Betting apps: అన్వేష్ నిజంగానే 'గొప్ప ఆటగాడు'.. దెబ్బకు దిగొస్తున్న యూట్యూబర్లు
బెట్టింగ్ యాప్స్.. ఇటీవల వీటి గురించి ఎక్కువగా వినిపిస్తోంది. సరదాగా మొదలై జీవితాలను నాశనం చేసే గేమ్స్‌కి యువత పెద్ద ఎత్తున అట్రాక్ట్ అవుతున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి చివరికి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్‌కి ప్రచారంలో కల్పించడంలో కొంతమంది యూట్యూబర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే ఇప్పుడు వీరి పాపం పండింది. తగిన మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది..

Na anveshana avinash
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఏమాత్రం క్రేజీ ఉన్నా సరే వెంటనే ఇన్ఫ్లూయర్స్‌గా మారిపోతున్నారు. అయితే కొందరు ఈ సెలబ్రిటీ స్టేటస్‌ను తప్పుడు దారిలో ఉపయోగించుకుంటున్నారు. చట్ట విరుద్ధమైన బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేందుకు తమ ఫేమ్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇందుకు బదులుగా బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.
అయితే ఒక్క యూట్యూబర్ మాత్రం దీనికి వ్యతిరేకంగా గలమెత్తాడు. అతడే ప్రపంచ యాత్రికుడు అన్వేష్. నా అన్వేషణ పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తూ, ఆయా దేశాల విశేషాలను వివరిస్తూ.. లక్షల్లో సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకున్నాడు. అయితే మొదటి నుంచి అన్వేష్ బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నాడు. అక్కడితో ఆగకుండా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారిపై తనదైన శైలిలో విరుచుకు పడ్డాడు.

Naa Anveshana avinash about betting apps
సజ్జనార్‌తో మాట్లాడిన అన్వేష్:
ఇందులో భాగంగానే ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో అన్వేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి వారి మధ్య చర్చ జరిగింది. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా పోరు చేస్తున్న అన్వేష్‌పై సజ్జనర్ ప్రశంసలు సైతం కురిపించారు. బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని, బాధితులను ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్‌లు నిర్వహించే వారు పెద్దఎత్తున ప్రకటనలు ఇస్తు మోసగిస్తున్నారని అన్వేష్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.
police have registered a case against 11 celebrities for promoting Betting apps in telugu
అప్పటి నుంచి మొదలైన యాక్షన్:
ఈ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు ప్రారంభం కావడం గమనార్హం. బెట్టింగ్ యాప్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తెలిపిన సజ్జనార్ ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజతో సహా 11 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌లపై కేసు నమోదు చేశారు. దీంతో ఇదంతా అన్వేష్ కృషి ఫలితమేనని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు సైతం పలువురు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతున్నారు. గతంలో తమకు తెలియకుండా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశామని, వాటిని ఎవ్వరూ నమ్మొద్దని వీడియోలు పెడుతున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే రూ. 10 లక్షల జరిమానా తప్పదు:
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. వినియోగదారుల ఫోరం సవరణ చట్టం 1986 చట్టం ప్రకారం సెలబ్రిటీలు మోసపూరితమైన యాప్‌లు, ఉత్పత్తులకు ప్రచారం చేస్తే వారిపై ఏడాది నుంచి మూడేళ్ల పాటు నిషేధం విధిస్తారు. అంతేకాకుండా రూ.10లక్షల జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. చేసిన తప్పే మళ్లీ చేస్తే జైలుశిక్ష తప్పదని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.