pregnancy tips : గర్భిణులకు ఆ సమస్య రాకూడదంటే .. ఈ జ్యూస్ లను తప్పక తాగాల్సిందే..
pregnancy tips : చాలా మంది గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య తగ్గడానికి వీరు పోషకాహారం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల జ్యూస్ లు కూడా రక్తహీనత సమస్యకు చెక్ పెడతాయి. అవేంటంటే..
గర్భిణుల్లో సర్వసాధారణంగా వచ్చే సమస్య రక్తహీనత . ఈ సమస్య వారి ఒంట్లో ఐరన్ లోపించడం వల్ల వస్తుంది. మన శరీరం ఇనుమును హిమోగ్లోబిన్ తయారీ కోసం వాడుతుంది. ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ను కణజాలాలకు అందిస్తుంది. కాగా గర్బిణుల్లో తల్లికి, బిడ్డకు ఆక్సిజన్ ను అందించడానికి ఐరన్ ఎంతో అవసరం. అంతేకాదు ఈ ఐరన్ బ్లడ్ తయారీకి కూడా ఉపయోగపుతుంది.
అంతేకాదు గర్బంలో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదలకు కూడా ఇది చాలా అవసరం. ఇకపోతే గర్భాధారణ సమయంలో మహిళలకు అదనంగా 450 మిల్లీ గ్రాముల ఇనుము చాలా అవసరం. ఒకవేళ గర్భిణుల్లో రక్తహీనత సమస్య వస్తే.. బిడ్డ నెలలు నిండకుండానే పుట్టే అవకాశం ఉంది. అంతేకాదు బిడ్డ కూడా బరువు ఉండడు. అందుకే రక్తహీనత సమస్య రాకూడదంటే.. గర్భిణులు ఐరన్ ను పెంచే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల జ్యూస్ లు రక్తహీనత సమస్యను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
జామ, పుచ్చకాయ జ్యూస్.. జామకాయ, పుచ్చకాయను కలిపి జ్యూస్ గా చేసుకుని తాగితే .. రక్తహీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ జ్యూస్ ను మీ రోజు వారి డైట్ చేర్చుకోవడం వల్ల రక్తహీనత సమస్య వస్తుందన్న టెన్షనే ఉండదు. జామకాయలో, పుచ్చకాయలో ఐరన్, విటమిన్ సి మెండుగా ఉంటాయి. అంతేకాదు గర్బిణులకు అవసరమైన పోషకాలు ఈ రెండింటి నుంచి లభిస్తాయి. ప్రతిరోజూ ఒక జామ, పుచ్చకాయ జ్యూస్ ను తాగితే ఒంట్లో రక్తం పెరుగుతుంది.
యాపిల్ జ్యూస్.. గర్భిణులు ప్రతిరోజూ గ్లాస్ యాపిల్ జ్యూస్ ను తాగితే ఎంతో మంచిది. ఈ జ్యూస్ ద్వారా విటమిన్స్, ఐరన్ లభిస్తాయి. ఈ జ్యూస్ లో ఉసిరిని మిక్స్ చేసుకుని తాగితే విటమిన్ సి లభిస్తుంది. ఈ విటమిన్ సి మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ గ్రహించడానికి ఎంతో సహాయపడుతుంది.
పాలకూర క్యారెట్ జ్యూస్.. తాజా ఆకుకూరలను, పండ్లను తింటే రక్తహీనత సమస్య నుంచి తొందరగా బయటపడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎనిమియా సమస్య ఉన్నవారు క్యారెట్, పాలకూరను జ్యూస్ గా చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు సలహానిస్తున్నారు. వీటిలో విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.
బీట్ రూట్ జ్యూస్.. బీట్ రూట్ జ్యూస్ లో విటమిన్ సి, ఐరన్ మెండుగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ బి6, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రక్తహీనత సమస్యకు చెక్ పెట్టడమే కాదు రక్తాన్ని కూడా పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.