Belly Fat: పొట్ట.. మగవాళ్లకే ఎందుకు పెద్దగా వస్తుందో తెలుసా?
Belly Fat: పొట్ట ఎక్కువగా ఎవరికి వస్తుంది. వెంటనే వచ్చే సమాధానం మగవాళ్లకి.. అంతే కదా.. కాని ఎప్పుడైనా ఆలోచించారా? మగవాళ్లకే పొట్ట ఎక్కువగా ఎందుకు వస్తుందని.. ? రండి.. కారణాలు తెలుసుకుందాం.

మగవాళ్లకే పొట్ట ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం హార్మోన్ల ప్రభావం. పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అధికంగా ఉంటుంది. వయస్సు పెరిగేకొద్దీ ఈ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా కొవ్వు ఎక్కువగా పేరుకోవడానికి అవకాశం ఉంటుంది.
మహిళల్లో ఈస్ట్రోజెన్ కొవ్వును తక్కువగా నిల్వ చేసేలా పనిచేస్తుంది. కానీ పురుషుల్లో ఈ ప్రభావం ఉండదు.
కొవ్వుంతా అక్కడే..
పురుషుల శరీరం ప్రధానంగా పొట్ట ప్రాంతంలో కొవ్వును నిల్వ చేసుకునేలా రూపొందింది. అయితే మహిళల్లో కొవ్వు ప్రధానంగా తొడలు, నడుము, కడుపు పక్క భాగాల్లో పేరుకునేలా నిర్మితమైంది. అందుకే మగవాళ్లకు పొట్ట ఎక్కువగా పెరుగుతుంది.
జీవనశైలి..
వ్యాయామం చేయకుండా ఎక్కువసేపు కూర్చునే పనులు చేస్తే శరీరం కొవ్వును కరిగించలేకపోతుంది. ఎక్కువ కేలరీలు ఉన్న ఫాస్ట్ ఫుడ్, తీపి పదార్థాలు, ఆల్కహాల్ తినడం వల్ల కూడా శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది. దీనికి తోడు సరైన నిద్ర లేకపోతే, హార్మోన్లు బ్యాలెన్స్ తప్పి ఆకలి, ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఆటోమెటిక్ గా పొట్ట పెరుగుతుంది.
ఆల్కహాల్ ప్రభావం
ఎక్కువగా బీర్, వోడ్కా, విస్కీ లాంటి మద్యం తీసుకుంటే శరీరం ఎక్కువ కేలరీలు నిల్వ చేసుకుంటుంది. ఆల్కహాల్ లివర్ పనితీరును దెబ్బతీసి, కొవ్వు కరిగించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అందుకే మద్యం తాగేవారికి ఎక్కువగా పొట్ట ఉంటుంది.
వయస్సు ప్రభావం
వయస్సు పెరిగేకొద్దీ మెటబాలిజం తగ్గిపోతుంది. అంటే శరీరం త్వరగా కొవ్వును కరిగించలేదు. మహిళలు అయితే అన్ని శరీర భాగాలు పెరిగిపోతాయి. మగవాళ్లకైతే పొట్ట భాగం పెరిగిపోతుంది. వర్కౌట్ లేకపోతే పొట్ట మరీ బయటకు కనిపిస్తుంది.
ఎలా తగ్గించాలి?
కేలరీలను తగ్గించి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోజూ 30-45 నిమిషాలు నడక, జాగింగ్, యోగా చేయాలి. రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఒత్తిడి ఎక్కువైతే కార్టిసోల్ అనే హార్మోన్ పెరిగి, పొట్ట పెరుగుతుంది. అందుకే ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.