#Waltairveerayya:చిరు, రవితేజల ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ
వింటేజ్ చిరంజీవిని,ముఖ్యంగా ఆయన చేసే ఫన్ ని... మన ముందు ప్రత్యక్ష్యం చేయాలనే దర్శకుడు తాపత్రయం మనకు అడుగడుగునా కనపడుతుంది. అయితే కొన్ని చోట్ల అది మరీ శృతి మించి కొంత చీప్ ఫన్ కి దారి తీసింది.
Waltair veerayya movie review
చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాపై బాగా నమ్మకాలు పెట్టుకున్నారని ప్రమోషన్స్ లో ఆయనలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ చెప్తోంది. వింటేజ్ చిరంజీవిని బయిటకు తెచ్చానని దర్శకుడు బాబి పదే పదే చెప్తున్నారు. మరో ప్రక్క థమాకా తో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ఈ సినిమాలో ఉషారుగా కనిపిస్తున్నారు. మాస్ పల్స్ పట్టిన ఇద్దరు హీరోలు తమ ఫైట్స్,డాన్స్ లతో ఎలాగో అలరిస్తారు. అయితే దర్శకుడు వీరిద్దరి ఇమేజ్ ని బాలెన్స్ చేస్తూ కథ చేసారా...ఇప్పటికే హిట్టైన పాటలు తెరపై ఎలాంటి స్పందన వస్తోంది. సంక్రాంతి విన్నర్ గా వీరయ్య నిలుస్తాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథాంశం:
సాల్మన్ సీజర్ (బాబీ సింహా) అనే డ్రగ్ డాన్ ...తనను పట్టుకుని జైల్లో పెట్టిన పోలీస్ లను అందరినీ చంపేసి తప్పించుకుంటాడు. ఆ స్టేషన్ కు హెడ్ గా ఉన్న సీతాపతి(రాజేంద్రప్రసాద్) తన తోటి వాళ్లందరూ చనిపోవటంతో ఆ బాధను తట్టుకోలేక ఆ క్రిమినల్ ని పట్టుకుని శిక్షించాలనుకుంటాడు. అయితే అది తన వల్ల కాదని అందుకు సమర్దుడైన ఓ వ్యక్తి కోసం వెతుకుతూ వాల్తేర్ వీరయ్య దగ్గరకు వచ్చి ఆగుతారు. దాంతో ఆ డ్రగ్ డాన్ పై పగ తీర్చుకోవటం సొంత డబ్బు ఖర్చు పెడటానికి సిద్దపడతాడు. వాల్తేరు వీరయ్య సైతండబ్బు అవసరంలో ఉంటాడు. దాంతో ఆ డీల్ ఒప్పుకుని ఆ డాన్ ని వెతుక్కుంటూ మలేషియా బయిలుదేరతాడు.
అక్కడ ఓ హోటల్ లో దిగి అక్కడ పనిచేసే అదితి(శృతి హాసన్)తో ప్రేమలో పడతాడు. మరో ప్రక్క ఆ డ్రగ్స్ డాన్ ని పట్టుకోవటం కోసం కొన్ని ప్లాన్స్ వేస్తాడు. అయితే ఈ క్రమంలో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు వీరయ్య అక్కడకు వచ్చింది...ఆ డ్రగ్ డాన్ ని కోసం కాదు అని. అతను అన్న మైఖేల్(ప్రకాష్ రాజ్) అని తెలుస్తుంది. ఈలోగా అదితి వీరయ్యకు ఓ షాక్ ఇస్తుంది...అది ఏంటి? ఎక్కడో వాల్తేరులోని జాలరి పేటలో ఉండే వీరయ్యకు మలేషియాలో డ్రగ్స్ బిజినెస్ చేసే మైఖేల్ తో పని ఏంటి..అతన్ని ఎందుకు టార్గెట్ చేసాడు? ఇందులో రవితేజ పాత్ర ఏమిటి? చివరకు వాల్తేరు వీరయ్య అనుకున్నది సాధించాడా...సీతాపతి పగ తీరిందా వంటి విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా కొత్త కథేమీ చెప్పదు. చాలా కాలం క్రితం చిరంజీవి హీరోగా వచ్చిన జై చిరంజీవ ను గుర్తు చేస్తుంది. ఆ సినిమాని ఎంటర్టైన్మెంట్ తో చెప్పారని అర్దమవుతుంది.
