నది చూసి పటేలా షాక్ అవుతాడు. అంతేకాదు పటేలాని చంపేయాలనే ప్లాన్ కూడా వేస్తారు? మరి అంతగా ప్రేమించిన అక్షర పటేలాని ఎందుకు చంపాలనుకుంటుంది. వాళ్లనుంచి పటేలా తప్పించుకున్నాడా? అసలు ఆ ఆసుపత్రిలో ఏం జరిగింది? పటేలాని చంపాలనుకున్నది ఎవరు? దీనికి క్షద్రపూజలకు లింకేంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
`ఉరుకు పటేలా` తెలంగాణ యాసలో వాడే పదం. పరిగెత్తడాన్ని ఉరుకు అంటారు. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లని ఒకప్పుడు పటేలా అని పిలిచేవారు. అది కూడా కామన్ వర్డ్ గానే మారిపోయింది. ఇప్పటికీ గ్రామాలలో ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. నిజానికి ఈ టైటిల్‌కి, కథకి సంబంధం లేదు.
సెకండాఫ్‌లో తనని చంపాలనుకునే వారినుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా దాన్ని ఉరుకు పటేలా వాడినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా ఫన్నీ వేలో సాగే థ్రిల్లర్. ఫస్టాఫ్ అంతా ఒకలా, సెకండాఫ్ అంతా మరోలా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తోనే కంప్లీట్ గా సినిమా మారిపోతుంది. కొత్త కథని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఇక ఫస్టాఫ్‌లో విలేజ్ లో పటేలా అమ్మాయిల వెంటపడేది చూపించారు. తనని పెళ్లి చేసుకో లైఫ్ ఇస్తా అంటూ కనిపించిన ప్రతి అమ్మాయిని అడుగుతుంటాడు. అమ్మాయికి పెళ్లైందా? ప్రెగ్నెంటా? అనేది కూడా చూడడు. తన ఏజ్‌కి సరిపడిన అమ్మాయి అయితే చాలు పటేలా రెచ్చిపోతుంటాడు. ఇలా చాలా మంది అమ్మాయిలు రిజెక్ట్ చేస్తుంటారు.
అయినా పెద్దగా పట్టించుకోకుండా తన పని కానిస్తుంటాడు పటేలా. ఈ క్రమంలో చోటు చేసుకునే ఫన్ నవ్వులు పూయించేలా డిజైన్ చేశారు దర్శకుడు. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, పెళ్లి కాకపోవడంతో పటేలా పడే బాధలను ఫన్నీవేలో చూపించాడు. దీనికితోడు తండ్రి సర్పంచ్‌తో పటేలా సన్నివేశాలు కూడా కాస్త ఫన్నీగా, ఇంకాస్త ఎమోషనల్‌గా చూపించాడు. తాగుడూ ఎంజాయ్ చేయుడు అనేలా ఫస్టాఫ్ సాగుతుంది.
అక్షర అనే అమ్మాయి నచ్చడంతో ఆమెని పడేసేందుకు పటేలా చేసే ప్రయత్నాలు కూడా కాస్త ఫన్నీగానే ఉంటాయి. కానీ ఆ అమ్మాయి అంత ఈజీగా లవ్‌లో పడటమే సినిమాటిక్‌గా ఉంది. అందులో ఏమాత్రం ఫీల్ లేదు. డ్రామా లేదు. అంతేకాదు ఆయా సన్నివేశాలన్నీ రొటీన్ గానే సాగుతాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఊహించేలా ఉంటాయి.
ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో ఇలాంటి కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ విషయంలో ఏమాత్రం కొత్తదనం లేదు. కానీ డబుల్ మీనింగ్ డైలాగులు యూత్‌కి కనెక్ట్ అవుతాయి. అదే సమయంలో మరీ వల్గర్‌గానూ అనిపిస్తాయి. అవి శృతి మించేలా ఉన్నాయి. సెకండాఫ్‌లో సినిమా థ్రిల్లర్ వైపు వెళ్తుంది. లవర్ బర్త్ డే కోసం ఆసుపత్రికి వెళితే అక్కడ పటేలాని చంపాలనుకోవడం, వాళ్ల నుంచి తప్పించుకునేందుకు తను పడే స్ట్రగుల్స్, టెన్షన్, ఆందోళన ని సైతం ఉత్కంఠంగా నడిపించాడు.
