రోజూ సన్ స్క్రీన్ రాసుకుంటే ఏమౌతుందో తెలుసా?
నిజానికి సన్ స్క్రీన్ లోషన్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. దీన్ని రాసుకోవడం వల్ల సన్నని గీతలు, ముడతలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ఎండాకాలంలో బయటకు వెళ్లే ముందు ఖచ్చితంగా సన్ స్క్రీన్ ను అప్లై చేసుకోవాలి. నిజానికి ఒక్క ఎండాకాలమే కాదు.. కాలంతో సంబంధం లేకుండా దీన్ని ప్రతిరోజూ వాడాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి సన్ స్క్రీన్లను ఉపయోగిస్తారు. అయితే ఈ సన్ స్క్రీన్ లు ముడతలు, ప్రారంభ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి కూడా సహాయపడతాయి. చర్మ క్యాన్సర్, వడదెబ్బ వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. రోజూ సన్ స్క్రీన్ ను ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మ క్యాన్సర్ నివారణ
యువీఏ కిరణాలు ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. దీనిలో చర్మ క్యాన్సర్ ఒకటి. యువీబీ కిరణాలు చర్మంపై తక్షణ ప్రభావాలను చూపిస్తాయి. అయితే ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేయడం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
చర్మ సమస్యల నివారణ
సూర్యరశ్మి ఎన్నో చర్మ సమస్యలకు తొలగిస్తుంది. ఇది చర్మ కాంతిని కోల్పోయేలా చేస్తుంది. అంతేకాదు హైపర్పిగ్మెంటేషన్, మచ్చల చర్మానికి కూడా దారితీస్తుంది. ఈ చర్మ సమస్యలను నివారించడానికి సన్ స్క్రీన్ లోషన్ ఉత్తమంగా పనిచేస్తుంది.
అకాల వృద్ధాప్యం
హానికరమైన యువీఏ రేడియేషన్ కు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల చర్మం అకాల వృద్ధాప్యానికి గురవుతుంది. ఫలితంగా చర్మంపై ముడతలు, సన్నని గీతలు, కొల్లాజెన్ తగ్గడం, మృదుత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే మీ ముఖానికి సన్ స్క్రీన్ ను అప్లై చేయడం వల్ల ఈ సమస్యల నుంచి రక్షణ పొందుతారు. సన్ స్క్రీన్ మీ చర్మాన్ని చాలా కాలం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
చర్మ ఆరోగ్యం
సన్ స్క్రీన్ కొల్లాజెన్, కెరాటిన్, ఎలాస్టిన్ వంటి ముఖ్యమైన చర్మ ప్రోటీన్లను రక్షిస్తుంది. ఆరోగ్యకరమైన, మృదువైన చర్మాన్ని నిర్వహించడానికి ఈ ప్రోటీన్లు చాలా అవసరం. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి, ఈ ప్రోటీన్ల చర్యను రక్షించడానికి, మీ సన్ స్క్రీన్ లో టైటానియం డయాక్సైడ్ ఉందని నిర్ధారించుకోండి.
వడదెబ్బ వల్ల కలిగే సమస్యలు
వడదెబ్బ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మచ్చలను కలిగిస్తుంది. అయితే చర్మానికి సన్ స్క్రీన్ ను అప్లై చేయడం వల్ల మీ చర్మంపై పీలింగ్, వాపు, ఎరుపు, దద్దుర్లు, దురద వంటి వడదెబ్బ వల్ల కలిగే సమస్యలు తొందరగా తగ్గిపోతాయి.
మీరు ఎండలో ఉంటే 30 లేదా అంతకంటే ఎక్కువ ఎస్పిఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ను వాడండి. ముఖ్యంగా ప్రతి రెండు గంటలకు ఒక సారి దీన్ని రాసుకోండి. ఖనిజ ఆధారిత సన్ స్క్రీన్ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది చర్మాన్ని రక్షించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.