గాడి తప్పనంతసేపు కమర్షియల్ కథలు స్టార్స్ కు సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. అందులోనూ ఇలాంటి మాస్ మసాలా సినిమాలు మరీను. అయితే చిరంజీవి వంటి మెగాస్టార్ ఇమేజ్ ని మేనేజ్ చేయటం అంటే మాటలు కాదు. స్క్రిప్టులో ఆ ఇమేజ్ ని ఎలివేట్ చేసే ప్లేస్ లు ఉండేలా రాసుకోవాలి. అలాగని అవే కనపడి మిగతావి మరుగున పడితే కష్టమనిపిస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు మాస్ స్టార్స్ ఉండటం డైరక్టర్ కు పెద్ద ఛాలెంజ్. ఇద్దరికి ప్రాధాన్యత కనపడాలి. ఫ్యాన్స్ నొచ్చుకోకూడదు. అదే అభిమానులు మెచ్చుకునేలా ఎవరి ఎలివేషన్స్ వారికి ఇచ్చేలా కథనాన్ని రాసుకోవాలి. దర్శకుడు,రచయిత అయిన బాబి చాలా వరకూ ఆ విషయంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు. తెరపై అతని కష్టం కనపడుతుంది. కానీ మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మధ్య స్ట్రాంగ్ గా కాంప్లిక్ట్స్ సీన్స్ పెట్టుకోలేదు.
వింటేజ్ చిరుని తీసుకొచ్చి ఫన్ చేసి, పెద్ద ఫైట్ తో ఇంట్రవెల్ బ్లాక్ ని సెట్ చేసే దాకా బాగుంది. సెకండాఫ్ లో రవితేజ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సైతం విక్రమార్కుడు గుర్తు చేసేలా ఇంట్రస్టింగ్ గా నడిపారు. ఆ ఎపిసోడే సెకండాఫ్ మొత్తం ఆక్రమించేసింది. రవితేజ ఎపిసోడ్ పూర్తగానే...క్లైమాక్స్ కు కథ వెళ్లిపోయింది చిరంజీవి పాత్ర విలన్ ని ఎదుర్కొనే ఎపిసోడ్స్ సెకండాఫ్ లో ఉండాల్సింది. దానికి ప్రయారిటీ ఇవ్వలేదు. చిరంజీవి క్యారక్టర్ ఈ క్రమంలో ప్యాసివ్ గా మారిపోతోందని గుర్తించలేదు. దాంతో ఫస్టాఫ్ ఉన్నంత జోరుగా ,ఉషారుగా సెకండాఫ్ కనిపించదు. క్లైమాక్స్ సైతం రొటీన్ గా ముగించేసారు. గ్రాఫ్ పెరుగుతూ పోవాల్సింది..డ్రాప్ అవుతూ వచ్చింది. అన్న,దమ్ముల సెంటిమెంట్ సీన్స్ ఓకే అనిపించాయి. అయితే ఓవరాల్ గా విలన్, హీరో, బ్రదర్ సెంటిమెంట్ , వీరోచిత ఫైట్స్ కలిసి బాగుందనిపిస్తాయి. క్లైమాక్స్ రొటీన్ కాకుండా ఉంటే బాగుండేది. సినిమాలో ఖచ్చితంగా హై మూమెంట్స్ ఉండాల్సిన అవసరం ఉంది.
చిరు ఎలా చేసారంటే...
ఈ సినిమాలో ఆయనే చెప్పుకున్నట్లు వింటేజ్ మెగాస్టార్ చూపెట్టాలని అనుకున్నారు. ఆ విధంగానే కసరత్తు జరిగింది. చిరంజీవి గెటప్, ఎక్సప్రెషన్స్, మెగాస్టార్ ముఠా మేస్త్రి, మరికొన్ని మాస్ డ్యాన్స్‌ల జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది. కలర్ ఫుల్ చొక్కా లుంగీ ధరించి.. మెడలో బంగారం గొలుసులు, చెవి పోగు, చేతికి గడియారం, బ్లాక్ బూట్స్.. ఇలా మాస్ అప్పీరియన్స్ లో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు మెగాస్టార్. ఇక గెటప్ ఇలా ఉంటే చిరంజీవి ఏం రేంజిలో రచ్చ చేస్తారు. అదే చేసారు. తనదైన ఫన్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలుసు. వారిని ఈ సారి రిపీట్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేసారు. పాటల్లో స్టెప్స్ కూడా వయస్సుని లెక్క చేయకుండా ఆ గ్రేస్ కనపర్చారు. ఈ ఏజ్ లో ఇలాంటి ఎనర్జీ అసలు ఊహించం. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్, మ్యానరిజమ్స్ ఇలా అన్ని ఆ పాత్రకు ఫుల్ గా సెట్ అయ్యాయి. బాస్ పార్టీ సాంగ్ లో చిరంజీవి స్టెప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
WaltairVeerayya
జంబలికిడి జారు మిఠాయి..
గత కొద్ది రోజులుగా ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్.. ఇలా ఎక్కడ చూసినా సరే ‘జంపలకడి జారు మిఠాయి’ పాటనే వినిపిస్తోంది. ఈ సినిమాలో ఈ పాటను బాగా వాడారు. మంచు విష్ణు...లేటెస్ట్ ఫిల్మ్ జిన్నా చిత్రంలో “జారు మిఠాయి” పాట ఆ సినిమాకు ఉపయోగపడింది లేదు కానీ...చిరంజీవి నోటితో మాత్రం రెండు,మూడు సార్లు పాడించారు. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనం బాగా ఎంజాయ్ చేసారు.
