దీపావళి స్పెషల్ లడ్డూలు.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..
దీపావళి పండుగకి స్వీట్లే స్పెషల్. అందుకే రకరకాల స్వీట్లను మార్కెట్ లో కొంటుంటారు. అయితే కొన్ని లడ్డూలను ఇంట్లోనే చాలా సులువుగా, టేస్టీగా తయారుచేసుకోవచ్చు. అవేంటో చూద్దాం పదండి..
దీపావళి పండుగ రానే వచ్చింది. ఇక ఈ రోజు ఇళ్లంతా చుట్టాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ పండగకు దీపాలతో ఇంటినంతా అలకరిస్తారు. ఇక వచ్చిన అతిథులకు కోసం రకరకాల స్వీట్లు, తీరొక్క వంటను తయారుచేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి వీటిని తయారుచేసే టైం లేక మార్కెట్లో కొంటుంటారు. కానీ మార్కెట్ లో ఉండే స్వీట్లు, సాక్స్ ఆరోగ్యానికి అంత మంచివి కావు. వాటిలో ఉపయోగించే నూనె, చక్కెర, ఇతర హానికరమైన పదార్థాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఇంట్లోనే వీటిని తయారుచేసుకోవడం మంచిది.
ఈ దీపాల పండుగను మరింత ఆనందంగా, ఆహ్లాదకరంగా మార్చడంలో.. స్నాక్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే దీపావళి పండుగకు స్నేహితులకు, బంధువులకు, పొరుగింటి వారికి స్వీట్లను పంచుతుంటారు. అయితే కొన్ని స్వీట్లను ఇంట్లోనే సులువుగా తయారుచేయొచ్చు. ఇంట్లోనే చాలా టేస్టీగా.. సులువుగా చేసుకునే బూందీ లడ్డూలను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ladoo
కావాల్సిన పదార్థాలు
శెనగపిండి 1 కప్పు
నీరు 3/4 కప్పులు
యాలకుల పొడి 1/2 టీస్పూన్
నెయ్యి 2 టీస్పూన్
పంచదార 1 కప్పు
కలర్ ఒక చిటికెడు
నట్స్ అవసరమైనన్ని
నూనె తగినంత
కొన్ని ఎండుద్రాక్షలు
బూంది తయారుచేసుకునే పద్దతి
బూంది తయారీ కోసం ముందుగా.. ఒక గిన్నె తీసుకుని శెనగపిండిని వేసి.. మూడొంతుల నీళ్లను పోసి బాగా కలపండి. ఇదీ మరీ పల్చగా, మరీ చిక్కగా కాకుండా బూందీ జారేటట్టుగా కలుపుకోండి. ముఖ్యంగా పిండి ముద్దలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణలీలో ఆయిల్ పోయండి. నూనె బాగా వేడిక్కిన తర్వాత బూందీని వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేయాలి.
ladoo
త తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టి వేడి అయిన తర్వాత ఒక కప్పు పంచదారకు మూడొంతుల నీటిని కలపండి. దీనిలో రంగు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఐదు నిముషాలు బాగా మరిగిన తర్వాత అంటే పానకం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ను ఆపేయండి. దీనిలో తయారుచేసిపెట్టుకున్న బూందీని, నెయ్యిని వేసి బాగా కలపండి. దీనిని తక్కువ మంట మీద 10 నిమిషాల పాటు వేడి చేయండి. ఆ తర్వాత మంటను ఆపేసి నట్స్ వేసి కలపండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూల్లా చుట్టండి. ఈ లడ్డూలను ఎండుద్రాక్షలతో అలంకరిస్తే సరి.. తీయ తీయని టేస్టీ టేస్టీ లడ్డూలు రెడి అయినట్టే..