`35 చిన్న కథ కాదు` మూవీ రివ్యూ, రేటింగ్
నివేదా థామస్, విశ్వదేవ్ జంటగా, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్ నటించిన `35 ఒక చిన్న కథ కాదు` సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
హీరోయిన్ నివేదా థామస్.. `నిన్నుకోరి`, `జెంటిల్‌మేన్`, `బ్రోచేవారెవరురా`, `118`, `జై లవకుశ`, `వకీల్ సాబ్` వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. కానీ ఇటీవల హీరోయిన్‌గా గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంతో వచ్చింది. ఆమె `35 చిన్న కథ కాదు` అనే చిల్డ్రన్ మూవీలో నటించింది. ఆమెకి జోడీగా విశ్వదేవ్ రాచకొండ నటించగా, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. నంద కిశోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ మూవీని సృజన్, సిద్ధార్థ్ నిర్మించారు. హీరో రానా సమర్పించడం విశేషం. అందుకే ఈ సినిమా కాస్త జనాల్లోకి వెళ్లింది. ఈ మూవీ రేపు(సెప్టెంబర్ 6) విడుదల కావాల్సి ఉంది. కానీ ముందుగానే మీడియాకి ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
తిరుపతికి చెందిన బ్రహ్మాణ ఫ్యామిలీలో జరిగే కథ ఇది. ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) బస్ కండక్టర్. ఆయన భార్య సరస్వతి(నివేదా థామస్) హౌజ్ వైఫ్. ఆమె టెన్త్ ఫెయిల్. ప్రసాద్‌కి కండక్టర్ జాబ్ రావడంతో ఎక్కడ తనకు దక్కకుండా పోతాడో అని చెప్పి స్టడీస్ పక్కన పెట్టి బావ అయిన ప్రసాద్‌ని పెళ్లి చేసుకుంది. వీరికి అరుణ్, వరుణ్ ఇద్దరు పిల్లలు.
అరుణ్ మ్యాథ్స్ లో వీక్. లెక్కల్లో అతనికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు జీరో వాడకంలోనే పెద్ద డౌట్. దాన్ని ఎవరూ సాల్వ్ చేయలేరు. ఫండమెంటల్స్ అంటూ సర్ధి చెబుతుంటారు. దీంతో ఆ మ్యాథ్స్ అర్థం కాక నానా తంటాలు పడుతుంటాడు. వీళ్ల లెక్కల మాస్టారు చాణక్య(ప్రియదర్శి) అరుణ్ కి జీరో అని పేరు పెట్టి క్లాస్‌లో చివరన కూర్చోబెడతాడు. ప్రతిసారి అరుణ్‌ని అవమానిస్తుంటాడు. అరుణ్‌ని ఫెయిల్ కూడా చేస్తాడు. అతని పక్కన ఎవరూ కూర్చోకూడదనే నిబంధన కూడా పెడుతుంటాడు.
దీంతో చాణక్యసర్‌పై రివేంజ్ తీర్చుకుంటాడు అరుణ్. మాస్టార్ బైక్‌ని పాడు చేస్తూ ఆనందం పొందుతుంటాడు. ఓ సారి దొరికిపోవడంతో అరుణ్‌ని స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తారు. అరుణ్ విషయంలో పేరెంట్స్ ప్రసాద్, సరస్వతి కూడా బాధపడుతుంటారు. అతనికి మ్యాథ్స్ పై ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నించి విఫలమవుతారు. దీంతో స్కూల్ మాన్పించి వేద పాఠశాలలో జాయిన్ చేయించాలని భావిస్తాడు ప్రసాద్. కానీ సరస్వతి ఆయన మాట వినకుండా స్కూల్ కే పంపిస్తుంది.
దీంతో భార్యాభర్తల మధ్య గొడవ, ఇద్దరు మాట్లాడుకోరు. ఈ క్రమంలో కసితో సరస్వతి ఎలాగైనా కొడుకుని పాస్ చేయించాలని కంకణం కట్టుకుంటుంది. అందుకోసం సరస్వతి ఏం చేసింది. దానికి లాయర్(గౌతమి) ఎలా సపోర్ట్ చేసింది. ప్రిన్సిపల్(భాగ్యరాజ్) అరుణ్‌కి ఎలాంటి సహకారాన్ని అందించాడు? చివరికి అరుణ్ కనీసం మ్యాథ్స్ లో 35 మార్కులైనా తెచ్చుకున్నాడా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకు వినోదాన్ని పంచే చిల్డ్రన్ మూవీస్ రావడం లేదు. ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయడం లేదు. హాలీవుడ్ నుంచి వచ్చే యానిమేషన్ సూపర్ హీరో సినిమాలే దిక్కవుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో `35 చిన్న కథ కాదు` టీమ్ గొప్ప ప్రయత్నం చేసింది. స్కూల్ పిల్లలను ప్రధానంగా చేసుకుని, చాలా మంది పిల్లలు ఇబ్బంది పడే మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ని హైలైట్ చేస్తూ ఈ మూవీని రూపొందించారు దర్శకుడు నందకిశోర్.
