IBPS PO 2025; బ్యాంకుల్లో 5208 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
బ్యాంక్ రంగంలో ఉద్యోగం కోరే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్.IBPS ద్వారా దేశవ్యాప్తంగా 5208 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 21, 2025.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అసిస్టెంట్ మేనేజర్
బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న గ్రాడ్యుయేట్‌లకు ఇది ఒక చక్కటి అవకాశం. ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీస్ (IBPS) సంస్థ దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అసిస్టెంట్ మేనేజర్ లేదా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకారం మొత్తం 5208 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ప్రముఖ బ్యాంకుల్లో ఖాళీలు
ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ బ్యాంకుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయస్సు జూలై 1, 2025 నాటికి కనీసం 20 సంవత్సరాలు, గరిష్ఠంగా 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వర్గాల వారికి 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు
ఈ ఉద్యోగానికి సంబంధించిన నెలవారీ వేతనం ప్రారంభంలో రూ. 48,480గా ఉంటుంది. అనుభవం ప్రమోషన్ ఆధారంగా ఇది గరిష్ఠంగా రూ. 85,920 వరకు పెరుగుతుంది.
ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశ ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశ మెయిన్స్ పరీక్ష, చివరిగా ఇంటర్వ్యూ. ఈ మూడు దశల ద్వారా ఎంపికైనవారు ఖాళీలను భర్తీ చేస్తారు
ప్రిలిమినరీ పరీక్ష వివరాలు:
ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. అభ్యర్థులు ఇంగ్లీష్ భాష, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అంశాలలో 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ప్రతి విభాగానికి 20 నిమిషాల సమయం ఉంటుంది. మొత్తం పరీక్ష వ్యవధి 1 గంట. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో అర్హత సాధించినవారే మెయిన్స్‌కు అర్హులు అవుతారు. ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టు 2025లో జరగనున్నాయి.
మెయిన్స్ పరీక్ష వివరాలు:
మెయిన్స్ పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అంశాలపై మొత్తం 145 ప్రశ్నలు ఉంటాయి. ఇవి 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది.
రెండవ భాగం డెస్క్రిప్టివ్ పరీక్ష. ఇందులో అభ్యర్థులు వ్యాసం లేదా లేఖ రచన వంటి అంశాల్లో రెండు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఇది 50 మార్కులకు, వ్యవధి 30 నిమిషాలు.
మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 2025లో నిర్వహించబడే అవకాశముంది.
ఇంటర్వ్యూకు ఎలా ఎంపిక చేస్తారు:
మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తరువాత ఇంటర్వ్యూకు పిలుస్తారు.ఈ ఇంటర్వ్యూలు నవంబర్ లేదా డిసెంబర్ 2025లో జరుగుతాయని IBPS అంచనా వేస్తోంది. మెయిన్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు. అందులో వచ్చిన ర్యాంకుల ప్రకారం అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఎలా చేయాలి:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటే, IBPS అధికారిక వెబ్‌సైట్ అయిన https://ibps.in ను సందర్శించి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫారమ్ను పూరించాలి. ఇతర మార్గాలలో దరఖాస్తులు స్వీకరించరు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై ఉంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 21, 2025.
దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ EWS వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులవారికి రూ. 175గా నిర్ణయించారు.
మరిన్ని వివరాల కోసం:
పరీక్షా సిలబస్, అడ్మిట్ కార్డు విడుదల తేదీలు, ఇతర ముఖ్యమైన సమాచారం కోసం IBPS అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకింగ్ రంగంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులకు సూచిస్తున్నారు. సరైన ప్రిపరేషన్‌తో ఎంపికవడానికి వీలు ఉండేలా పరీక్షల ముందు సిలబస్, మాక్ టెస్టులు, పాత ప్రశ్నాపత్రాల అధ్యయనం చేయడం ఎంతో ఉపయోగకరం.