heart attack risk: ఈ మూడు అలవాట్లను మార్చుకోలేదో.. గుండె పోటు వస్తుంది జాగ్రత్త..
heart attack risk: ప్రస్తుతం మన దేశంలో హార్ట్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. దీనికి కారణాలు లేకపోలేదు. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్లే ఎన్నో వ్యాధులు సోకుతున్నాయి.

heart attack risk: ఈ గజిబిజీ లైఫ్, హానీ చేసే ఆహారపు అలవాట్ల మూలంగా రోజు రోజుకు పెరుగుతున్న రోగాల్లో గుండెపోటు ఒకటి. ఈ గుండె పోటు సమస్య ఒకప్పుడు వృద్ధాప్యంలోనే వచ్చేది. ఈ గుండె పోటు వయసు మీద పడుతున్నవారికే వచ్చేదిగా పరిగణించేవారు కూడా.
కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యువకులు సైతం ఈ ప్రమాదకారికి బాధితులుగా మారుతున్నాయి. గతేడాది ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్, సిద్ధార్థ్ శుక్లా లు హార్ట్ ఎటాక్ తోనే మరణించారు.
గుండెపోటు ఎందుకు వస్తుంది... ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుండెకు Blood flow ఆగినప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుంది. గుండె నాళాల్లో కొలెస్ట్రాల్, కొవ్వు, ఇతర పదార్థాలు పేరుకుపోయినప్పుడు ఇలా జరుగుతుంది.
మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల గుండె పోటు ప్రమాదం మరింత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని అలవాట్లను మార్చుకుంటే హార్ట్ ఎటాక్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
బరువును నియంత్రణలో ఉంచుకోకపోవడం.. ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్య సర్వసాధారణం అయ్యింది. దీనిబారిన పడిన వాళ్లు ఎంతో మంది అనేక రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వీరికి గుండె పోటు ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అధిక బరువు వల్ల అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్, మధుమేహం, అధిక ట్రైగ్లిజరైడ్ వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటి మూలంగానే హార్ట్ ఎటాక్ రిస్క్ పెరుగుతుందని తేల్చి చెబుతున్నారు. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
స్మోకింగ్, ఒత్తిడి.. అధికంగా ఒత్తిడికి గురయ్యే వారు, స్మోకింగ్ కు బానిసలుగా మారిన వారే ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. వాస్తవానికి స్మోకింగ్ వల్ల ధమనుల్లో ఫలకం ఏర్పడటానికి దారి తీస్తుంది. ఇది ధమనులు సంకోచితమయ్యేలా చేస్తాయి. దీనిమూలంగానే గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది. తద్వారా గుండె జబ్బులు వస్తాయి.
అదేవిధంగా విపరీతంగా ఒత్తిడికి లోనైతే అధిక రక్తపోటు సమస్య కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా గుండె జబ్బులకు ప్రధాన కారకంగా పరిగణించబడుతుంది. అందుకే ఒత్తిడికి గురికాకుండా, స్మోకింగ్ కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
శారీరక శ్రమ తగ్గడం.. ఎలాంటి శారీరక శ్రమ చేయని వారికి గుండె పోటు ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవడం వల్లే హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు కూడా తేల్చి చెబుతున్నాయి. ఎలాంటి పని చేయని వారి ధమనుల్లో కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది. దీనివల్ల గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే ధమనులు మూసుకుపోయినా లేదా అవి దెబ్బతిన్నా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు నిత్యం వ్యాయామం, యోగా వంటివి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శారీరక శ్రమ వల్లే గుండెపోటు, గుండె జబ్బులు సోకే అవకాశం తక్కువ అవుతుంది.