అందులోనూ భయంతో పుట్టే ఫన్నీని జనరేట్ చేయించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. అక్కడక్కడ ఆ ఫన్ బాగానే వర్కౌట్ అయ్యింది. థ్రిల్లర్ ఎలిమెంట్లు కూడా బాగానే ఉన్నాయి. కానీ మెజారిటీ సన్నివేశాలు తేలిపోయాయి. రొటీన్ ఫీలింగ్‌ని తెప్పించాయి. ఏమాత్రం థ్రిల్లింగ్‌గా అనిపించలేదు.
తెరపై హీరో పడే టెన్షన్, భయం ఆడియెన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు. అదే ఇందులో పెద్ద మైనస్. ఎమోషనల్‌గా ఆయా సీన్లని కనెక్ట్ చేయాల్సింది. లేదంటే అసలు కథని బలంగా, కొత్తగా చెప్పాల్సింది. చివరకు క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ముగించారు. ఏదో అనుకుంటే ఇంకేదో చేశారనేలా ముగింపు ఉంది. ఇది కొంత అసంతృప్తికి గురి చేస్తుంది.
సెకండాఫ్‌పై దర్శకుడు బాగా వర్క్ చేసి ఉంటే, కొత్తగా రాసుకుని ఉంటే సినిమా బాగుండేది. దీంతో ఇప్పుడు పాతచిత్తకాయ పచ్చడిలా మారిపోయింది. ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల జోరు నడుస్తుంది. యాక్షన్ మూవీస్ వర్కౌట్ అవుతున్నాయి. ఎన్నో థ్రిల్లర్ మూవీస్ వచ్చి, అంతో ఇంతో వర్కౌట్ అవుతున్నాయి. ఇలా కొత్త కథలను ఆడియెన్స్ కోరుకుంటున్న ఈ టైమ్‌లో అరిగిపోయిన ఫార్ములాతో ఈ సినిమాని చేయడం ఆశ్చర్యకరం.
నటీనటులుః
తేజస్ కంచర్ల నటుడిగా తన బెస్ట్ ఇచ్చాడు. అంతేకాదు చాలా మెచ్యూరిటీతో నటించాడు. పాత్రలో జీవించాడు. అతని యాక్టింగ్ సినిమాకి సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. అదరగొట్టాడనే చెప్పాలి. పటేలా అనే యాటిట్యూడ్ ఉన్న కుర్రాడిలా, డేరింగ్ కుర్రాడిలా, అదే సమయంలో తనని చంపేసేందుకు వస్తుంటే భయపడుతూ, టెన్షన్ పడుతూ కనిపించిన తీరు బాగుంది. నటుడిగా మంచి మార్కులే పడతాయి.
ఇక హీరోయిన్ ఖుష్బూ చౌదరీ సైతం బాగా చేసింది. లవర్‌గా పాజిటివ్ పాత్రలో, సెకండాఫ్‌లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్ షేడ్స్ చూపించి ఆకట్టుకుంది. సర్పంచ్‌గా, పటేలా తండ్రి పాత్రలో గోపరాజు రమణ మరోసారి మెప్పించాడు. నవ్వించాడు. డాక్టర్‌గా సుదర్శన్ కామెడీ నవ్విస్తుంది. చమ్మక్ చంద్ర సైతం తనదైన కామెడీతో నవ్వులు పూయించారు. డాక్టర్‌గా లావణ్య ఫర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రలు సైతం ఫర్వాలేదనిపించారు.
టెక్నీషియన్లుః
సినిమాకి పెద్ద అసెట్ ఏదైనా ఉందంటే అది మ్యూజిక్. ప్రవీణ్ లక్కరాజు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు బాగున్నాయి. ఊపు తెచ్చేలా ఉన్నాయి. చిన్న సినిమా అనే ఫీలింగ్ లేకుండా మాస్ పాటలు ఇవ్వడం విశేషం. అంతేకాదు బీజీఎం కూడా అదిరిపోయింది. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది.
దర్శకుడు వివేక్ రెడ్డి టేకింగ్ బాగుంది. సినిమాని డీల్ చేసిన విధానం బాగుంది. కానీ ఓల్డ్ స్టోరీని ఎంపిక చేసుకున్నాడు. ఫన్ జనరేట్ చేసే క్రమంలో ట్రెండీగా వెళ్లాడు. కానీ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు శృతి మించిన ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో సెకండాఫ్ విషయంలో కొత్తగా ట్రై చేయాల్సింది. రెండో భాగాన్ని డీల్ చేసే దాన్ని బట్టే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇందులో అదే మిస్ అయ్యింది.
ఫైనల్‌గాః రొటీన్ కామెడీ థ్రిల్లర్. పటేల్ ఉరకలేకపోయాడు.
రేటింగ్‌ః 2