Return of the Dragon: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' (2025) మూవీ రివ్యూ
'Return of the Dragon' మూవీ రివ్యూ: ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? కథ, విశ్లేషణ, మరియు నటీనటుల గురించి తెలుసుకోండి.

Pradeep Ranganathan film Return of the Dragon (2025) review in telugu
Return of the Dragon: 'లవ్ టుడే' తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి హిట్ అయ్యింది. ఆ సినిమా దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథన్ ఇక్కడ కూడా తనకంటూ కొంత మార్కెట్ క్రియేట్ చేయగలిగాడు.
దాంతో అతను హీరోగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' తెలుగు వెర్షన్ కూడా మంచి క్రేజ్ తోనే రిలీజైంది. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. మరి ఈ సినిమా 'లవ్ టుడే' స్దాయిలో తెలుగులో వర్కవుట్ అవుతుందా, అసలు కథేంటి, ఇందులో దర్శకుడు చూపించాలనుకున్న కొత్త పాయింట్ ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
pradeep ranganathan Next Movie Dragon
స్టోరీ లైన్
డ్రాగన్ అని రాఘవన్(ప్రదీప్ రంగనాధన్) కి ఇంకో పేరు. అతను ఇంటర్మీడియట్లో 96%తో పాస్ అయినా తను ఇష్టపడ్డ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే నో చెప్తుంది. ఆమె చెప్పిన కారణం.. తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని. దీంతో బాడ్ బాయ్ గా అవ్వాలని బీటెక్ లో కావాలని 48 సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతాడు. దాంతో పూర్తి ఖాలీగా ఉంటాడు. కాలేజీలో అతన్ని ఇష్టపడ్డ కీర్తి (అనుపమ పరమేశ్వరన్) నీలాంటి ఉద్యోగం, సద్యోగం లేనివాడితో నాకేంటని బ్రేకప్ చెప్తుంది.
దాంతో ఎలాగైనా జాబ్ కొట్టాలని ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి సాఫ్ట్ వేర్ జాబ్ తెచ్చుకుంటాడు. ఆ తర్వాత లైఫ్ లో సెటిల్ అవ్వటం మొదలెట్టి కారు, ఇల్లు వంటివి కొనటం మొదలెడతాడు. ఈ క్రమంలో అతనికి ఓ పెద్ద సంభందం వస్తుంది. పల్లవి (కాయాదు)తో పెళ్ళి సెట్ అవుతుంది. మరో ఆరు నెలలలో పెళ్లి, అమెరికా వెళ్లి సెటిల్ అయ్యిపోవాలి అనుకుంటున్న టైమ్ లో లో రాఘవన్ కాలేజ్ ప్రిన్సిపాల్ (మిస్కిన్) రూపంలో ట్విస్ట్ పడుతుంది. ఆయనకు ఫేక్ సర్టిఫికేట్స్ తో ఉద్యోగం చేస్తున్న కి డ్రాగన్ విషయం తెలుస్తుంది.
దాంతో డ్రాగన్ ఫేక్ సర్టిఫికేట్ గురించి అతని పనిచేస్తున్న కంపెనీలో, కాబోయే మామగారి ఇంట్లో చెప్పేస్తానంటాడు. రాఘవన్ కాళ్లా వేళ్లా పడితే , అలా చెప్పకుండా ఉండాలంటే ఓ కండీషన్ పెడతాడు. అది మూడు నెలలు కాలేజీలో అన్నీ క్లాసులకు అటెండ్ అయ్యి పరీక్షలు రాసి 48 సప్లమెంటరీలు రాసి పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు ప్రిన్సిపాల్. దాంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ కాలేజీకి వెళ్ళటం మొదలెడతాడు రాఘవన్, అప్పుడు ఏమైంది?మళ్లీ కీర్తి అతని జీవితంలోకి వచ్చిందా? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ
ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే' సినిమాలో హైలెట్ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరి ఫోన్ మరొకరు 'ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం' అనే పాయింట్. సెల్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపించారు. అయితే ఈ సారి కొంచెం భిన్నంగా ప్రయత్నించాడు. అలాగే తనను నమ్ముకుని వచ్చే యూత్ ని మిస్ కాకూడదని బలంగా నమ్ముకుని అదే విధంగా కథ,కథనం నడిపించాడు. ఓ రకంగా కథలో తన టార్గెట్ ఆడియన్స్ స్దానం కలిపించాడు. కొన్ని సార్లు ఉపేంద్ర ప్రారంభ రోజుల నాటి సినిమాలు గుర్తుకు తెస్తాయి.