అలాగే నాకు ఇంట్రెస్ట్ పోయింది అంటూ ప్రస్టేటెడ్ జర్నలిస్ట్ ఫన్ వీడియో చాలా పాపులర్. ఆ డైలాగులును కూడా చిరంజీవి చేత చెప్పించారు.వాటికి జనం బాగానే కనెక్ట్ అయ్యారు. అయితే చిరంజీవి వంటి మెగాస్టార్..అలాంటి స్పూఫ్ కామెడీ చేస్తే నవ్వు వచ్చినా ...ఆయన స్దాయి ఏమిటి..ఈ కామెడీ ఏమిటి అనిపిస్తుంది. ఇలాంటి వాటిల్లో చిరంజీవి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
రవితేజ విషయానికి వస్తే...
ఆయన కాకుండా ఆ క్యారక్టర్ వేరొకరు వేస్తే సినిమా వర్కవుట్ అయ్యేది కాదు. తెలంగాణ యాసతో పోలీసు ఆఫీసర్ గా ఆకట్టుకున్నాడు. చిరు, రవితేజల మధ్య వచ్చే ఎపిసోడ్స్ శృతిహాసన్ కూడా రా ఆఫీసర్ గా తనదైన శైలిలో ఫైట్స్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ మధ్య కెమిస్ట్రీ శృతి మించనివ్వకుండా బాగా వర్కవుట్ చేసారు. ప్రకాష్ రాజ్, బాబీ సింహా, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, ప్రదీప్ రావత్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. ఊర్వశి రౌతేలా డాన్స్ బాగుంది.
టెక్నికల్ గా ..
ఓ అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో మనకు ప్రత్యేకంగా కనపడే అంశం. తమ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించారు. అయితే అయితే తమ హీరోని మరింత గొప్పగా చూడాలనుకుని బాబి అనుకుంటే బాగుండేది. అయితే మెగాస్టార్ చిరంజీవిలోని కామిక్ యాంగిల్ మరోసారి ఎక్సప్లోర్ చేసే ప్రయత్నం మాత్రంం మెచ్చుకోదగ్గది. సంగీత దర్శకుడుగా దేవిశ్రీప్రసాద్ ఈ సారి ఫెయిల్ కాలేదు. కాకపోతే చివర్లో వచ్చే సెంటిమెంట్ సాంగ్ మాత్రం ఇబ్బంది పెట్టింది. బాస్ పార్టీ, పూనకాల లోడింగ్, శ్రీదేవి, అందం ఎక్కువ వంటి పాటలు కు విజిల్స్ పడ్డాయి. ఇక ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ రూపొందించిన హార్బర్ సెట్ సూపర్బ్. రామ్ లక్ష్మణ్ ఫైట్స్...ఇంట్రవెల్ బ్లాక్ ఆకట్టుకున్నాయి. డైలాగ్స్ చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. నవీన్, రవిశంకర్ ప్రెస్టేజ్ గా తీసుకుని బాగా ఖర్చుపెట్టారని అర్దమవుతుంది. ఎక్కడా లాగ్ లేకుండా బోర్ కొట్టనివ్వకుండా ఎడిట్ చేసి విధానం కూడా ప్లస్ అయ్యింది.
Waltair Veerayya Review
నచ్చినివి?
బాస్ పార్ట్ ,పూనకాలు లోడింగ్ సాంగ్స్
చిరంజీవి వింటేజ్ కామెడీ
బాబి సింహా
నిర్మాణ విలువలు
Waltair Veerayya
నచ్చనవి
పాత కథ
చిరు స్దాయికి తగిని కొన్ని కామెడీ బిట్స్ ,డైలాగులు
ఎమోషనల్ గా సరిగ్గా సీన్స్ కనెక్ట్ చేయలేకపోయిన స్క్రీన్ ప్లే
క్లైమాక్స్
Waltair Veerayya
ఫైనల్ థాట్:
చిరంజీవి సినిమా అంటే ఖచ్చితంగా కొన్ని హై మూమెంట్స్ ఎక్సపెక్ట్ చేస్తాము. అప్పుడే నిజమైన పూనకాలు లోడింగ్..లేకపోతే ఆ లోడింగ్ ఫ్యాన్స్ కే పరిమితం. అలాగే ఎంత వింటేజ్ చిరుని చూపించాలనుకున్నా..అందుకు వింటేజ్ స్టోరీను ఎంచుకోకుండా ఉంటే బాగుండేది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, కేథరిన్ త్రెసా, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, ఊర్వశి రౌతేలా తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
Run Time: 2 గంటల 40 నిమిషాలు
విడుదల తేదీ: జనవరి 13 , 2023