జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని తినండి
Health Benefits of Green Peas : పచ్చి బఠానీలు మనందరం తింటాం. కానీ వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. రోజు పచ్చి బఠానీలు తింటే మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా?
ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పచ్చి బఠానీలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు వంటివి కళ్ళను ఆరోగ్యంగా ఉంచడం నుండి కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షణ కల్పించడం వరకు ఇవి సహాయపడతాయి.
శరీరానికి అవసరమైన కెరోటినాయిడ్లు ల్యూటిన్, జియాక్సంతిన్ లు పచ్చి బఠానీలలో ఉంటాయి. వృద్ధాప్య సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్, కంటిశుక్లం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కళ్ళను రక్షించడంలో ఈ పోషకాలు సహాయపడతాయి. హానికరమైన నీలి కాంతి నుండి వడపోతలుగా ల్యూటిన్, జియాక్సంతిన్ లు పనిచేస్తాయి.
పచ్చి బఠానీలలో ఎ, బి, సి, ఇ, కె వంటి అనేక రకాల విటమిన్లు ఇందులో ఉంటాయి. దీనితో పాటు జింక్, పొటాషియం, ఫైబర్ లతో కూడా ఇది సమృద్ధిగా ఉంటుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచే ఫైబర్ కలిగిన ఆహారం కూడా పచ్చి బఠానీలు. అందుకే పచ్చి బఠానీలను మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కౌమెస్ట్రోల్ అనే పోషకం పచ్చి బఠానీలలో ఉంటుంది. ఇది కడుపు క్యాన్సర్ నుండి రక్షణ కల్పించడంలో సహాయపడుతుంది. 2009 లో మెక్సికో సిటీలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ పచ్చి బఠానీలు, ఇతర చిక్కుళ్ళు తినడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50% తగ్గుతుంది. దీంతో పాటు ప్రతిరోజు పచ్చి బఠానీలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
డయాబెటిస్ ఉన్న వారు కూడా పచ్చి బఠానీలు తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో పచ్చి బఠానీలు సహాయపడతాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. మతిమరపు సమస్యను ఎదుర్కొంటున్న వారిలో పచ్చి బఠానీలు ప్రభావం చూపుతాయని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇది ఎంతవరకు అనేది స్పష్టత లేదు.
పచ్చి బఠానీలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దీనివల్ల మధుమేహం, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేసే ఫైబర్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి కడుపు సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.