చిన్నపిల్లలకు కనెక్ట్ అయ్యేలా సినిమాని తెరకెక్కించారు. కానీ ఏం చెప్పాలనుకున్నాడనేది మాత్రం క్లారిటీ మిస్ అయ్యాడు. అదే సమయంలో లెక్కల్లో లాజిక్ తప్పినట్టు సినిమా విషయంలో లాజిక్ తప్పాడు. అసలు లాజిక్‌ని వదిలేసి ఎమోషన్స్, ఫన్ మీద సినిమాని నడిపించాడు. అక్కడ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సాధారణంగా ఇలాంటి సినిమాలు ఆడియెన్స్ కి అంతగా ఎక్కవు. అంత క్వాలిటీగా కూడా తీయరు.
`35 చిన్న కథ కాదు`కి మాత్రం అవి కుదిరాయి. చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం. అది అర్థం కాదు. దీంతో ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువగా ఫెయిల్ అయ్యేది కూడా ఇందులోనే. ఈ నేపథ్యంలో ఈ అంశం కొంత కనెక్టింగ్ పాయింట్. అలా పిల్లలను కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రారంభం నుంచి అరుణ్ అనే పిల్లాడు మ్యాథ్స్ లో వీక్ అనే విషయాన్ని చూపించాడు. ఓ రకంగా జీరో చుట్టూ కథ నడిపించాడు.
అయితే ఎంత చదువు మొద్దు అయినా మ్యాథ్స్ లో కొన్ని బేసిక్స్ అర్థమవుతాయి. ఇందులో అరుణ్‌కి అవి కూడా అర్థం కాదు, డౌట్స్ అడగడం ఓకే, మరీ జీరో తెచ్చుకునేంత మొద్దు అయితే ఎవరూ ఉండరు. ఇక్కడ దర్శకుడు దాన్ని ఓవర్‌గా చూపించాడు. మరో కొడుకు బాగానేచదివినప్పుడు అరుణ్ మాత్రం జీరో ఎందుకవుతున్నాడనేది లాజిక్‌కి అందని ప్రశ్న.
సినిమాలో ఎమెషన్స్ కి పెద్ద పీట వేశారు. ఇంట్లో పిల్లలతో ఎలా మాట్లాడాలి, వాళ్లు తప్పిపోతే పేరెంట్స్ ఎంతగా విలవిలలాడిపోతారు? మధ్య తరగతి కుటుంబంలో ఖర్చులు, పిల్లలకు కనీస కోరికలు తీర్చలేకపోవడం వంటి అంశాలను టచ్ చేసిన తీరు బాగుంది. దీంతోపాటు స్కూల్‌లో స్టూడెంట్స్ మధ్య ఉండే పోటీ, జెలసీ, గ్రూప్ రాజకీయాలు వంటి వాటిని చాలా ఫన్నీవేలో చూపించాడు.
అలాగే చాణక్య మాస్టర్ బైక్‌ని పక్చర్ చేయడం, బ్రేకులు పోగొట్టడం, సీట్ చించేయడం వంటి పనులు చేయడం ఫన్నీగా ఉంటాయి. ప్రియదర్శి పాత్ర, అరుణ్ పాత్రల మధ్య సన్నివేశాలు నవ్వులు పూయించేలా ఉంటాయి.
అవి కొంత వరకు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. అరుణ్‌ని స్కూల్ నుంచి సస్పెండ్ చేశాక.. పిల్లలంతా కలిసి అతన్ని కోరుకునే సీన్ ఎమోషనల్‌గా ఉంది. ఫస్టాఫ్ సరదాగా, ఫన్నీగా, కొంత ఎమోషనల్‌గా తీసుకెళ్లారు. కానీ సెకండాఫ్‌ని బాగా లాగాడు. సరస్వతి చదువుకోవడం, అరుణ్‌కి మ్యాథ్స్ చెప్పేసీన్లు, స్కూల్‌లో సస్పెన్షన్‌కి సంబంధించిన సీన్లు స్లోగా సాగుతూ బోర్ తెప్పిస్తాయి.