అలాగే ఈ సినిమాలో సీన్స్ ఇంతకు ముందు చూసినట్లు అనిపిస్తాయేమో కానీ స్టోరీ లైన్ మాత్రం కొత్తదే. ఫేక్ చేసి జీవితంలో ఎదిగి, అతి తప్పని అర్దం చేసుకుని,వాటిని సరిదిద్దుకునే ప్రాసెస్ లో వచ్చే కష్టాలు ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. ఇప్పటి సొసైటి ఫేక్ విలువలకు ఇస్తున్న విలవను, నిజాయితీకి ఇవ్వటం లేదని చెప్తాడు. ఫస్టాఫ్ లో కథలో మలుపులు ఉన్నా హీరో పాత్ర కాంప్లిక్ట్స్ లో పడదు. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి ఊహించని ఓ కాంప్లిక్ట్స్ తో కథలోకు ముందుకు వెళ్తాడు. దాంతో ఫస్టాఫ్ సోసోగా అనిపించినా,సెకండాఫ్ ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ సినిమాకి నిండుతనం తెచ్చింది.
Pradeep Ranganathan
టెక్నికల్ గా
ఓ మై కడవులే డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు ఈ సినిమాని మెసేజ్ కలగలిపిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మలచాలనుకున్నారు. అయితే కాస్త మెసేజ్ ఎక్కువైన ఫీలింగ్ వచ్చింది. ఫస్టాఫ్ ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. ఇంటర్వెల్ దాకా ఏమీ జరిగినట్లు అనిపించలేదు. అలాగే ఇలాంటి యూత్ ఫుల్ సినిమాలకు అవసరమైన పాటలు లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం లియోన్ జేమ్స్ బాగా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ ప్రతీ సీన్ ని కలర్ ఫుల్ గా పర్పస్ ఫుల్ గా కనిపించటంలో సక్సెస్ అయ్యింది. ఎడిటింగ్ ..కొంత లాగిన ఫీలింగ్ ఫస్టాఫ్ లో వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఖర్చు పెట్టారు.
నటీనటుల్లో..
ప్రదీప్ రంగనాథన్ ఫెరఫెక్ట్ గా తన పాత్రకు సూటయ్యాడు. చాలా ఎనర్జీతో చేసాడు. అలాగే అనుపమ సినిమాకు నిండుతనం తెచ్చింది. ఖయాదు లోహార్, మిష్కిన్, కేఎస్ రవికుమార్, గౌతమ్ మీనన్, నెపోలియన్ వంటి సీనియర్స్ తమ పాత్రలకు న్యాయం చేసుకుంటూ వెళ్లిపోయారు.
ప్లస్ లు
కొత్త స్టోరీ లైన్, యూత్ ని టార్గెట్ చేసిన సీన్స్
ప్రదీప్ రంగనాథన్
డైలాగులు
మైనస్ లు
ఇంతకు ముందు చూసినట్లు అనిపించే కాలేజీ సీన్స్
సాగినట్లున్న ఫస్టాఫ్
లెంగ్త్ ఎక్కువ అనే ఫీల్ రావటం
తెలుగు డబ్బింగ్
Director Pradeep Ranganathan
ఫైనల్ థాట్
ఫస్టాఫ్ డ్రా...గ్ ఆన్, సెకండాఫ్ రియల్ డ్రాగన్. మరీ 'లవ్ టుడే' స్దాయిలో ఈ సినిమా ఎంగేజ్ చేయదు కానీ కాలక్షేపానికి లోటు లేదు. ఓ లుక్కేయచ్చు
----సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2. 75