మరోవైపు ఎమోషన్స్, ఫన్ ఓకే, కానీ డ్రామా పండలేదు. అదే ఇందులో పెద్ద మైనస్. సెకండాఫ్‌లో కావాల్సిన డ్రామా తేలిపోయింది. ఏం జరుగుతుందో ఊహించేలా ఉంటుంది. దీంతో సినిమా సప్పగా పూర్తయిన ఫీలింగ్ కలుగుతుంది. దీనికితోడు ఒక కులాన్ని బాగా హైలైట్ చేసి చూపించారు. బలవంతంగా ఆయా అంశాలను ఇరికించినట్టుగా ఉండటం పెద్ద మైనస్.
అదే సందర్భంలో దర్శకుడు సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడనేది క్లారిటీ లేదు. పిల్లలకు ఎలా చదువు చెప్పాలో క్లారిటీ లేదు, టీచర్లు ఎలా డీల్ చేయాలో అనే దాంట్లో క్లారిటీ లేదు, పేరెంట్స్ ఎలా పెంచాలో అనే దాంట్లో స్పష్టత మిస్ అయ్యింది. ఆ దిశగా మరింత వర్క్ చేయాల్సింది. ఇలాంటి సినిమాలను ఓటీటీలో చూస్తారు. థియేటర్ లో అంటే కష్టమనే చెప్పొచ్చు.
నటీనటులుః
సరస్వతి పాత్రలో నివేదా థామస్ అదరగొట్టింది. బ్రిలియంట్స్ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చింది. ఆమెది అవార్డు యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఇల్లాలుగా, తల్లిగా చాలా మెచ్యూర్డ్ గా చేసి మెప్పించింది. వాహ్ అనిపించింది. అలాగే ఆమెకి భర్తగా నటించిన విశ్వదేవ్ యాక్టింగ్ ఇందులో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. ఇంత చిన్న ఏజ్‌లో అంత మెచ్యూర్డ్ గా చేయడం మామూలు విషయం కాదు. చించేశాడు. నటుడిగా మంచి భవిష్యత్ ఉంది.
అలాగే అరుణ్ పాత్రలో నటించిన కుర్రాడు మైండ్ బ్లోయింగ్. అతని యాక్టింగ్‌తోపాటు ఇతర స్కూల్ పిల్లల యాక్టింగ్ సినిమాకి మరో ప్లస్ అనే చెప్పాలి. ప్రియదర్శి ఓ భిన్నమైన పాత్రలో అదరగొట్టాడు. భాగ్యరాజ్, గౌతమి పాత్రలు గెస్ట్ రోల్స్ అనే చెప్పాలి. ఉన్నంతలో బాగా చేశారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
టెక్నీషియన్లుః
సినిమాకి వివేక్ సాగర్ మ్యూజిక్ పెద్ద ప్లస్. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పిల్లలు కనెక్ట్ అయ్యేలా ట్యూన్స్ ఉన్నాయి. అలాగే ఆర్ ఆర్ కూడా ఆకట్టుకుంది. చిన్న పిల్లల సినిమానే అయినా కమర్షియల్ టచ్ ఉండేలా బీజీఎం ఉండటం విశేషం. ఇక నికేత్ బొమ్మి కెమెరా వర్క్ సైతం బాగుంది. ఫ్రేములు కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా ఉన్నాయి. చిన్న సినిమా అనే ఫీలింగ్ లేకుండా చేసిందని చెప్పొచ్చు.
ఇలాంటి సినిమా చేసిన నిర్మాతలను అభినందించాల్సిందే. ఎంకరేజ్ చేసిన రానాని అభినందించాల్సిందే. ఇక దర్శకుడు నందకిశోర్.. సినిమాని బాగా డీల్ చేశాడు. పిల్లలు కనెక్ట్ అయ్యేలా, పిల్లలతో పేరెంట్స్ చూసేలా సినిమా ఉంది. వాళ్లు ఎంజాయ్ చేస్తారు. కానీ లాజికల్‌గా అనేక డౌట్స్ ని మిగిల్చే మూవీ అవుతుంది.
ఫైనల్‌గాః చిన్న పిల్లల మూవీ. మెయిన్ లాజిక్ మిస్. అవార్డులు వస్తాయి, కానీ రివార్డులు కష్టమే.
రేటింగ్‌ః 2.75